తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
x

తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్

1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం


తమిళనాడు అసెంబ్లీలో బుధవారం టీవీకే ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని 2031 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. అభివృద్ధి, విద్య, సంక్షేమం, ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ టెండర్ల కేటాయింపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో అమలైన ‘కట్’ విధానానికి స్వస్తి పలికి, పరిమిత వర్గాలకు మాత్రమే కాంట్రాక్టులు ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు గణనీయంగా పెరిగాయని, ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఆదాయాన్ని పెంచే చర్యల్లో భాగంగా మద్యం తయారీ యూనిట్లపై ప్రత్యేక సుంకం విధించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. దీని ద్వారా సుమారు రూ.1,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, నీట్ పరీక్షను రద్దు చేసి, 12వ తరగతి పబ్లిక్ పరీక్ష మార్కుల ఆధారంగానే వైద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరింది.

విద్యారంగానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. పాఠశాల విద్యాశాఖకు రూ.44,527 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.8,393 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,734 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.300 కోట్లు వెచ్చించనున్నారు.

'సూపర్ క్లీన్–సూపర్ క్యాంపస్' పథకం కింద తొలి దశలో 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, రోజువారీ పరిశుభ్రత, 24 గంటల భద్రత వంటి సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకోసం రూ.139 కోట్లు కేటాయించారు.

కళాశాల విద్యార్థులకు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు 'వెట్రి ల్యాప్‌టాప్ పథకం'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పెరుంతలైవర్ కామరాజర్ మోడల్ స్కూల్స్ పథకం కింద రూ.125 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, ఆరోగ్య సేవలు అందించనున్నారు.

ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ మదురైలో ప్రత్యేక న్యాయ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదనంగా రూ.90 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఐదు కొత్త ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు (ఐటీఐలు) స్థాపించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, మహిళల భద్రత కోసం ప్రత్యేక రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ వంటి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేస్తామని, సామాజిక సమానత్వం, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ పేర్కొన్నారు.


Read More
Next Story