Courtesy AI
x

తిరుపతి సెంటిమెంట్: 'తారక్' మంత్రం వెనుక అసలు కథేమిటి?

పేదల సేవ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? ఈ రోజు ఏమి చెప్పబోతున్నారు?


ఎన్టీ రామారావు (తారక్) తిరుపతి సెంటిమెంట్ వెనుక అసలు కథమేటి? ఈ రోజు (జూలై 18వ తేదీ) తిరుపతిలో సామాజికసేవ లక్ష్యంగా వేస్తున్న అడుగు ఏ ప్రస్థానానికి నాంది పలుకబోతున్నారు. తిరుపతి సెంటిమెంట్, సామాజిక సేవ వెనుక అంతర్లీనంగా ఉన్న పొలిటికల్ కహానీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. తాత, మాజీ సీఎం ఎన్టీఆర్ స్టైల్ లోనే వెండితెరను శాసించిన తారక్ మదిలోని వ్యూహం ఏమిటి? ఈ ప్రశ్నలే పోలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచాయి.

తిరుపతి సెంటిమెంట్

నందమూరి వంశానికి, తిరుపతికి విడదీయరాని బంధం ఉంది. 1982లో స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, తన చారిత్రాత్మక 'చైతన్య రథయాత్ర'ను తిరుపతి నుంచే ప్రారంభించారు. 1983 ఎన్నికల్లో తిరుపతి, గుడివాడ నుంచి పోటీ చేసి, భారీ మెజారిటీతో గెలిచిన ఎన్టీ. రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత తిరుపతి సీటుకు రాజీనామా చేశారు. ఈ స్థానాన్ని మళ్లీ టీడీపీ అభ్యర్థినే గెలిపించారు.

మలుపు తిప్పిన పథకం

"పేదల ఆకలి తీర్చడానికి పట్టెడన్నం పెట్టలేనప్పుడు ఈ రాజకీయాలు ఎందుకు " అని మాజీ సీఎం ఎన్టీఆర్ 1983 జూలై ఆరో తేదీ కిలో రెండు రూపాయల బియ్యం పథకం ప్రారంభించారు. ఈ పథకానికి పునాది పడింది కూడా తిరుపతి వేదికగానే.

తాత సెంటిమెంటే అస్త్రం

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సంచలనం రేకెత్తించింది. ఎన్నికల ప్రచార యాత్రను చైతన్య రథంపై నుంచి ఎన్టీఆర తిరుపతి నుంచే ప్రారంభించారు. ఈ సంఘటనలు అవలోకనం చేసుకున్న ఎన్టీరామారావు (తారక్) తన పేదల సేవకు శ్రీకారం చుట్టడానికి తిరుపతినే వేదికగా ఎంచుకున్నారు. ఈ రోజు తిరుపతిలో ఆయన ఏమి చెప్పబోతున్నారు? అనే విషయంపైనే సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
100 కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం చేపట్టడం వెనుక వ్యూహాత్మక అడుతు వేస్తున్నారా? అనేది పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ సాగుతోంది.
పేదలు, వెనుకబడిన వర్గాల కోసం డిజైన్ చేసిన ఈ పథకం ద్వారా అభిమాన సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చే ముందు, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడం పక్కా పొలిటికల్ వ్యూహంలో భాగమే అనే చర్చ నడుస్తోంది.

తమిళ స్టార్ విజయ్ ప్రేరణా?

వెండితెరపై గ్లోబల్ స్టార్ డమ్ దక్కించుకున్న తారక్ లో రాజకీయరక్తం యాక్టివ్ అయినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న తారక్ అకస్మా్త్తుగా పేదల సేవలోకి రావడం, అది కూడా తెలంగాణా కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో కొత్త కెరీర్ ప్రారంభించనుండడమే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
తమిళనాడులో సహ నటుడు దళపతి విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారంలోకి రావడమే కాదు. ఏకంగా సీఎం కావడం అనేది సంచలనం సృష్టించింది. ఆంధ్రాలో కూడా మరో మూడేళ్లలో ఎన్నికలు జరిగే పరిస్థితిలో ఈ సమయాన్ని చక్కగా మలుచుకునేందుకే తారక్ సేవా కార్యక్రమాల పేరిట రంగంలోకి దిగుతున్నారా? అనే మాటలు, విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్‌లో బలాన్ని పెంచుకునేందుకే ఈ స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.
ఎన్టీఆర్ అఫీషియల్ టీం మాత్రం "ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే" అని తేల్చిచెబుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ద్వారా వైరల్ అవుతున్న వార్తలను తోసిపుచ్చింది. మినహా, తారక్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
"నిప్పు లేనిదే పొగ రాదు" అనే సామెత చందంగా.. సినిమాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా ఈ వార్తలను ఖండించారా? అనే వారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా, తిరుపతిలో ఈ రోజు ఎన్టీఆర్ చేసే ప్రకటనపై అమితాసక్తి పెరిగిపోయింది. సినిమాలో డైలాగ్ పేలితే థియేటర్లు దద్దరిల్లుతాయి.. అదే తారక్ నిజంగానే పొలిటికల్ స్టెప్ వేస్తే ఏపీ రాజకీయ సమీకరణాలు తలకిందులవ్వడం ఖాయమేనా!
Read More
Next Story