సిద్దరామయ్యను ఇరికించబోయి, కుమారస్వామి ఇరుక్కున్నారా?
x

సిద్దరామయ్యను ఇరికించబోయి, కుమారస్వామి ఇరుక్కున్నారా?

విచారణలో కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేందుకు రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ వీడియో కేసులో ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వీడియో చిత్రీకరణకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీ నివాసంలో అప్పగించినట్లు ప్రధాన నిందితుడు పోలీసులకు వెల్లడించడం కలకలం రేపుతోంది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ నేతల చుట్టూ తిరిగిన ఈ కేసు దర్యాప్తు.. ఇప్పుడు కుమారస్వామి నివాసం, ఆయన కార్యాలయానికి చెందిన సోషల్ మీడియా బృందం వైపు మళ్లింది.

కుమారస్వామి నివాసంలో ఫోన్ అప్పగింత!

ఈ కేసులో ఢిల్లీకి చెందిన రితేష్ పాండేను అక్టోబర్ 24న బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా అతడు వెల్లడించిన వివరాలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఢిల్లీలోని కరోల్‌బాగ్ మార్కెట్‌లో వినోద్ శర్మతో కలిసి మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినట్లు రితేష్ తెలిపాడు. అనంతరం ఆ ఫోన్‌ను కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధికారిక నివాసంలోని సోషల్ మీడియా మేనేజర్ ప్రజ్వల్ ప్రసాద్‌కు అప్పగించినట్లు వెల్లడించాడు.

అంతేకాదు, రితేష్ పాండే, ప్రజ్వల్ ప్రసాద్ మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రజ్వల్ ప్రసాద్, వినోద్ శర్మలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ వారు విచారణకు హాజరుకాలేదు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

అసలు వివాదం ఏమిటి?

ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న స్టింగ్ ఆపరేషన్ వీడియో సెప్టెంబర్ 27న యూట్యూబ్ ఛానెల్‌లో వెలుగులోకి వచ్చింది. 2023లో చిత్రీకరించినట్లు భావిస్తున్న ఈ వీడియోలో ఓ మహిళ.. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సిద్ధరామయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది.

అయితే ఈ ఆరోపణలను సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయడంతోపాటు బ్లాక్‌మెయిల్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ వీడియో రూపొందించారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వీడియో ప్రచురణ, ప్రసారాన్ని నిలిపివేయాలని సివిల్ కోర్టును ఆశ్రయించారు.

వీడియో బయటకు వచ్చిన వెంటనే కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారే ఈ స్టింగ్ ఆపరేషన్ వెనుక ఉన్నారని, టీవీ జర్నలిస్ట్ రాకేశ్ శెట్టి సహకారంతో దీనిని నిర్వహించారని ఆరోపించారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

కానీ ఇప్పుడు ప్రధాన నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం, మొబైల్ ఫోన్ అప్పగింతకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

తెరపైకి వస్తున్న మరిన్ని పేర్లు

వీడియో చిత్రీకరణ, ఎడిటింగ్, ప్రచారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ విచారణ కొనసాగిస్తోంది. కాంగ్రెస్ నేత కృపా ఆల్వా, జర్నలిస్ట్ రాకేశ్ శెట్టి పేర్లు కూడా ఈ కేసులో ప్రస్తావనకు వచ్చాయి. రాకేశ్ శెట్టికి ముందస్తు బెయిల్ లభించగా, ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. కృపా ఆల్వా కూడా తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు.

2023లో ఈ వీడియో రికార్డయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొదట ఏదైనా ఆరోపణలకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారా? ఆ తర్వాత దానిని రాజకీయంగా ఉపయోగపడేలా మార్చి ప్రచారంలోకి తీసుకొచ్చారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, వీడియోలో చేసిన ఆరోపణలకు మద్దతుగా ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు లేవని, అవి కల్పితమైనవిగా కనిపిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే వీడియో వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? దానిని రూపొందించడానికి ఎవరు నిధులు సమకూర్చారు? ఎడిట్ చేసి ప్రచారంలోకి తీసుకొచ్చింది ఎవరు? రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

కుమారస్వామి ఎదురుదాడి

తన నివాసానికి సంబంధించిన వివరాలు బయటకు రావడంతో కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంపై, పోలీసుల దర్యాప్తుపై విమర్శలు మరింత పెంచారు. వీడియో రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. దానికి బదులుగా జేడీ(ఎస్) సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

పార్టీ కార్యకర్తలను వేధించడం మానేసి, నేరుగా తనను ప్రశ్నించాలని డీకే శివకుమార్‌కు సవాల్ విసిరారు. ఈ కేసులో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రమేయం కలిగి ఉంటే సీసీబీ విచారణ ద్వారా పూర్తి నిజాలు బయటకు రావడం కష్టమని పేర్కొన్నారు. అందుకే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు.

రాజకీయంగానూ కీలకంగా మారిన కేసు

ఈ వ్యవహారం కేవలం స్టింగ్ ఆపరేషన్ వీడియోకే పరిమితం కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య రాజకీయ పోరాటానికి మరో వేదికగా మారింది. ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగ సామాజిక వర్గంపై రాజకీయ ఆధిపత్యం కోసం డీకే శివకుమార్, కుమారస్వామి మధ్య పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇప్పటివరకు శివకుమార్‌పై ఆరోపణలు చేసిన కుమారస్వామికి, తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు, ఈ పరిణామాలను శివకుమార్ తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

అయితే, నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాత్రమే కుమారస్వామి పాత్రపై తుది నిర్ణయానికి రాలేమని పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆధారాలపై విచారణ కొనసాగుతోంది.

మొత్తానికి, సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టింగ్ ఆపరేషన్ వెనుక ఎవరున్నారు? దాని రూపకల్పనలో ఎవరెవరు భాగస్వాములయ్యారు? రాజకీయ నేతల ప్రమేయం ఎంతవరకు ఉంది? అన్నది తేలాల్సి ఉంది. పోలీసుల తదుపరి విచారణ, సాంకేతిక ఆధారాల విశ్లేషణతోనే ఈ వివాదంలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Read More
Next Story