కేంద్ర మంత్రి ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు తలవంచుతారా?
x
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు

కేంద్ర మంత్రి ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు తలవంచుతారా?

పోలవరం 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వెనుక రాజకీయ లాభాలు, ఆంధ్రప్రదేశ్‌కు జరిగే నష్టం ఏమిటి?


కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జరిపిన సమావేశంలో రాష్ట్ర హితాలకు తీవ్ర హాని కలిగించే ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు వెలువడిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, గోదావరి-కావేరి లింక్, పోలవరం ఎత్తు తగ్గించడం వంటి అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ‘అలోచనాపరుల వేదిక’ డిమాండ్ చేసింది.

2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తే కృష్ణా జల సమస్య పరిష్కారమవుతుందని కేంద్ర మంత్రి సూచించారు. గోదావరి-కావేరి అనుసంధానంలో సమ్మక్క-సారలక్క నుంచి నాగార్జునసాగర్ లింక్‌ను అంగీకరిస్తే పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం చేపట్టాలని సూచన వచ్చిందని, కానీ పోలవరం పైభాగం నుంచి గోదావరి నీటిని కావేరికి మళ్లిస్తే అది ఆంధ్రప్రదేశ్‌కు ‘ఆత్మహత్యా సదృశ్యం’ అని ఆలోచనాపరుల వేదిక తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

పోలవరం ఎత్తు తగ్గిస్తే...

పోలవరం బహుళార్థ ప్రాజెక్టును కేంద్ర జల సంఘం అనుమతించిన 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించి, 194 టీఎంసీ గరిష్ట నిల్వ సాధించాలని ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తగ్గింపు వల్ల సాగునీటి సామర్థ్యం తగ్గి, గోదావరి డెల్టాలోని లక్షల ఎకరాల పంటలు ప్రభావితమవుతాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గి, ఆర్థిక నష్టం పెరుగుతుంది. 41.15 నుంచి 45.72 మీటర్ల మధ్య ఉన్న నిర్వాసితులకు రీహ్యాబిలిటేషన్, రీసెటిల్‌మెంట్ (ఆర్&ఆర్) పథకం అమలులో స్పష్టత లేదని వేదిక ఆరోపించింది.

కేంద్రానికి రాజకీయ లాభాలు ఏమిటి? ఎందుకు ఎత్తు తగ్గించాలని కోరుతున్నారు?

రాజకీయంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం పెట్టిన షరతులు (పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో ముంపు సమస్యలు)ను కేంద్రం తిరస్కరించకపోవడం వెనుక జాతీయ రాజకీయ సమీకరణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ హక్కులను రక్షించడం ద్వారా కేంద్రం ఆ రాష్ట్రంలో తన రాజకీయ స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే జాతీయ స్థాయిలో నదుల అనుసంధాన పథకాలు (గోదావరి-కృష్ణా-కావేరి లింక్) ముందుకు తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్‌ను రాజీ చేయించుకోవాలని కేంద్రం భావిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


కర్ణాటక షరతులు ఏమిటి? నదుల అనుసంధానం సాధ్యమా?

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఆలోచనాపరుల వేదిక అభినందించింది. కానీ కర్ణాటక కూడా కృష్ణా జలాలపై తన హక్కుల కోసం షరతులు విధిస్తోంది. ఈ పరిస్థితుల్లో గోదావరి నీటిని ఇతర రాష్ట్రాలకు మళ్లించే అనుసంధాన పథకాలు ఆంధ్రప్రదేశ్ హక్కులను హరించే ప్రమాదం ఉందని వేదిక హెచ్చరించింది. ఈ విధానాలతో నదుల అనుసంధానం ముందుకు సాగడం కష్టం అని స్పష్టమవుతోంది.

చంద్రబాబు నాయుడు కర్తవ్యం?

అలోచనాపరుల వేదిక నాయకులు సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రతిపాదనలకు తలవంచి రాష్ట్ర హక్కులను రాజీ చేసుకోవడం సరైనదేనా? గోదావరి జలాలపై తక్షణం ట్రిబ్యునల్ నియమించాలని కేంద్రానికి ఉత్తరం రాయాలని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పుల మేరకు రాష్ట్ర హక్కులను రక్షించే సమగ్ర ప్రణాళిక రూపొందించి, నిపుణులు-ఉద్యమకారులతో చర్చించి అమలు చేయాలని వేదిక సూచించింది.

వాస్తవాలు బయటపెట్టాలి

పోలవరం ఎత్తు తగ్గించడంపై అధికార-ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలకు నిజాలు బయటపెట్టాలని అలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర హితాలను కాపాడటం ముఖ్యమంత్రి ప్రాథమిక కర్తవ్యమని వేదిక నాయకులు వ్యాఖ్యానించారు. పత్రికలకు ప్రకటన విడుదల చేసిన వారిలో ఏబీ వెంకటేశ్వరరావు, కంభంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి. లక్ష్మీనారాయణ, సలమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు లు ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదేమిటి...?

ఆంధ్రప్రదేశ్ ని కరువు రహిత రాష్ట్రంగా మార్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అదే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం ఆయన కార్యాలయం లో కలసి గంటపాటు చర్చలు జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో మీడియాకు వివరించారు. పోలవరం సత్వర పూర్తి కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని జలశక్తి మంత్రి పాటిల్ సీఎం బృందానికి హామీ ఇచ్చారని రామానాయుడు చెప్పారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు. అలాగే గోదావరి-కావేరి అనుసంధానానికి కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నట్లు చెప్పారు.

సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేట్ దెబ్బతిన్నప్పుడు దాన్ని తక్షణం మార్చి పెను ప్రమాదాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నివారించగలిగిందన్నారు. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కు 33 కొత్త గేట్లు మారుస్తున్నట్లు ఆయన చెప్పారు.

పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ (పోలవరం ప్రాజెక్టును ఎలాంటి భయం లేకుండా పూర్తి చేసుకోవడానికి కేంద్రం నుంచి శాశ్వత గ్రీన్ సిగ్నల్ కోరడం) ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వివరించారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల పునరావాసం, పరిహారాలకు సంబంధించి నిధులను సకాలంలో సమకూరుస్తామని కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రెండో దశలో కీలకమైన భూసేకరణ, పునరావాసం కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరమన్నారు.

ప్రతి ఏడాది గోదావరిలోని 3000 టీఎంసీలు నీరు బంగాళాఖాతంలో కలిసిపోతున్నందున ఈ వృధా జలాలను వినియోగించుకునే విధంగా ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని, గోదావరి వృధా జలాల వినియోగించుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు లబ్ధి పొందాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం అన్నారు. చిన్నపాటి సమస్యలు ఏమైనా తెలంగాణతో ఉంటే సానుకూల వాతావరణంలో చర్చల ద్వారా సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ వంటి వాటికి కర్ణాటక ముందుకు వెళ్లకుండా సహకరించాలని కోరామని చెప్పారు.

Read More
Next Story