రిజర్వేషన్ ను ఆర్థిక కోణంలో ఎందుకు చూడాలి?
x
భారత సుప్రీం కోర్టు

రిజర్వేషన్ ను ఆర్థిక కోణంలో ఎందుకు చూడాలి?

రిజర్వేషన్ సామాజిక న్యాయం కోసం పుట్టిందని జడ్జిలకు తెలియదా?


రిజర్వేషన్ ఒక సామాజిక న్యాయ సాధనం. కానీ దాన్ని కొందరు శాశ్వత హక్కుగా చూస్తే వ్యవస్థ ఉద్దేశం నెరవేరదు. క్రిమి లేయర్ ఆ ఉద్దేశాన్ని కాపాడటానికి ఉన్న ఒక మెకానిజం. ఐఏఎస్ ల పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే అంటరానితనం ఉండబట్టే రిజర్వేషన్ వ్యవహారం రాజ్యాంగంలో పొందుపరచాల్సి వచ్చింది. ఒక విధంగా రిజర్వేషన్ సామాజికపరమైనది. దానిని ఆర్థిక కోణంలో చూడటం ఒక భాగం మాత్రమే కావొచ్చు. అదే తుది నిర్ణయం కాకూడదు. సామాజిక వ్యత్యాసాలు ఎప్పుడైతే రూపుమాసిపోతాయో అప్పుడే నిజమైన సమాజ పురోగతి.

క్రిమి లేయర్ అంటే ఏమిటి?

క్రిమి లేయర్ అనేది భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థలో ఉపయోగించే ఒక ముఖ్యమైన భావన. ఇది ‘సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు వచ్చిన (అభివృద్ధి చెందిన) వ్యక్తులను’ రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి మినహాయించడానికి ఉద్దేశించినది. సాధారణంగా తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు (కొన్ని ఇతర ప్రమాణాలతో కలిపి) దాటితే ఆ వ్యక్తి క్రిమి లేయర్‌గా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఇలాంటి వారు OBC రిజర్వేషన్ పొందలేరు.

ప్రస్తుతం ఎవరికి అమలవుతోంది?

ప్రధానంగా OBCలకు మాత్రమే దీర్ఘకాలంగా అమలు చేస్తున్నారు (1992 Indra Sawhney కేసు నుంచి).

SC, STలకు సాంప్రదాయకంగా క్రిమి లేయర్ అమలు చేయడం లేదు. కానీ 2024లో సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో రాష్ట్రాలు SC/STలలోనూ క్రిమి లేయర్‌ను గుర్తించి మినహాయించాలని సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా దాన్ని పూర్తిగా అమలు చేయడం లేదు.

ఎందుకు SC/STకు అమలు చేయలేదు?

SC/ST రిజర్వేషన్ ముఖ్యంగా ‘సామాజిక అస్పృశ్యత, చారిత్రక అన్యాయం’ ఆధారంగా ఇచ్చారు. వారి వెనుకబాటుతనం కేవలం ఆర్థికం కాదు, సామాజికమైనది కాబట్టి క్రిమి లేయర్‌ను వర్తింపజేయలేదు. OBCల విషయంలో వెనుకబాటుతనం మరింత సాపేక్షం (సామాజిక+ఆర్థిక) కాబట్టి క్రిమి లేయర్‌ను ప్రవేశపెట్టారు.

ఓబీసీల్లో కుల వివక్షకు గురవుతున్న వారు లేరా?

ఓబీసీల్లో ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్న వారు ఉన్నారు. ప్రభుత్వం లేరని చెబుతున్నా అది సత్యం కాదని గమనించాలి. కాటికాపరి, రజక, దాసరి, కుమ్మరి, కమ్మరి, పిచ్చిగుంట్ల, బుడబుక్కల, బుడగజంగం, జంగం వంటి చాలా కులాల వారు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారు. ఏపీ ప్రభుత్వం వీరిని కించ పరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొన్ని జీవోలు కూడా జారీ చేసింది.


జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యలు

ఇటీవల ఓ OBC వ్యక్తి (తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు) కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనంలోని జడ్జిలు ఇలా అన్నారు.

‘‘ఇద్దరు IAS అయితే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు కావాలి?’’

విద్య, ఆర్థిక స్థాయి పెరిగితే సామాజికం దాటి ముందుకు వచ్చేస్తారు. అప్పుడు మళ్లీ రిజర్వేషన్ కోరితే ఎప్పటికీ బయటపడం.

రిజర్వేషన్ సామాజిక-ఆర్థికంగా బలవంతులైన వారికి కాకుండా, నిజంగా వెనుకబడిన వారికి చేరాలి.

ఇది సరైందేనా?

చాలా మంది న్యాయవాదులు, సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని సమర్థిస్తారు. రిజర్వేషన్ ఉద్దేశం ‘సమానత్వం’ ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరిన వారు దాన్ని ఆక్రమిస్తే నిజమైన వెనుకబడిన వారికి మేలు జరగదు. కానీ కొందరు ఇది రిజర్వేషన్ ఆశయాన్ని బలహీనపరుస్తుందని వాదిస్తారు.

రిజర్వేషన్ సామాజికమా? ఆర్థికమా?

‘ముఖ్యంగా సామాజికం’. రాజ్యాంగం ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (Socially and Educationally Backward Classes)’ అని చెప్పింది. ఆర్థికం ఒక అంశం మాత్రమే.

ఆర్టికల్ 15(4): సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, SC, STల కోసం ప్రత్యేక నిబంధనలు.

ఆర్టికల్ 16(4): ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్.

EWS (Economically Weaker Sections) కోసం 10శాతం రిజర్వేషన్ (103వ సవరణ) మాత్రమే ప్రధానంగా ఆర్థిక ఆధారంగా ఉంది.

నిజమైన వెనుకబాటుతనం ఆర్థికం కూడా... న్యాయవాది డొక్కా రాజగోపాల్

సామాజిక వెనుకబాటుతనం ఉన్నా, ఒక వ్యక్తి ఆర్థికంగా బాగా ముందుకు వచ్చేస్తే (ఉదా: IAS/IPS అయిపోతే, పెద్ద వ్యాపారం చేస్తే), అతని పిల్లలు ఇక వెనుకబడిన వారిలా ఉండరు. వారికి రిజర్వేషన్ ఇవ్వడం నిజంగా అవసరం ఉన్న వారిని దెబ్బతీస్తుంది.

ఆర్థికం ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చారు: తిర్లుక దినేష్, మెకానికల్ ఇంజనీర్

EWS రిజర్వేషన్ (10 శాతం) 2019లో రాజ్యాంగ సవరణ ద్వారా పేదలైన జనరల్ వర్గం వారికి ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చారు. ఇది రిజర్వేషన్ ఆర్థిక కోణాన్ని అధికారికంగా గుర్తించడం.

పేదవారు ఏమి కావాలి? : పి శ్రీనివాస్, న్యాయవాది, ఒంగోలు.

సమాజంలో మార్పు 76 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత చాలా మంది SC/ST/OBCలు ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు వచ్చేశారు. కేవలం కులం ఆధారంగా మాత్రమే చూస్తే, నిజంగా పేదవారు (ఏ కులం వారైనా) వెనక్కి మిగిలిపోతారు.

Read More
Next Story