
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి పుట్టపర్తి వద్ద ఆయుధ సంపత్తి ఎగ్జిబిషన్ పరిశీలిస్తున్న కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్,
సైనిక అవసరాలకు అంతిమ గమ్యం రాయలసీమ!
ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రికి సూచించిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్..
భారతదేశ వ్యూహాత్మక రక్షణకు ఏపీ వ్యూహాత్మక కేంద్రంగా మారబోతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టు రాష్ట్రంతో పాటు దేశ రక్షణ చరిత్రలో ఓ చారిత్రాత్మక అధ్యాయాన్ని జోడించబోతోందని ఆయన వెల్లడించారు.
"రాయలసీమ దేశానికి మిలట్రీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సుగా మార్చడానికి ప్రణాళికలు చేయండి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేకంగా సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద శుక్రవారం ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ( Advanced Medium Combat Aircraft AMCA) డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"అమ్కా ప్రాజెక్టు నుంచి తయారయ్యే మొదటి విమానం పుట్టపర్తి నుంచే ఎగురుతుంది. బీడీఎల్ తయారు చేసిన టార్పెడో, హెచ్ఎఫ్ సీఎల్ నుంచి తయారయ్యే ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కూడా ఈ నేల నుంచే పరీక్షిస్తాం" అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
"ప్రపంచ దేశాల సరసన ఏపీ నిలవబోతోంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ తోపాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రాలు కేవలం కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ సరసన చేసింది" అని క్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేయబోతున్నాం అని ప్రకటించారు. ఇక్కడి ప్రాజెక్టులో నాలుగు డిఫెన్స్ ( Defense sector ) కంపెనీలకు కూడా శంకుస్థాపనలు జరిగాయి. కర్నూలు డ్రోన్ సిటీలో ఎనిమిది కంపెనీలకు కూడా శంకుస్థాపన చేశాం అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
బాబుకు కితాబు...
పుట్టపర్తి వద్ద జరిగిన సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు.
"ఆంధ్రప్రదేశ్ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్. దేశానికి ఓ రోల్ మోడల్ గా ఏపీ మారింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో టెక్నాలజీ, అభివృద్ధిపై ఆలోచించే దార్శనిక నేత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇలాంటి నేతను ఎక్కడా చూడలేదు. దేశ,విదేశాల్లో విశిష్ట పురస్కారాలు అందుకున్న వ్యక్తి. క్వాంటం సహా ఆధునిక టెక్నాలజీని ఏపీకి తీసుకువచ్చారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయంటే చంద్రబాబుకు ఉన్న దార్శనికతకు నిదర్శనం" అని ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
రక్షణ రంగం బలోపేతం..
అంతర్జాతీయంగా విభిన్న పరిస్థితులు నెలకున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు. దేశ భద్రతలో ఇతర దేశాలపై ఆధారపడలేమనీ, ఆత్మనిర్భరత అనేది ఓ కీలకమైన అంశం అని అన్నారు. పుట్టపర్తి వద్ద ఏర్పాటు చేస్తున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
"పుట్టపర్తిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టు డీఆర్డీఓలో భాగమైన ఏడీఏ అభివృద్ధి చేస్తోందనీ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధునికతరం యుద్ధ విమానాల అభివృద్ధిపై పనిచేస్తోంది. ఇప్పుడు ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం తయారు చేసేందుకు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేస్తోంది. అమ్కా ప్రాజెక్టుతో తయారైన ఆధునిక యుద్ధ విమానాలు మన రక్షణ శక్తి, మన గగనశక్తిని చాటేలా పుట్టపర్తి నుంచి టేకాఫ్ అవుతాయి" అని రాజ్ నాథ్ ప్రకటించారు. ఆ తరహా యుద్ధ విమానాలను పుట్టపర్తి నుంచి తయారు చేయబోతున్నాం అని కూడా ఆయన వెల్లడించారు.
స్వదేశీ శక్తితో..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ( Bharat Dynamics Limited BDL ) కూడా రూ.480 కోట్లతో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ వ్యవస్థలను, టార్పెడోలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటి వరకూ దిగుమతి చేసుకుంటున్న చాలా పరికరాలను కూడా స్వదేశీయంగా తయారు చేసుకోగలమని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రక్షణ శాఖ బలాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టులతో మన సముద్ర తీరప్రాంతాలకు పూర్తి రక్షణతో పాటు బ్లూ ఎకానమీకి ఊతం ఇచ్చేలా ఈ ప్రాజెక్టు మారుతుందని ఆయన వెల్లడించారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అగ్నేయాస్త్ర సంస్థ ఆధునిక ఆయుధాలను తయారు చేస్తోంది, రూ.1500 కోట్ల పెట్టుబడితో భవిష్యత్ లో యుద్ధానికి అవసరమైన ఆధునిక వ్యవస్థలు తయారు అవుతాయని కూడా ఆయన భవిష్యత్తు రక్షణ వ్యవస్థ ఎలా ఉండబోతోందనేది కూడా వివరించారు.
డ్రోన్ టెక్నాలజీ ఓ గేమ్ ఛేంజర్..
"హెచ్ఎఫ్ఎసీఎల్ రూ.1294 కోట్ల వ్యయంతో ఎలక్ట్రికల్ ఫ్యూజ్ లు తయారు చేస్తుందని రాజ్ నాథ్ ప్రకటించారు. ఎనిమిది డ్రోన్ కంపెనీలు ఓ డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేసేలా ఈ ప్రాజెక్టులు రాబోతున్నాయి. డ్రోన్ టెక్నాలజీ ఆధునిక వార్ ఫేర్ లో ఓ గేమ్ చేంజర్ గా మారింది. వీటితో పాటు వ్యవసాయం సహా వేర్వేరు అవసరాలకు వీటి ఉపయోగం ఉంటుందని ఆయన వివరించారు.
" సూరత్ డైమండ్ సిటీగా, బెంగుళూరు భారత సిలికాన్ వ్యాలీగా పేరు సాధించాయి. కర్నూలు కూడా ప్రపంచ డ్రోన్ హబ్ గా ప్రసిద్ధి చెందుతుంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేయబోతున్నాం.
మన రక్షణ దళాలకు పూర్తి శక్తి సామర్ధ్యాలు అందించేలా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం" అని ప్రకటించారు.
ప్రయివేటు భాగస్వామ్యంతో..
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగంతో అనుసంధానం చేసి, సంయుక్తంగా పనిచేయడం వల్ల ఒక దేశంగా రక్షణ రంగ ప్రగతి వైపు కదులుతున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. పరిశ్రమలు, స్టార్టప్ సంస్థలు కలిసి జన విప్లవంగా మారి దేశ అభివృద్ధి అనే మహాయజ్ఞం కోసం పనిచేస్తున్నామనీ, ఈ ప్రజా ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
"ఈ ప్రాంతం దేశానికి మిలట్రీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సుగా ఈ ప్రాంతాన్ని తయారు చేసేలా ప్రణాళికలు చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా" అని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబును విస్మయానిక గురి చేశారు.
"బెంగుళూరుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాన్ని సైనిక పారిశ్రామిక సముదాయంగా మారిస్తే దేశ అభివృద్ధికి కీలకం అవుతుంది. గతంలో భారత్ అతిపెద్ద ఆయుధ దిగుమతి దారుగా ఉండేది. పదేళ్లుగా తీసుకున్న చర్యలతో పరిస్థితి మారింది. గతంలో కేవలం రూ.46 వేల కోట్ల విలువైన ఆయుధాలు మాత్రమే తయారయ్యేవి. ఇవాళ రూ. 1.54 లక్షల కోట్ల విలువైన ఆయుధ ఉత్పత్తి జరుగుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఇది రూ.1.75 లక్షల కోట్ల ఉత్పత్తికి చేరుతాం. దీనివల్ల ఆయుధ ఎగుమతులు రూ.600 కోట్లు మాత్రమే ఉండేది. ఇవాళ రూ.40 వేల కోట్ల ఎగుమతులు చేయగలుగుతున్నాం" అని దేశ రక్షణ రంగం సాధించిన ప్రగతిని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ వివరించారు.
మొదటి విమానం పుట్టపర్తి నుంచే...
పట్టపర్తి వద్ద అమ్కా ప్రాజెక్టు తయారు చేసే మొదటి విమానం ఇక్కడి నుంచే గగనతల ప్రవేశం చేస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. బీడీఎల్ తయారు చేసిన టార్పెడో, హెచ్ఎఫ్ సీఎల్ నుంచి తయారయ్యే ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కూడా ఈ నేల నుంచే పరీక్షిస్తామన్నారు. డ్రోన్ సిటీతో ప్రపంచంలోని ప్రతీ మూలకూ మన డ్రోన్లు వెళ్లాలి. ఈ ప్రాజెక్టులతో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు, రహదారులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు టౌన్ షిప్ లతో సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Next Story

