మిషన్ రాయలసీమ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మిషన్ రాయలసీమ జోరందుకుంది. ప్రత్యర్థి పార్టీకి మింగుడు పడని విధంగా పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో పూర్వోదయ ప్రాజెక్టుతో ఉద్యాన పంటలకు ప్రోత్సాహం ఇవ్వడానికి కొత్త ప్రాజెక్టుకును ఆగష్టులో నాంది పలకనుంది. మూడు రోజుల తన నియోజకవర్గం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వర్ణ కుప్పం ప్రాజెక్టుకు నాంది పలికారు. సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ సహకారంతో కుప్పం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
"సీమలో ఫ్యాక్షన్ యుగం ముగిసింది. ఇప్పుడు అభివృద్ధే అజెండా ప్రజలు అమరావతి అంటే. గొడ్డలి పార్టీ మావిగన్ అంటోంది" అని కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. కుప్పంపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని, నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడిందని విమర్శించారు. 2019-24 మధ్య తనను కుప్పంలో పర్యటించ నీయకుండా అడ్డుకున్నారని, తనకు సహకరించిన స్థానికులను వేధించారని ఆరోజులను గుర్తు చేసుకుని కలత చెందారు.
ఎన్టీఆర్ హయాంలో 1985లో కుప్పం బస్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగింది. మూడు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న కుప్పంలో రూ.118 కోట్లతో మోడల్ బస్ స్టేషన్, డిపోకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.
80 వేల మందికి ఉద్యోగాలు
కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దే దిశగా పరిశ్రమలు తీసుకొస్తున్నామని, ఉద్యోగాల కోసం కుప్పం ప్రజలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా... ఇతర ప్రాంతాల వారు కుప్పానికి వచ్చే పరిస్థితి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
"ఒక్క రోజులోనే రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ఎంఓయూలు కుదుర్చుకున్నాం. వాటి ద్వారా సుమారు 80 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అడిడాస్ ఫుట్‌వేర్ సంస్థ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడినా అది కుప్పాన్నే ఎంచుకుందని చెప్పారు. టూ సీటర్ ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ పరిశ్రమతో పాటు డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా కుప్పానికి వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు
కుప్పంలోనూ బంగారు గనులు
కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ప్రారంభించినట్లే కుప్పంలోనూ బంగారు గనులు ఉన్నాయని చెబుతున్నారని, సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతామని ప్రకటించారు. మైక్రో ఇరిగేషన్‌లో కుప్పం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్న ఆయన రాష్ట్రానికి అది శ్రీరామరక్షగా మారిందన్నారు.
పూర్వోదయకు మదనపల్లెలో శ్రీకారం
రాయలసీమను ఉద్యానవనాల హబ్ గా తీర్చిదిద్దాం. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన పంటలను ప్రోత్సహించి రాయలసీమను అభివృద్ధి చేస్తామని, వచ్చే నెలలో మదనపల్లెలో దానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కుప్పంలో రోజుకు 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా డెయిరీ రంగాన్ని విస్తరిస్తామని, వాణిజ్య పంటలకు పెద్దపీట వేస్తామని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలకు సోలార్ రూఫ్‌టాప్ ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, బీసీలు, ఓసీల ఇళ్లపైనా రూ.552 కోట్లతో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. నెట్ జీరో విధానంలో భాగంగా ఇంటి మిద్దెలపైనే కూరగాయలు పండించే విధానాన్ని ప్రోత్సహించాలని, ఈ-సైకిళ్ల వినియోగం పెంచి కాలుష్యరహిత కుప్పాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్
కుప్పంలోని బ్లూ గ్రానైట్‌కు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందుకే హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గమంతా మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామని, తిరుమల తర్వాత అత్యధిక గ్రీన్ కవర్ ఉన్న ప్రాంతం కుప్పమేనని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సదుపాయాలు విస్తరించామని, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కుప్పానికి వస్తున్న పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు పొందాలంటే యువత నైపుణ్య శిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.
రూ.34 కోట్లతో దేవాలయాల అభివృద్ధి
టీటీడీ నిధులతో రూ.34 కోట్లతో కుప్పంలోని 130 దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ పనులకు కంగుంది గ్రామంలో శంకుస్థాపన చేశారు. తిరుమలలో గత పాలకమండలి కల్తీ నెయ్యి వినియోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, కూటమి ప్రభుత్వం దాన్ని అరికట్టిందని పేర్కొన్నారు. కుప్పంపై గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని, నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడిందని విమర్శించారు. 2019-24 మధ్య తనను కుప్పంలో పర్యటించ నీయకుండా అడ్డుకున్నారని, తనకు సహకరించిన స్థానికులను వేధించారని ఆరోపించారు.
60 ఏళ్ల భూ వివాదానికి తెర
కంగుంది గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1960 నుంచి న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న భూముల సమస్యకు తెరదించారు. దశాబ్దాలుగా సాగులో ఉన్న భూములకు చట్టబద్ధ హక్కు కల్పిస్తూ అర్హులైన రైతులకు డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. ఆరు దశాబ్దాల తరువాత సమస్య పరిష్కారమైందని ఇందులో కూడా గొడ్డలి పార్టీ (వైసీపీ) 22 ఏలో చేర్చి వివాదంగా మార్చారని ముఖ్యమంత్రి ఆరోపించారు. గ్రామసభలు, సమగ్ర సర్వేలు, రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం పట్టాల మంజూరుకు నిర్ణయం. జి.ఓ.ఎం.ఎస్. నం.391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమి వర్గీకరణ మార్పునకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి బీఎస్‌వో-15 నిబంధనల ప్రకారం అర్హులైన సాగుదారులకు డీకేటీ పట్టాలు మంజూరు. 322 మంది రైతులకు 460.19 ఎకరాల భూమిపై డీకేటీ పట్టాల పంపిణీ. లబ్ధిదారుల్లో 253 బీసీ, 10 ఓసీ, 13 ఎస్సీ, 46 ఎస్టీ కుటుంబాలు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లింది
సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇప్పుడు అభివృద్ధే అజెండాగా మారిందన్నారు. ప్రజల విషయంలో తాను సౌమ్యుడినేనని, కానీ సంఘ విద్రోహ శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. మరో రెండేళ్లలో తన రాజకీయ జీవితం 50 ఏళ్లు పూర్తవుతుందని, ఇలాంటి సమయంలో కూడా రౌడీలు, మాఫియాలతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు. రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినందువల్లే వివేకానందరెడ్డి హత్య జరిగిందని, కోడికత్తి డ్రామా వచ్చిందని, వాటికి తనను బాధ్యుడిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానిపై రోజుకో మాట
రాజధానిపై రోజూ కొత్త మాటలు మాట్లాడుతున్నారని, కేంద్రం చట్టం చేసిన తర్వాత రాజధానిని మార్చడం సాధ్యం కాదన్నారు. అమరావతి రాజధానిని తాము కోరుకుంటుంటే, వాటికన్ తరహాలో 'మావిగన్' కావాలని గొడ్డలి పార్టీ మాట్లాడుతోందని విమర్శించారు. గొడ్డలి పార్టీ అని తాము చెప్పడం కాదని, వారే అంగీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కుప్పాన్ని ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని, ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ సహకారంతో కుప్పం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సీఎస్సార్, పీ4 విధానాల ద్వారా పేదలను ఆదుకుంటూ కుప్పాన్ని దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.