
రిజర్వేషన్ల పెంపుకు కర్ణాటక హైకోర్టు బ్రేక్
ఎస్సీ, ఎస్టీలకు పెంచిన రిజర్వేషన్ల కొట్టివేత
కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచుతూ గతంలో తీసుకొచ్చిన చట్టంలోని కొన్ని నిబంధనలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. దీంతో రిజర్వేషన్ల పెంపు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లను 3 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ 2022లో అప్పటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 56 శాతానికి చేరాయి. అయితే, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఈ నిర్ణయం అధిగమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ కేఎస్ హేమలేఖతో కూడిన ధర్మాసనం.. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన నిబంధనలను కొట్టివేసింది. రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచాలంటే అందుకు అసాధారణ పరిస్థితులు ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విషయంలో రాజ్యాంగంలోని 14, 15 అధికరణాలను ప్రస్తావించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన చట్టంలోని నాలుగో సెక్షన్ కూడా రాజ్యాంగంలోని 14, 16 అధికరణాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
ఈ చట్టాన్ని అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చింది. గవర్నర్ 2023 జనవరి 11న ఆమోదం తెలపగా, మరుసటి రోజు గెజిట్లో ప్రచురించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యంపై నాగమోహన్ దాస్ కమిషన్, జస్టిస్ సుభాష్ బి. ఆది నేతృత్వంలోని కమిటీ నివేదికలు సహా పలు అంశాలను ప్రభుత్వం తన నిర్ణయానికి ఆధారంగా తీసుకుంది.
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని సుప్రీంకోర్టు 1992లో ఇంద్ర సాహ్నీ కేసులో నిర్దేశించింది. అయితే, ఈ పరిమితిని అధిగమించడానికి ప్రత్యేక పరిస్థితులు ఉండాలని న్యాయస్థానాలు గతంలో స్పష్టం చేశాయి.
హైకోర్టు తీర్పుపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జీ. పరమేశ్వర స్పందించారు. ఈ నిర్ణయం సామాజిక న్యాయం, విద్యావకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యంపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. కర్ణాటక రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు, కొనసాగుతున్న నియామకాలు, విద్యావకాశాల విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

