కావేరీ జలాలపై సుప్రీంకోర్టుకు తమిళనాడు, కర్ణాటక
x

కావేరీ జలాలపై సుప్రీంకోర్టుకు తమిళనాడు, కర్ణాటక

నీటి హక్కులపై పోరాడనున్న ఇరు రాష్ట్రాలు


కావేరీ నదీ జలాల పంపిణీ వివాదం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. తమకు రావాల్సిన నీటి వాటా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, కావేరీ జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఉత్తర్వులను సవాలు చేసేందుకు కర్ణాటక కూడా న్యాయపోరాటానికి సన్నద్ధమవుతోంది.

శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన తమిళనాడు నీటిపారుదల శాఖ మంత్రి ఆర్. నిర్మలా కుమార్, చట్టపరంగానే తమకు రావాల్సిన నీటిని సాధించుకుంటామని స్పష్టం చేశారు. కావేరీ నీటి నియంత్రణ కమిటీ సూచనల మేరకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, కర్ణాటక ఉద్దేశపూర్వకంగా వాటిని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. తమిళనాడు రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తోందని చెప్పారు.

ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇప్పటికే న్యాయ నిపుణులు, సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నారని, వారం రోజుల్లో ప్రభుత్వ న్యాయ వ్యూహంపై తుది నిర్ణయం వెలువడే అవకాశముందని మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం కోరడం, అంతర్రాష్ట్ర చర్చలు నిర్వహించడం లేదా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అన్ని ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు.

జూలై 30న జరిగిన సమావేశంలో, కావేరీ నీటి నియంత్రణ కమిటీ సిఫార్సును సమర్థించిన సీడబ్ల్యూఎంఏ.. రాబోయే 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 4.5 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది.

అయితే, ఈ ఉత్తర్వులను అమలు చేయడం సాధ్యం కాదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది కావేరీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలు, ఇప్పటికే సాగులో ఉన్న పంటలకు కూడా సరిపోదని ప్రభుత్వం వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో సీడబ్ల్యూఎంఏ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించిన అనంతరం ఆదివారం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తదుపరి కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Read More
Next Story