కావేరీ జలాల అంశంపై విజయ్ బెంగళూరు పర్యటన..
x

కావేరీ జలాల అంశంపై విజయ్ బెంగళూరు పర్యటన..

తమిళనాడులో రాజకీయ దుమారం.. ఎలాంటి హక్కులు వదులుకోరాదని ప్రతిపక్షాల హెచ్చరిక


కావేరీ జలాల పంపిణీ వివాదం, మేకెదాటు ప్రాజెక్ట్ అంశాలపై కర్ణాటకతో చర్చలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిద్ధమవుతుండగా.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే నెల 3న బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో.. చర్చల పేరుతో తమిళనాడు హక్కులు దెబ్బతినేలా ఎలాంటి రాజీకి వెళ్లొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

కావేరీ జలాల సమస్యకు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రత్యక్ష చర్చలే పరిష్కారం కాదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో కావేరీ జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) నీటి విడుదలకు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయబోమని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించడం తమిళనాడులో ఆందోళనను మరింత పెంచింది.
తమిళనాడు సీఎం నుంచి తనకు లేఖ అందిందని, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే తమిళనాడులో రాజకీయ విమర్శలు మరింత ఉధృతమయ్యాయి.
డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మౌనం పాటిస్తోందని ఆరోపించారు. విజయ్ బెంగళూరు పర్యటన రోజునే తమ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందని ప్రకటించారు. అలాగే ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మేకెదాటు ప్రాజెక్ట్ కోసం కర్ణాటక ఒత్తిడి పెంచిందని, కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదని స్టాలిన్ విమర్శించారు. సీడబ్ల్యూఎంఏ ఆదేశాలను కర్ణాటక బహిరంగంగా తిరస్కరించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆరోపించారు. ఈ చర్చల వల్ల మేకెదాటుపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తమిళనాడు అసెంబ్లీ డిమాండ్ బలహీనపడే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కావేరీ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.ఆర్. పాండియన్ కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ విజయ్ బెంగళూరు పర్యటనకు వెళ్తే, తిరుగు ప్రయాణంలో డీకే శివకుమార్‌ను కావేరీ డెల్టాకు తీసుకొచ్చి ఎండిపోయిన పంటపొలాలను చూపించాలని సూచించారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న నీటి హక్కులను చర్చల పేరుతో వదులుకోరాదని స్పష్టం చేశారు.
మేకెదాటు ప్రాజెక్టుకు సీడబ్ల్యూఎంఏ ఆమోదం లేకుండా పర్యావరణ, అటవీ అనుమతులు లభించవని కేంద్రం ఇప్పటికే పార్లమెంట్‌లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తమిళనాడు చట్టపరమైన మార్గాన్నే కొనసాగించాలని పాండియన్ అభిప్రాయపడ్డారు.
పీఎంకే నేత అన్బుమణి రామదాస్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. మేకెదాటు ప్రాజెక్ట్ తమిళనాడుకు వ్యతిరేకమని కాంగ్రెస్ అంగీకరిస్తే తాము జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి వైదొలుగుతామని ప్రకటించారు. తమిళనాడు అంగీకరించని ప్రాజెక్టుపై కర్ణాటకతో చర్చలు జరపడం వల్ల ప్రయోజనం లేదని, ఈ అంశాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి స్థాయిలో ప్రస్తావించాలని సూచించారు.
కర్ణాటక ఇప్పటికే సీడబ్ల్యూఎంఏ జారీ చేసిన నీటి విడుదల ఆదేశాలను వరుసగా రెండుసార్లు అమలు చేయలేదని అన్బుమణి విమర్శించారు. నీటిని విడుదల చేయని ప్రభుత్వంతో మేకెదాటు అంశంపై చర్చలు జరపడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కలిసి వ్యవహరిస్తున్నాయని కూడా ఆరోపించారు.
ఇటీవల మేకెదాటు ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా తమిళనాడులో ఆందోళనకు కారణమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి నిధులు కోరడం, కేంద్ర జలశక్తి మంత్రితో అనుమతులపై చర్చించడం, ప్రాజెక్టుకు అనుకూలంగా ఢిల్లీలో అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించడం వంటి పరిణామాలను ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి.
కావేరీ, మేకెదాటు అంశాలు ఒకే రాజకీయ పార్టీకి సంబంధించినవి కాదని, మొత్తం తమిళనాడు ప్రయోజనాలకు సంబంధించినవని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతు ప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాయి.
Read More
Next Story