కుంటి సాకులు చెప్పకండి: ఎన్నికల సంఘానికి తలంటిన సుప్రీంకోర్టు
x

కుంటి సాకులు చెప్పకండి: ఎన్నికల సంఘానికి తలంటిన సుప్రీంకోర్టు

కర్ణాటక ఎన్నికల్లో రీకౌంటింగ్ వీడియో లేకపోవడంపై ఆగ్రహం


కేవలం 201 ఓట్ల తేడాతో మొదలైన శృంగేరి ఎన్నికల వివాదం.. ఇప్పుడు కీలక వీడియో రికార్డు కనిపించకపోవడంతో మరో మలుపు తిరిగింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వీడియోను గుర్తించలేకపోతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రికార్డులు లేవంటూ సాకులు చెబితే అంగీకరించబోమని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ నేత టీడీ రాజెగౌడ, బీజేపీ అభ్యర్థి డీఎన్ జీవరాజ్ మధ్య శృంగేరి అసెంబ్లీ స్థానానికి జరిగిన పోరులో రాజెగౌడ 201 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే, జీవరాజ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను మరోసారి లెక్కించాలని ఆదేశించింది. ఈ రీకౌంటింగ్‌ తర్వాత ఫలితం మారడంతో జీవరాజ్ విజేతగా ప్రకటితమయ్యారు.

ఈ ప్రక్రియపై అభ్యంతరం తెలిపిన రాజెగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 279 తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను మాత్రమే పరిశీలించాలని ఆదేశించిందని, కానీ తనకు అనుకూలంగా ఉన్న 562 చెల్లుబాటయ్యే పోస్టల్ బ్యాలెట్లను కూడా తిరిగి లెక్కించారని ఆయన ఆరోపించారు. అసలు ఓట్ల లెక్కింపు వీడియోతో పాటు, రీకౌంటింగ్‌కు సంబంధించిన రికార్డులు, ఎన్నికల పరిశీలకుడి నివేదికను సమర్పించేలా ఆదేశించాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, అసలు ఓట్ల లెక్కింపు వీడియోను గుర్తించలేకపోతున్నామని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక రికార్డులను భద్రపరచడం ఎన్నికల సంఘం బాధ్యత అని ధర్మాసనం గుర్తుచేసింది.

అందుబాటులో ఉన్న రికార్డులు, వీడియోలను తదుపరి విచారణ నాటికి సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతికూల నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.

శృంగేరి ఎన్నికల వివాదంలో అసలు ఓట్ల లెక్కింపు, రీకౌంటింగ్‌ ప్రక్రియ, సంబంధిత రికార్డుల భద్రత ఇప్పుడు కీలక అంశాలుగా మారాయి. తదుపరి విచారణలో ఎన్నికల సంఘం సమర్పించే ఆధారాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై మరింత స్పష్టత ఇవ్వనుంది.


Read More
Next Story