దళపతి విజయ్ రేపు అమరావతి పర్యటన నేపథ్యం ఏమిటి?
40 ఏళ్ల నాటి ఒప్పందంలో కండలేరు జలాలపై ఏపీ సీఏం చంద్రబాబుతోె చర్చలు!?
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బృందం మంగళవారం అమరావతికి వస్తోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబుతో భేటీ కావడం, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలక నీటిపారుదల అంశాలపై చర్చించడమే టూర్ లక్ష్యంగా ఈ టూర్ ఉంటుందనేది అధికారికవర్గాల సమాచారం. ఏపీ, తమిళనాడు మధ్య ఉన్న 40 ఏళ్ల నాటి తెలుగుగంగ ప్రాజెక్టు ఒప్పందం వెనుక చారిత్రాత్మక కథనం ఉంది. చెన్నైకి ఏర్పడిన నీటి ముప్పు నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్, చంద్రబాబు భేటీలో మూడు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
చెన్నై నగరానికి తాగునీరు కావాలన్నా.. ఏపీలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల మెట్ట ప్రాంతాల్లో పంటల సాగుకు తెలుగుగంగ ప్రాజెక్టు ఒకటే జీవధార. రెండు సరిహద్దు రాష్ట్రాల మధ్య జల జగడాలు సర్వసాధారణం, కానీ, ఏళ్ల తరబడి ఎంతో ఆత్మీయంగా, సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన తెలుగుగంగ కాలువ తెలుగు, తమిళ రాష్ట్రాల మధ్య భిన్నమైన వారధి.
అయితే,
ఈ చారిత్రాక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుపై తమిళనాడు, ఆంధ్ర సీఎంలు మంగళవారం జరిపే భేటీలో ప్రధానంగా మూడు సాగునీటి కాలువలపై చర్చించే అవకాశం ఉంది. అందులో..
1. తెలుగుగంగ కాలువ నుంచి తిరుపతి జిల్లా రాపూరు సమీపంలోని కండలేరు నుంచి సత్యవేడు మీదుగా తమిళనాడు సరిహద్దులోని పూండి జలాశయానికి (సత్యమూర్తి సాగర్ ) వరకు నీటిని కాలువల్లో చేరవేస్తుంది.
2. కర్ణాటక నుంచి ప్రారంభమై కుప్పం మీదుగా ప్రవహించే పాలార్ నదీ జలాల వివాదం.
తెలుగుగంగ ప్రాజెక్టు.. ఓ అనుబంధం...
కథ ఈనాటిది కాదు.. దశాబ్దాల నాటిది. చెన్నై నగరం దశాబ్దాలుగా తాగునీటి కరువుతో అల్లలాడిపోతున్న రోజుల్లో కృష్ణా బేసిన్ లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక అరుదైన నిర్ణయం తీసుకున్నాయి. చెన్నై దాహార్తిని తీర్చేందుకు తమ వాటా నుంచి చెరి ఐదు టీఎంసీల నీటిని ఇవ్వడానికి అంగీకరించాయి.
చెన్నై నగరానికి తాగునీటితో పాటు రాయలసీమలో కర్నూలు, కడప జిల్లాల తరువాత నెల్లూరు జిల్లాల మెట్ట ప్రాంతాకు ఉద్దేశించిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టు ఇది. ఏపీకి సరిహద్దులోని తమిళనాడు ప్రధానంగా చెన్నై నగరానికి తాగునీటి సమస్య దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్య. దీంతో కృష్ణా నదీ బేసిన్ లో మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ ప్రభుత్వాలు అరుదైన ఒప్పందం చేసుకున్నాయి. అందులో భాగంగా
చెన్నైకి తాగునీరు అందించేందుకు మొదటి అడుగు వేశాయి. 1976-77 లో ఈ మూడు రాష్ట్రాలు చెన్నై తాగునీటికి తమ వాటాలో చెరి ఐదు టీఎంసీల కృష్షా జలాలు ఇవ్వడానికి అంగీకరించి, రాష్ట్రాల మధ్య సఖ్యతకు బాటలు వేశారు.
సినిమా స్నేహంతో మరింత బలోపేతం...
తెలుగు సీని పరిశ్రమకు, తమిళనాడు కోలీవుడ్ కు ఉన్న అనుంబంధం అన్నాదమ్ములతో సమానమైంది.
1983 ఏప్రిల్ 18న అప్పటి ఏపీ సీఎం ఎన్టీరామారావు, తమిళనాడు సీఎం ఎంజీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం సంయుక్తంగా చేపట్టాలనే చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. అదే ఏడాది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో కడప జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
నీరు ఎక్కడి నుంచి రావాలి...
తెలుగుగంగ కాలువలో నీటి ప్రవాహం అనేది శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడి నిలువ సామర్థ్యం 871 అడుగులు ఉంటేనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయాలనే నిబంధన తుంగలో తొక్కుతున్నారు. దీనివల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇటు హంద్రీ- నీవా కాలువ,అటు తెలుగుగంగ కాలువకు నీరు విడుదల అవుతుంది. ఈ వ్యవస్థలో తెలుగుగంగ కాలువ శ్రీశైలం నుంచి విడుదల చేసే జలాలు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలో నిర్మించిన శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్, సోమలశిల జలాశయం నుంచి రాపూరు సమీపంలో జీరో పాయింట్ నెల్లూరు జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లా) కండలేరు వద్ద నిర్మించిన జలాశయానికి చేరుతుంది. తద్వారా దాదాపు 420 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ జలాలు తమిళనాడులోని ఊత్తుకోటై వద్ద జీరోపాయింట్ కు, తరువాత తమిళనాడులోని పూండి జలాశయం (సత్యమూర్తి సాగర్) కు నీరు చేరుతుంది.
పూండి జలాశయ నుంచి లింక్ కాలువలతో రెడ్ హిల్స్, చోళవరం, చెంబరబాక్కం ప్రాంతాల్లోని జలాశయాలకు నీటిని మళ్లించి, శుద్ధి చేసిన నీటిని చెన్నై నగరానికి అందివ్వడం దశాబ్దాల కాలంగా సాగుతోంది.
సత్యసాయి కాలువగా ఎందుకు మారింది?
తెలుగుగంగ కాలువ వల్ల ప్రారంభంలో అవాంతరాలు ఎదురయ్యాయి. పూడిక, నీటి లీకేజీ వల్ల నష్టాలు తప్పలేదు. దీనివల్ల 12 టీఎంసీల నీరు చెన్నై వరకు ప్రవహించడం కష్టంగా మారింది. ఈ సమస్య తెలుసుకున్న పుట్టపర్తి సత్యసాయిబాబ స్పందించారు. కండలేరు నుంచి తమిళనాడులోని పూండి వరకు కాలువను పునరుద్ధరిస్తానని సత్యసాయి చెప్పడమే కాదు. 2002లో తెలుగుగంగ కాలువకు 65 కిలోమీటర్ల వరకు కాలువకు లైనింగ్ చేయడం, ఆధునిక సాంకేతికతను జోడించి 11 నెలల్లో పనులు పూర్తి చేయించడం అనేది తమిళుల అభిమానాన్ని మరింత చూరగొన్నారు.
చెన్నైకి 12 టీఎంసీలు వెళుతున్నాయా?
ఈ ఒప్పందం ప్రకారం తెలుగుగంగ కాలువతో తమిళనాడుకు 12 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలి. దీనికోసం ఏటా రెండు విడతలుగా నీటి సరఫరా జరగుతుంది. జూలై- అక్టోబర్ మధ్య ఎనిమిది టీఎంసీలు, జనవరి- ఏప్రిల్ మధ్య నాలుగు టీఎంసీలు అందించాలనేది ఎన్టీఆర్, ఎంజీఆర్ సారధ్యంలోని ఆ నాటి ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం.
నెల్లూరు జిల్లా (ప్రస్తుతం తిరుపతి)లోని రాపూరు సమీపంలోని చెల్లటూరు గ్రామం వద్ద నిర్మించిన కండలేరు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 68 టీఎంసీలు. అంటే 278.89 అడుగులు ఉంటుంది. వర్షాకాలం లేదా కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలకు ఈ జలాశయం నీటితో పరవళ్లు తొక్కుతుంది. ఈ జలాశయం వద్ద నీటిమట్టం వేసవిలో డెడ్ స్టోరేజీ ఉన్న సరే, జనవరి- ఏప్రిల్ మధ్య నాలుగు టీఎంసీలు చెన్నై తాగునీటి కోసం తెలుగుగంగ కాలువలో నీరు విడుదల చేయాల్సిందే.
ఇప్పుడు సమస్య ఏమిటి?
'సూపర్ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల సాగునీటికే కాదు. తాగునీటికి కటకటలాడే పరిస్థితి ఏర్పడింది. చెన్నైలోని నాలుగు రిజర్వాయర్లలో నీరు అడుగంటింది. నిర్ణీత ఒప్పందం మేరకు 12 టీఎంసీల్లో ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి తెలుగుగంగ కాలవ వల్ల కేవలం 2.251 టీఎంసీలు మాత్రమే చేరడం అంటే 20 శాతం నీరు మాత్రమే ప్రవహించడం వల్ల తమిళనాట ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. 9.749 టీఎంసీల బకాయి పడింది. సోమశిల నుంచి కండలేరుకు, ఇక్కడి నుంచి పూండి రిజర్వాయర్ కు నీరు వదలే అంశంపై తమిళనాడు సీఎం విజయ్ ఏపీ సీఎంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మిగతా నీటిని విడుదల చేయించుకునేందుకు తమిళనాడు సీఎం విజయ్ పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
కుప్పం నుంచి సవాళ్లు ఏమిటి?
కర్ణాటక నుంచి తమిళనాడుకు నీటి కావేరీ జలాల వివాదం రగులుతూనే ఉంటుంది. అదే సమయంలో ఆంధ్రలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మీదుగా ప్రవహించే పాలార్ నదితో కూడా తమిళనాడు సవాళ్లు ఎదుర్కొంటోంది. పాలార్,పెన్పార్, కుశస్థలి నదులపై చెక్ డ్యాముల నిర్మాణం ఆపాలనే అంశంపై కూడా తెలుగు, తమిళనాడు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, విజయ్ మధ్య చర్చకు ఆస్కారం ఉంది. అంతేకాకుండా, గోదావరి- కృష్ణా, పెన్నా- కావేరీ అనుసంధానం తోపాటు 15,500 కోట్ల వ్యయంతో పైప్ లైన్ నిర్మాణంపై చర్చలకు ఆస్కారం ఉన్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం.
పాలార్ నదీ వివాదం.. 32 చెక్ డ్యాంలు...?
కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జిల్లా నంది కొండల్లో ప్రారంభమయ్యే పాలార్ నది 93 కిలోమీటర్లు ప్రవహిచిన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మీదుగా తమిళనాడులోకి చేరుతుంది. ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఏపీలో 33 కిలోమీటర్లు, తమిళనాడులో 222 కిలోమీటర్లు ప్రవహించి వయలూర్ వద్ద బంగాళాఖాతంలో కలిసే ఈ నదీ జలాలు తమిళులకు తాగునీరు, సాగునీటికి ఆదరువుగా ఉంది.
కుప్పం సమీపంలోని గణేష్ పురం వద్ద పాలార్ నదిపై ఏపీ నీటిపారుదల శాఖ ఆనకట్ట నిర్మించడంపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నది ప్రవాహం వల్ల వెల్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, తిరువళ్లూరు జిల్లాల రైతుల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
పాలార్ జలాలపై 1956 నుంచి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదచట్టం అమలులో ఉంది. అప్పటి తమిళనాడు సీఎం జయలలిత పాలనలో పాలార్ ఓ అంతర్రాష్ట్ర నదిగా పరిగణించారు.
కుప్పలో పాలార్ నదిపై ఆనకట్టలు నిర్మించడంపై కూడా అమరావతిలో రెండు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు, దళపతి విజయ్ మధ్య చర్చలకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story

