భారత రక్షణ రంగానికి కొత్త కేంద్రంగా రాయలసీమ నిలవబోతోంది. బెంగళూరు, హైదరాబాద్ మధ్య వ్యూహాత్మక స్థానం కావడం కూడా దీనికి కారణం. తొలిదశ ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల, అసెంబ్లింగ్, టెస్టింగ్ కేంద్రానికి శ్రీసత్యసాయి జిల్లా ( అనంతపురం జిల్లా) పుట్టపర్తిలో కేంద్ర బిందువుగా మారడమే. ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టును ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ-డీఆర్డీఓ సంస్థలు సంయుక్తంగా బ్రాహ్మణపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం అట్టహాసంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహననాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘనంగా స్వాగతించారు.
పుట్టపర్తి వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రంగా నిలవబోతోంది. 140 తేలికరకం యుద్ధ విమానాల విడిభాగాలు బెంగళూరులో తయారు చేసినా, వాటిని పుట్టపర్తి కేంద్రంలో అమర్చడం, పరీక్షించడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. దీంతో పాటు దేశ రక్షణలో కీలకమైన క్షిపణి తయారీ కేంద్రాలు,
డ్రోన్ టెస్టింగ్ యూనిట్లు, డిఫెన్స్ పార్కులు, మిలిటరీ టెక్నాలజీ స్టార్టప్‌లు, ఏరోస్పేస్ శిక్షణా కేంద్రాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా బెంగళూరు – హైదరాబాద్ మధ్య ఉన్న వ్యూహాత్మక స్థానం కారణంగా రాయలసీమ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రక్షణ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"రూ.15,803 కోట్లతో AMCA అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. 7,500 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు.
"దేశ రక్షణ రంగ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టానికిపుట్టపర్తి వేదిక కాబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు కానున్న అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్ — AMCA (Advanced Medium Combat Aircraft) భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, రాయలసీమను దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చబోతోంది" ఇది రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధికి బాటలు వేయిస్తుందని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
కరువు గడ్డకు బలమైన రక్షణ
రాయలసీమ ప్రాంతం ఇప్పటివరకు వ్యవసాయం, కరవు, వలసలతో గుర్తింపు పొందింది. ఇకపై దేశ భద్రతకు బలమైన సాంకేతిక శక్తిగా ఎదగబోతోందన్న సంకేతాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా స్పష్టమవుతున్నాయి. దీనికి నిదర్శనం దేశంలోనే తొలి భారీ స్థాయి స్టెల్త్ ఫైటర్ విమానాల కేంద్రం ఏర్పాటుకు టెంకాయ కొట్టడమే. AMCA ప్రాజెక్ట్ భారతదేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల కార్యక్రమం. ఈ విమానాలు అత్యాధునిక రాడార్ తప్పించుకునే సామర్థ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ వ్యవస్థలు, ఆధునిక ఆయుధ సమీకరణ వ్యవస్థలతో రూపొందిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగం
యుద్ధ విమానాల తుది అసెంబ్లీ
ఇంటిగ్రేషన్
ఫ్లైట్ టెస్టింగ్
ధృవీకరణ (Certification) వంటి పనులన్నీ పుట్టపర్తి సమీపంలోనే జరగనున్నాయి. విమానాల విడిభాగాల తయారీ బెంగళూరులో జరిగినప్పటికీ, తుది రూపకల్పన, పరీక్షలు రాయలసీమలో జరగడం దేశ రక్షణ రంగంలో ఈ ప్రాంత ప్రాధాన్యతను పెంచుతోంది.
రాయలసీమ ఎందుకు ఎంపికైంది?
తేలికపాటి ఐదో తరం యుద్ధ విమానాల తయారీకి రాయలసీమలోని పుట్టపర్తి ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు.
"విస్తారమైన భూమి లభ్యత, ఫ్లైట్ టెస్టింగ్‌కు అనుకూల వాతావరణం, బెంగళూరు ఏరోస్పేస్ పరిశ్రమలకు సమీపంలో ఉండడం, జాతీయ రహదారులు, విమానాశ్రయాల అనుసంధానంగా ఉండడంతో పాటు భవిష్యత్ పారిశ్రామిక విస్తరణకు అనువైన పరిస్థితులు" ఉండడం రాయలసీమను దేశ రక్షణరంగంలో కీలక భాగస్వామిగా సేవలు అందించడానికే కాకుండా ఈ ప్రాంతంలో పారిశ్రామిక, సాంకేతిక విద్యాభివృద్ధికి బాటలు పడతాయని ఆయన చెబుతున్నారు.
యువతకు ఉపాధి..
రాయలసీమను పారిశ్రామిక, రక్షణ రంగానికి అవసరమైన ప్రాజెక్టులు ఏర్పాటు వల్ల యువతకు ఉపాధి పెరగడంతో పాటు, విద్యార్థులను సాంకేతికంగా ముందడుగు వేయించడానికి సాధ్యం అవుతుందనేది ప్రభుత్వ ఆశయం. పుట్టపర్తి వద్ద ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ-డీఆర్డీఓ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టు వల్ల యువతకు భారీ ఉపాధి అవకాశాలు ఉన్నాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. పుట్టపర్తి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల యువతకు వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ముంగిటకు రానున్నాయని అంచనాలు ఉన్నాయి.
రాయలసీమలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ రంగాలు, సాఫ్ట్‌వేర్, AI టెక్నాలజీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ సపోర్ట్, లాజిస్టిక్స్, సప్లై చైన్ రంగాలు మరింత వేగం అందుకుంటాయని విశ్వసిస్తున్నారు. దీని వల్ల ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటుతో పాటు ఆ సంస్థల్లో సాంకేతిక విద్యకు మరింత డిమాండ్ పెరగడం ద్వారా ఉపాధి ఆధారిత కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపడానికి పుట్టపర్తి వద్ద ఏర్పాటు చేస్తున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఆశలు పెంచుతుందని విశ్వసిస్తున్నారు.