మూడేళ్ల తరువాత తిరుమల యాత్రికులకు అరుదైన అవకాశం కలగనుంది. అధిగమాసం కావడం వల్ల ఈసారి శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. రెండు బ్రహ్మోత్సవాలు రావడానికి ఖగోళశాస్త్రం ఆధారంగా మారింది. దీనిని అధిగమాసం అని ఎందుకు సంబోధిస్తారు? అనేది కూడా ఓ ప్రశ్న. ఈ ఏడాది సెప్టెంబర్ లో మొదటి బ్రహ్మోత్సవం, అక్టోబర్ లో వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది.
రెండు బ్రహ్సోత్సవాల నేపథ్యం ఏమిటి?
ఒకే ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనం 'చాంద్రమానం' (చంద్రుడి గమనం) ఆధారంగా పండుగలను లెక్కిస్తాం. సూర్యుడి గమనం ఆధారంగా 'సౌరమానం' నడుస్తుంది. సౌర సంవత్సరానికి 365 రోజులు ఉంటే, చాంద్ర సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే టా ఈ రెండింటి మధ్య 11 రోజుల వ్యత్యాసం వస్తుంది.
ఇలా మూడేళ్లు గడిచేసరికి దాదాపు ఒక నెల (33 రోజులు) తేడా వస్తుంది. ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తూ.. ప్రతి మూడేళ్లకు ఒకసారి పంచాంగంలో ఒక అదనపు నెలను కలుపుతారు. దాన్నే 'అధిక మాసం' అంటారు. ఈ ఏడాది అలా అధిక మాసం రావడంతో.. తిరుమలలో సాంప్రదాయబద్ధంగా 'సాలకట్ల బ్రహ్మోత్సవాలు', 'నవరాత్రి బ్రహ్మోత్సవాలు' అని రెండు విడతలుగా స్వామివారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు."
టీటీడీ ముందస్తు ఏర్పాట్లు
తిరుమలలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రెండు బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం టీటీడీ ముందస్తు ఏర్పాట్లకు సమాయత్తం అవుతోంది. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర అధికారులు సమీక్షలతో సన్నాహాలు ప్రారంభించారు.
"రెండు బ్రహ్మోత్సవాలు ఒకే ఏడాది రావడం వల్ల భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో ఉంటుంది. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలి" అని వెంకయ్య చౌదరి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్ణీత సమయంలో ఇంజినీరింగ్ పనులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని విభాగాల అధిపతులను ఆదేశించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్నప్రసాదాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆకట్టుకునే విద్యుత్ దీపాల అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యాత్రికులకు కనువిందు చేసే విధంగా ఫల, పుష్ప ప్రదర్శనతో అలంకరణలు కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు ఉండాలని టీటీడీ విద్యుత్, గార్డెనింగ్ విభాగం అధికారులకు సూచనలు చేశారు.
మొదటి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదీ
అధిగమాసం కావడంతో సెప్టెంబర్ లో మొదటి బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. దీనికోసం
సెప్టెంబర్ 8: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన జలాలతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
సెప్టెంబర్ 14: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సెప్టెంబర్ 15: ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
సెప్టెంబర్ 19: అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ
సెప్టెంబర్ 22: వైభవంగా రథోత్సవం
సెప్టెంబర్ 23: చక్రస్నానంతో మొదటి బ్రహ్మెత్సవం ముగుస్తుంది. రోజూ ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి ఏడు నుంచి రాత్రి తొమ్మది గంటల వరకు ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామివారి మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఉన్న యాత్రికులకు దర్శనం ఇస్తారు.
బ్రహ్మోత్సవాల్లో ఓ ప్రత్యేకత ఉంది..
ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నుంచి 20 వరకు వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనికోసం కూడా అధిగమాసం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేసే ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం మరియు ధ్వజావరోహణం ఘట్టాలు ఉండవు. అక్టోబర్ 13 నుంచి 15 వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
వీఐపీలకు అలర్ట్
ఈ ఉత్సవ రోజుల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. విఐపి బ్రేక్ దర్శనాలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు శ్రీవారి సేవకుల సంఖ్య మరింత పెంచేవిధంగా టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది.