
కేరళలో మోదీ ప్రసంగంపై సతీశన్ తీవ్ర విమర్శలు..
మోదీ ప్రసంగం మతతత్వంపైనే కేంద్రీకృతమైందని, దేశ భవిష్యత్తు లేదా రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతలపై లేదని ఆరోపించిన అసెంబ్లీ ప్రతిపక్ష నేత.
కేరళ(Kerala)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చేసిన ప్రసంగంపై అసెంబ్లీ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్(VD Satheesan) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం (జనవరి 23) తిరువనంతపురంలో మోదీ ప్రసంగం. దేశ భవిష్యత్తు లేదా కేరళ ప్రజల ప్రాధాన్యతపై కాకుండా పూర్తిగా మతతత్వాన్ని ప్రచారం చేసేలా ఉందన్నారు.
తిరువనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్‌తో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. కేరళలో తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. అలాగే కాంగ్రెస్‌ను “MMC – ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్”గా అభివర్ణిస్తూ..కేరళను తమ రాజకీయ వ్యూహాలకు “పరీక్షా స్థలం”గా వాడుకుంటోందని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన సతీశన్.. ప్రధాని కేరళకు రావడం, అధికారికంగా లేదా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయన హక్కేనని స్పష్టం చేశారు. అయితే ప్రధాని హోదాలో ఉండి బహిరంగంగా మతతత్వాన్ని ప్రోత్సహించడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అలాంటి వైఖరి భారతదేశపు విలువలను దెబ్బతీయడమేనన్నారు.
మోదీ ప్రసంగంలో దేశ భవిష్యత్తుపై గానీ, కేరళ ప్రజల సమస్యలపై గానీ ఎలాంటి ప్రస్తావన లేదని సతీశన్ ఆరోపించారు. బదులుగా, మతతత్వ అంశాలకే పరిమితమై మాట్లాడటం ద్వారా కేరళలో బీజేపీ, సంఘ్ పరివార్ ఎన్నికల ఎజెండా పూర్తిగా మత విభజన రాజకీయాలపై ఆధారపడి ఉందని స్పష్టమైందని చెప్పారు.
కేరళ లౌకిక స్వభావాన్ని బీజేపీ, మోదీ త్వరలోనే గ్రహిస్తారని సతీశన్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో వారు ప్రయోగిస్తున్న విభజన రాజకీయాలు, మత విషం కేరళ గడ్డపై ఆమోదం పొందవని స్పష్టం చేశారు.
లౌకికవాదాన్ని పరిరక్షించడంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్, యూడీఎఫ్ ప్రాధాన్యతల్లో అగ్రస్థానంలో ఉందని సతీశన్ తెలిపారు. రాష్ట్రంలో మతతత్వ శక్తులను ఎదుర్కొని, లౌకికతను కాపాడేందుకు యూడీఎఫ్ ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్, యూడీఎఫ్‌ల లౌకిక దృక్పథానికి మోదీ నుంచి ఎలాంటి “సర్టిఫికెట్లు” అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్, యూడీఎఫ్‌లపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. జమాతే-ఇ-ఇస్లామీతో సహా కొన్ని ముస్లిం సంస్థల మద్దతు ఆ కూటమికి ఉందని విమర్శిస్తోంది.

