
ఐదేళ్లలో ఇల్లు కట్టకపోతే స్థలం వెనక్కి.. కర్ణాటక సర్కార్ హెచ్చరిక
ఏదైన డబ్బులు తీసుకుంటే వడ్డీతో సహ చెల్లిస్తామని హామీ
ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను ఐదేళ్లలోపు వినియోగించి ఇళ్లు నిర్మించుకోవాలని, లేకపోతే ఆ స్థలాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించి, స్థలాలను వెనక్కి తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ నిబంధన బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ), పూర్వపు సిటీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ బోర్డ్ (సీఐటిబీ), స్థానిక సంస్థలు, సహకార సంఘాలు కేటాయించిన ప్లాట్లకు వర్తిస్తుందని చెప్పారు. ఖాళీ స్థలాలు చెత్తకుప్పలుగా మారకుండా అడ్డుకోవడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు.
బెంగళూరులోని హెబ్బాల్ జంక్షన్ సమీపంలో నిర్వహించిన "వ్యర్థాల నుంచి స్వేచ్ఛ" కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన శివకుమార్.. బీడీఏ స్థలం అయినా, కార్పొరేషన్ స్థలం అయినా యజమాని దానిని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉందన్నారు. స్థలం పొందిన ఐదేళ్లలోపు ఇల్లు నిర్మించకపోతే రెట్టింపు ఆస్తిపన్ను విధించే అవకాశం లేదా స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం నిజంగానే ఇలాంటి ప్లాట్లను వెనక్కి తీసుకుంటుందా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన, ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికే స్థలాలు కేటాయిస్తామని, దశాబ్దాల తరబడి ఖాళీగా ఉంచడం సమంజసం కాదన్నారు. 20, 30, 40 సంవత్సరాలు గడిచినా కొందరు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించలేదని పేర్కొన్నారు.
ఇలాంటి సందర్భాల్లో వారు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇచ్చి, ప్లాట్‌ను స్వాధీనం చేసుకుంటామని సీఎం తెలిపారు. కనీసం ప్రహరీ గోడ కూడా నిర్మించకుండా స్థలాలను నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల అవి చెత్తకుప్పలుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరును పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆస్తి యజమానులు కూడా తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలని శివకుమార్ పిలుపునిచ్చారు. చెత్తను తాము వేయకపోయినా, తమ స్థలాన్ని శుభ్రంగా ఉంచి సంరక్షించుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని ఆయన స్పష్టం చేశారు.

