తిరుమల కొండపై 'స్థలాల' రాజకీయం!

కొత్త భవనాలకు అనుమతి ఉందా?


కలియుగ వైకుంఠం, కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల కొండపై ఇప్పుడు భవనాల నిర్మాణం, స్థలాల కేటాయింపు అంశం తెలుగు రాష్ట్రాల మధ్య చర్చకు దారి తీసింది. ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో కోల్‌కతాలో భేటీ అయ్యారు. బెంగాల్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూనే.. తిరుమలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ భవన నిర్మాణానికి తాము సహకరిస్తామని లోకేష్ హామీ ఇవ్వడం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది!

​ఎందుకంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి, తిరుమలలో తెలంగాణ ప్రభుత్వ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఉదంతం మనకు తెలుసు. అంతెందుకు.. స్వయంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తన పరిధిలోని అటవీశాఖ అతిథి గృహ నిర్మాణానికి తిరుమలలో కేవలం రెండు ఎకరాల భూమి కేటాయించాలని కోరగా.. టీటీడీ (TTD) బోర్డు దానిని సున్నితంగా తిరస్కరించింది! సొంత రాష్ట్ర డిప్యూటీ సీఎం కోరినా ఇవ్వని స్థలాన్ని, పొరుగు రాష్ట్రాలకు ఎలా ఇస్తారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది."

ప్రభుత్వ భవనాలకు అనుమతి ఉందా?

​"ప్రస్తుతం తిరుమల కొండపై స్థలాల కొరత తీవ్రంగా ఉంది. పైగా సుప్రీంకోర్టు, హైకోర్టుల పర్యావరణ మార్గదర్శకాల ప్రకారం.. తిరుమల పవిత్రత, కొండపై ఉన్న అటవీ జీవావరణాన్ని కాపాడటం కోసం కొత్త భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అందుకే టీటీడీ కొత్తగా ఎవరికీ స్థలాలు కేటాయించడం లేదు. పవన్ కళ్యాణ్ అభ్యర్థనను కూడా అందుకే తిరస్కరించిన టీటీడీ.. భూమి ఇవ్వలేం. కానీ,
"ఇప్పటికే కొండపై ఉన్న అతిథి గృహాల్లోనే ఆయా శాఖల అవసరాలకు తగిన భవనాన్ని కేటాయిస్తాం" అని స్పష్టం చేసింది"

నిర్మాణం, నిషేధం ఎప్పటి నుంచి?

తిరుమలలో ప్రైవేట్ వ్యక్తులు కాటేజీలు కట్టుకోవచ్చా? అని. తిరుమల కొండపై ఎలాంటి 'ప్రైవేట్ ఆస్తి' కి హక్కు లేదు. కొండపై ఉన్న భూమంతా శ్రీవారిదే. అయితే, గతంలో 2004 నుంచి 2011-12 మధ్య కాలంలో 'డోనార్ స్కీమ్' కింద పద్మావతి నగర్ లాంటి ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, విరాళాలు ఇచ్చే ధనవంతులు లగ్జరీ గెస్ట్ హౌస్‌లు నిర్మించి టీటీడీకి అప్పగించే సంస్కృతి విపరీతంగా పెరిగింది. దీనివల్ల కొండపై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 2012 నుంచి తిరుమల కొండపై కొత్తగా ప్రైవేట్ కాటేజీలు, లగ్జరీ గెస్ట్ హౌస్‌ల నిర్మాణాలపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది.
Read More
Next Story