పోలీసే నిందితుడైతే మూడు నెలలు.. సాధారణ హత్యకు ఎన్నేళ్లు?
కృష్ణలంక లాకప్ లో హత్య నిర్థారణకు మూడు నెలలు...
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ మూడు నెలల తర్వాత రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు పెట్టింది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు నేతృత్వంలో పోలీసులు సాయికృష్ణను హింసించి చంపి, రాణీగారి తోటలోని పాడుబడిన భవనంలో ఉంచి, అర్ధరాత్రి శ్మశానవాటికలో కాల్చేశారని సిట్ ఆరోపించింది.
ఇది సాధారణ హత్య కేసు కాదు. నిందితులు పోలీసులే. స్థలం స్టేషన్, లాకప్, తమ పరిధిలోని భవనం, తమ నగరంలోని శ్మశానం. సాక్షులు సహచరులే. సీసీటీవీలు తమవే. అయినా ముడి విప్పడానికి మూడు నెలలు పట్టింది. నిందితులు నోరు విప్పలేదు. పరారీలో ఉన్న సురేష్ లొంగిపోయిన తర్వాతే తాజా వివరాలు రిపోర్టులోకి వచ్చాయి.
కోర్టు... మీడియా వత్తిడి ఉన్నా...
పోలీసు శాఖే నిందితుడైనప్పుడు, ప్రత్యేక బృందం పెట్టి, హైకోర్టు ఒత్తిడి ఉండి, మీడియా రోజూ రాసినా మూడు నెలలు పట్టిందంటే… సాధారణ పౌరుడు హత్యకు గురైతే దర్యాప్తుకు ఎంత సమయం కావాలి? ఆరు నెలలా? ఏడాదా? లేక ఫైలు మూలన పడి ‘విచారణ కొనసాగుతోంది’ అనే వాక్యంతో సరిపెట్టే పది ఏళ్లా?
సాధారణ హత్య కేసులో నిందితుడు పారిపోతాడు. సాక్షులు భయపడతారు. సీసీటీవీ ఉండదు. ఫోన్ లొకేషన్ కూడా సరిగా రాదు. ఇక్కడ అవన్నీ పోలీసుల చేతిలోనే ఉన్నాయి. అయినా తొలి రోజుల్లో కథ మరోలా నడిచింది. అతడు పారిపోయాడని, ఫోన్ గోవాకు వెళ్లిందని చెప్పే ప్రయత్నం జరిగిందని సిట్కే అనుమానం. అంటే నిజాన్ని దాచడం కూడా సులభం కాదు. దాచినవాళ్లే విచారణ చేసేవాళ్లు కావడమే అసలు సమస్య.
సిట్ పని చేసింది. కోర్టుకు రిపోర్టు ఇచ్చింది. కానీ స్టేషన్ స్థాయి నిందితుల దాటి, పర్యవేక్షణ బాధ్యత ఎవరిదీ అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు. సీఎం, హోం మంత్రి స్థాయిలో ఒక్క గట్టి మాట లేకపోతే ప్రజలు ఏం అనుకుంటారు? పోలీసులు కొట్టి చంపినా మూడు నెలలు పడితే చాలు, అంతకు మించి జవాబుదారీతనం అవసరం లేదనా?
న్యాయం అంటే కేసు నమోదు కావడం మాత్రమే కాదు. త్వరగా నిజం బయటపడటం, బాధ్యులపై చర్య, బాధిత కుటుంబానికి సమాధానం. సాయికృష్ణ కేసులో సిట్ ముందుకు వెళ్లింది. అది వాస్తవం. కానీ మూడు నెలల తర్వాత వచ్చిన ఈ ‘విజయం’ సాధారణ పౌరుడికి ఆశ కలిగించదు. భయమే కలిగిస్తుంది.
ఎందుకంటే... ప్రశ్న సూటిగా ఉంది.
పోలీసే చేసిన హత్యకు మూడు నెలలు పట్టిందంటే… మిగిలిన హత్యలకు ఎన్ని నెలలు పడతాయి?

