
ఏపీలో క్వాంటమ్ యుగం ప్రారంభం!
అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వేదికగా క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభమైంది. ఇక్కడే రీసెర్చ్ కూడా జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడు కేవలం రాజకీయ రాజధాని కాదు... ఇది దేశంలోని తొలి ‘క్వాంటమ్ టెక్నాలజీ హబ్’గా అవతరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దేశంలోనే మొదటి ఇండిజనస్ ఓపెన్-యాక్సెస్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు, అమరావతి 1S (SRM యూనివర్సిటీలో), అమరావతి 1Q (గన్నవరం మేధా టవర్స్‌లో)ను ప్రారంభించారు. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం ఏపీని క్వాంటమ్ టెక్నాలజీలో దేశ అగ్రగామిగా మార్చడంలో మైలురాయి అని చెప్పొచ్చు.
ఎస్ఆర్ఎం యూనివర్సీటీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు
తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ కలిగిన రాష్ట్రంగా ఏపీ
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్‌లోని క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్‌తోపాటు, స్పేర్ పార్ట్స్ ఉపయోగించి కొత్త క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది భారతదేశంలోనే తొలిసారి ఒక యూనివర్సిటీ వేదికగా జరుగుతోంది. ఈ సందర్భంగా తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ కలిగిన రాష్ట్రంగా ఏపీ ఏర్పడింది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా నిర్మితమైన తొలి క్వాంటం టెస్ట్ బెడ్స్ తో ఆంధ్రప్రదేశ్ ఈ టెస్ట్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా మారింది. ఈ రెండు క్వాంటం టెస్ట్ ఫెసిలిటీల ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించి సర్టిఫై చేసేందుకు అవకాశం ఏర్పడినట్టైంది. తద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యాన్ని అమరావతి క్వాంటం వ్యాలీ అందిపుచ్చుకుంది. మైనస్ 273 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య క్వాంటం హార్డ్ వేర్, సెమీ కండక్టర్లను పరీక్షించేలా ఈ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు, ఉపకరణాలు తయారు చేసే వివిధ సంస్థలు, పరిశోధకులు, విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా ఎస్ఆర్ఎం వర్సిటీలోని 1 ఎస్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటి ఓపెన్ యాక్సెస్ గా మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, వర్చువల్ గా ప్రధాని సాంకేతిక సలహదారు అజయ్ సూద్, డీఆర్డీఓ డీజీ ఆర్వీ ప్రసాద్,క్యూబిట్ ఫోర్స్ ఫౌండర్ వెంకట సుబ్రమణియన్, ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ్, వీసీ ప్రోఫెసర్ సతీష్ కుమార్, ఐఐటీ చెన్నై, తిరుపతి ప్రోఫెసర్లు కామకోటి, సత్యనారాయణ ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.ముఖ్యమంత్రి చంద్రబాబు వారందరితో ప్రత్యేకంగా మాట్లాడి, వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. శాలువాలు కప్పి అభినందించి ఈ రంగంలో ఏపీ ముందుకు సాగాలంటే ఏమి చేయాలో స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.
క్వాంటమ్ టెక్నాలజీ ఎందుకు ముఖ్యం?
సాధారణ కంప్యూటర్లు బిట్‌ల (0 లేదా 1) ఆధారంగా పనిచేస్తే, క్వాంటమ్ కంప్యూటర్లు క్వాబిట్‌లు (Quantum Bits) ఆధారంగా పనిచేస్తాయి. ఇవి ఒకేసారి బహుళ స్టేట్‌లలో ఉండగలవు. ఫలితంగా డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్, క్రిప్టోగ్రఫీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయి. ఏపీలో ఈ సెంటర్ ఏర్పాటుతో దేశం విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా సొంత క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్టింగ్, సర్టిఫికేషన్ సామర్థ్యం సంపాదించింది. సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో నిర్మించిన ఈ టెస్ట్ బెడ్‌లు -273 డిగ్రీ సెల్సియస్ వద్ద పనిచేసి, క్వాబిట్‌లను స్థిరంగా ఉంచి పరీక్షలు చేస్తాయి.
ఈ కార్యక్రమం అమరావతి క్వాంటమ్ వ్యాలీ (AQV) ప్రాజెక్ట్‌లో భాగం. 50 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాలీ ఇన్నోవేషన్ హబ్‌గా, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సెంటర్‌గా మారనుంది. ఇది విద్యార్థులు, రీసెర్చర్లు, స్టార్టప్‌లకు ఓపెన్ యాక్సెస్ అందిస్తూ, ఉద్యోగాలు, పరిశోధనలు ప్రోత్సహిస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నట్లు, “ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడం మా లక్ష్యం. క్వాంటమ్ టెక్నాలజీలో దేశానికి మార్గదర్శకంగా నిలవాలి అనేది మా ఆకాంక్ష.” ఐఐటీ ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు కూడా ఈ ఏర్పాటును “దేశ చరిత్రలో చారిత్రక మైలురాయి”గా అభివర్ణించారు.
ఏపీలో క్వాంటమ్ రంగం మొదటిసారి వేళ్లూనుకోవడం కేవలం ఒక ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ విజయం కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తు, యువత ఉపాధి, జాతీయ సాంకేతిక స్వావలంబనకు కొత్త తలుపులు తెరిచిన చారిత్రక ఘట్టం. అమరావతి ఇప్పుడు క్వాంటమ్ బీట్‌లతో మారుమోగుతోంది... భవిష్యత్ ఇక్కడే ఆకారం తీసుకుంటోంది!

