ఎన్‌డీఏ కూటమి ‘ఐక్యతా సమావేశం’ సందేశం ఏమిటి?
x
Alliance leaders hold talks at AP CM Chandrababu's house

ఎన్‌డీఏ కూటమి ‘ఐక్యతా సమావేశం’ సందేశం ఏమిటి?

నారీ శక్తి వందన్ బిల్లు పై చర్చానంతరం రాష్ట్రంలో విజయోత్సవ ర్యాలీలు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉండవల్లిలోని సీఎం ఇంట్లో కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సెషన్‌లో ప్రవేశపెట్టబోయే ‘నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లు’పై వ్యూహాలు రూపొందించడమే ఈ సమావేశం ముఖ్య అజెండా.

బిల్లు ఆమోదం అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ‘నారీ శక్తి విజయోత్సవాలు’ నిర్వహించడం, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం, ఎన్‌డీఏ పక్షాల మధ్య సమన్వయం. ఇవి సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, ఎంపీలకు లేఖలు రాసి బిల్లుకు మద్దతు కోరారు. ఈ సమావేశం ఆ లేఖల అనంతరం జరిగిన కూటమి స్థాయి చర్చల్లో భాగం.

కూటమి గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి?

గత ఏడాది నుంచి ఎన్‌డీఏ కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) సమావేశాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2026లో జరిగిన ఎన్‌డీఏ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చంద్రబాబు “కూటమి మరో 15 ఏళ్లు కొనసాగాలి. అప్పుడే రాష్ట్రం స్థిరమైన అభివృద్ధి సాధిస్తుంది” అని స్పష్టం చేశారు. గుజరాత్ మాదిరి స్థిర ప్రభుత్వం కావాలని, కేంద్ర సహాయం లేకుండా అనేక కార్యక్రమాలు అమలు చేయలేమని ఆయన ఉద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ కూడా కూటమి సూత్రాలకు కట్టుబట్టాలని పిలుపు నిచ్చారు.

ఇతర సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, ఇన్వెస్ట్‌మెంట్స్, వెల్ఫేర్ స్కీముల సమన్వయం, డీలిమిటేషన్ విషయంలో దక్షిణ రాష్ట్రాల స్వార్థాలను కాపాడాలనే అంశాలు చర్చకు వచ్చాయి. కూటమిలో ఎలాంటి తీవ్ర వ్యత్యాసాలు లేవని, ఐక్యతే బలం అని నేతలు పదే పదే ప్రకటించారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏమిటి?

బిల్లుకు ఎన్‌డీఏ ఎంపీలు ఏకకంఠంగా మద్దతు ఇవ్వాలి.

బిల్లు ఆమోదం అయిన వెంటనే రాష్ట్రంలో ‘నారీ శక్తి విజయోత్సవాలు’ నిర్వహించాలి.

మహిళా సాధికారత కార్యక్రమాలు మరింత వేగవంతం చేయాలి.

కేవలం నారీ శక్తి గురించే చర్చా?

రాజకీయంగా ఇది కేవలం ఒక బిల్లు చర్చ కాదు. ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌లో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ) అంశం కూడా ప్రత్యక్షంగా-పరోక్షంగా చర్చకు వస్తుంది. లోక్‌సభ సీట్లు 543 నుంచి 816కి పెరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి కావాలో వాటిని సాధించి కాపాడుకోవడం కూటమి ముందున్న సవాలు. జనాభాతో సంబంధం లేకుండా ౫౦ శాతం సీట్లు పెంచుకునేలా కేంద్రం చట్టం చేస్తుందని పార్లమెంట్ సభ్యలు, కేంద్ర మంత్రుల నుంచి ఏపీ కూటమి నేతలకు స్పష్టమైన సమాచారం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

రాజకీయ వ్యూహం

ఎన్‌డీఏ కూటమి ఐక్యతను ఎవ్వరూ నిరోధించ లేరని చెప్పేందుకే ఈ సమావేశం నిర్వహించారనే చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ‘చరిత్రాత్మకం’గా చిత్రీకరించి, ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం ఇమేజ్‌ను రాష్ట్రంలో బలోపేతం చేసుకోవడం ద్వారా టీడీపీ బలానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం చంద్రబాబు వ్యూహం. ఒకవైపు యువత, మహిళల మధ్య ‘నారీ శక్తి’ బ్రాండింగ్‌తో పాపులారిటీ పెంచుకోవాలని లక్ష్యం. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీని ‘వ్యతిరేకం’గా చూపించి, బిల్లుకు మద్దతు ఇవ్వని పార్టీలపై రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కనిపిస్తోంది.

కూటమి సమావేశాలు అభివృద్ధి, స్థిరత్వం, 15 ఏళ్ల ఐక్యతపైనే దృష్టి సారించాయి. ఈ సమావేశం మహిళా సాధికారతను ఫోకస్ చేసి, కూటమికి ‘సామాజిక న్యాయ’ ఇమేజ్ ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్తోంది. డీలిమిటేషన్ విషయంలో దక్షిణ రాష్ట్రాల సమస్యలను కూడా ఈ సెషన్‌లో లేవనెత్తి, కేంద్రంతో చర్చలు జరపడానికి ఇది ఒక వేదిక కావచ్చు.

మొత్తం మీద ఈ కూటమి సమావేశం కేవలం ఒక బిల్లు చర్చ కాదు. 2029 ఎన్నికల ముందు ఎన్‌డీఏ ఐక్యతను బలోపేతం చేసుకునే, మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించే రాజకీయ వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. ఫలితాలు ఏమైనా… ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్‌లో జరిగే చర్చలు రాష్ట్ర రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Read More
Next Story