
పొలిటికల్ డ్రామాతో కనుమరుగైన కావేరీ రైతుల కష్టాలు..
టీవీకే, డీఎంకేపై రైతుల ఆగ్రహం
నిన్నంతా సోషల్ మీడియా, ప్రధాన వార్తా ఛానళ్లలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు తంజావూరుకు తరలిస్తున్న దృశ్యాలే ప్రధాన చర్చగా మారాయి. ఆయన ఓ రైతుల నిరసన సభలో సినీ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
అయితే ఆ సభ అసలు ఉద్దేశం కావేరీ జలాల సమస్యపై రైతుల ఆవేదనను వినిపించడమే అయినప్పటికీ, ఇప్పుడు ఆ అంశం పూర్తిగా పక్కకు వెళ్లిపోయిందని రైతు సంఘాలు, నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెట్టూరు ఆనకట్ట నుంచి తగినంత నీటి విడుదల లేక ఇప్పటికే పలువురు రైతులు కురువాయి పంటను కోల్పోయారు. ఇప్పుడు సాంబ సాగు ప్రారంభించేందుకు కావేరీ నీరు ఎప్పుడు వస్తుందా అని ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.
కానీ నీటి సమస్యకు పరిష్కారం చూపాల్సిన సమయంలో రాజకీయ పార్టీలు ఉదయనిధి అరెస్టు చుట్టూ పరస్పరం విమర్శలు చేసుకోవడమే తప్ప రైతుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని వారు అంటున్నారు.
రైతులు ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి విజయ్‌పై నమ్మకంతో ఓటు వేసిన రైతులు, ప్రస్తుతం తాము తీవ్ర నిరాశలో ఉన్నామని చెబుతున్నారు.
తంజావూరు రైతు ఎస్. రమేష్ మాట్లాడుతూ, ఇప్పటికే అప్పుల భారంతో పాటు నీటి కొరత కారణంగా తన ఏడు ఎకరాల కురువాయి పంట పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు.
ప్రస్తుతం కావేరీ డెల్టా ఎడారిలా మారిందని, పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఒక్క మంత్రి కూడా రాలేదని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రచారాలకే ప్రభుత్వం పరిమితమైందని, తమిళనాడుకు రావాల్సిన నీటిని సాధించడంలో అవసరమైన తీవ్రత కనిపించడం లేదని అన్నారు.
రైతు సంఘాల నేతలు అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే రెండు పార్టీలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కావేరీ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సమయంలో దానిని రాజకీయ లాభనష్టాల కోసమే ఉపయోగిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
కావేరీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పీఆర్ పాండియన్ మాట్లాడుతూ, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిందేనని, అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్‌కు ముందు రోజు ఆయనను అరెస్టు చేయడం కూడా రాజకీయ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. దీంతో రైతుల అసలు సమస్యలు పూర్తిగా మరుగునపడిపోయాయని అన్నారు.
ఆయన అభిప్రాయం ప్రకారం, డీఎంకే రైతుల సమస్యలను నిరసనల ద్వారా రాజకీయంగా ఉపయోగించుకుంటుండగా, టీవీకే ప్రభుత్వం ఉదయనిధిపై చర్యలతో రాజకీయ ఘర్షణను మరింత పెంచింది. ఈ పరిణామాల మధ్య కావేరీ జలాల సమస్యపై ప్రజల దృష్టి మళ్లిపోయిందని చెప్పారు. తమిళనాడు అంతర్గత రాజకీయ పరిణామాలను కర్ణాటక గమనిస్తోందని కూడా పేర్కొన్నారు.
టీవీకే ప్రభుత్వం కావేరీ వివాదాన్ని పారదర్శకంగా నిర్వహించడం లేదని పాండియన్ విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విజయ్‌ను చర్చలకు ఆహ్వానించిన విషయంపై కూడా తమిళనాడు ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పులు, కావేరీ నిర్వహణ సంస్థ ఆదేశాలు ఉన్నప్పటికీ చట్టపరమైన హక్కులను గట్టిగా వినియోగించుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక రైతు రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం ఎన్నికల హామీలకు భిన్నంగా వ్యవహరించిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారికి 50 శాతం మాఫీ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు మార్చిందని విమర్శిస్తున్నారు.
మొదట సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.50 వేల వరకు రుణాలకే మాఫీ ప్రకటించిన ప్రభుత్వం, రైతుల నిరసనల తర్వాత దానిని రూ.75 వేల వరకు పూర్తి మాఫీగా, ఆపై రుణాలకు రూ.35 వేల వరకు మాఫీగా సవరించింది. ఎన్నికల హామీని పూర్తిగా అమలు చేయకుండా విధానాన్ని మార్చడం రైతుల్లో అసంతృప్తిని పెంచిందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
అలాగే మేకెదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటకపై బలమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వివాదాల కంటే కావేరీ నీటి సమస్య, రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.

