x
తిరుమలలో బుధవారం శ్రీవారి పుష్కరిణికి హారతి ఇస్తున్న పండితులు

శ్రీవారి బ్రహ్మెత్సవం: 8 రోజుల్లో 5.76 లక్షల మందికి దర్శనం

రూ.28.94 కోట్లు టీటీడీకి హుండీకి ఆదాయం.


Click the Play button to hear this message in audio format

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ముగిశాయి. శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్లార్ కు వేదపండితులు చక్రస్నానం చేయించడంతో శాస్త్రోక్తంగా ముగిశాయి.

తిరుమల శ్రీవారికి ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మత్సవాల్లో హుండీ కానుకలతో రూ.28.94 కోట్లు టీటీడీకి ఆదాయం లభించింది. 5.76 లక్షల మంది యత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.


తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర, అధికారులతో కలిసి చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు.

ఈ నెల (సెప్టెంబరు) 15 వ తేదీనుంచి 22వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు.


"శ్రీవారి బ్రహ్మత్సవాల వేళ తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు గ్యాలరీల్లో కూడా 21.84 లక్షల అన్నప్రసాదాల పంపిణీ చేశారు. కల్యాణకట్టలో 2.04 లక్షల మంది తలనీలాలు సమర్పించారు" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.

"గరుడసేవ రోజు భక్తులందరికీ దర్శనం కల్పించాం. 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలు వచ్చాయి. మొదటిసారి విదేశీ కళాబృందాల ప్రదర్శనలు అలరించాయి" అని నాయుడు చెప్పారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులు, భక్తుల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్బీ .ఆర్. నాయుడు తెలిపారు.
బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందించిన సేవలు
ఎనిమిది రోజుల బ్రహ్మోత్సవాల్లో మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
రూ.28.94 కోట్ల హుండీ కానుకలు లభించాయి.
21.84 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
33 లక్షల లడ్డూలు విక్రయించారు.
ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,671 ట్రిప్పుల్లో 3,92,106 మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,584 ట్రిప్పుల్లో 4,97,195 మంది భక్తులు ప్రయాణించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడసేవ రోజున తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ దర్శనం కల్పించామని చైర్మన్ నాయుడు వివరించారు. ఆ రోజు ఏర్పాట్లను పరిశీలించేందుకు పాలక మండలి సభ్యులు, ఈఓ ముద్దాడి రవిచంద్ర, అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో ప్రత్యక్షంగా పర్యటించారు. భక్తులతో మాట్లాడారు. ఆ ఫీడ్ బ్యాక్ మరింత సేవలు అందించడానికి అవకాశం కలిగిందని ఆయన తెలిపారు.

కొత్త సదుపాయాలు ప్రారంభం

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ్ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు.
తిరుచానూరు ఆలయానికి ఉన్న రోడ్లను అనుసంధానం చేసేందుకు మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.90 కోట్లతో చర్యలు చేపట్టాం.
అలిపిరి సమీపంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

భవిష్యత్ ప్రణాళికలు

తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు వృక్ష గోవిందం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవ, శ్రీవారి వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు

వాహనసేవలకు ముందు ఇప్పటివరకు లేనివిధంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు చెందిన సుమారు 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు.
గరుడసేవ రోజున 14 రాష్ట్రాల నుంచి 32 కళాబృందాలకు చెందిన 916 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు నిర్వహించగా, జర్మనీ, సింగపూర్ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉత్తమ కళాప్రదర్శన చేసిన కళాబృందాలను ప్రోత్సహించేందుకు తొలిసారిగా ప్రతిరోజూ వాహనసేవలో నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో సన్మానించారు.
తిరుమలలోని ఆస్థాన మండపం, నాదనీరాజనం, తిరుపతిలోని మహతి ఆడిటోరియం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరంలోనూ భక్తులను ఆకట్టుకునేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

60 టన్నలతో పుష్పాలంకరణ

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించి పుష్పాలంకరణ చేశారు.
తిరుమలలో చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహనసేవలను భక్తులు సులభంగా వీక్షించేలా 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. గరుడసేవ రోజున తిరుమలలో 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది విశేష సేవలు అందించారు. గరుడసేవ సందర్భంగా తిరుమలలో సేకరించిన సుమారు 173 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. తిరుపతిలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 600 మంది టీటీడీ ఉద్యోగులు గరుడసేవ సందర్భంగా విశేష సేవలందించారు.
Read More
Next Story