AI Pic
x

AI

Updated | శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత?

రెండు రోజులకు సరిపడ నిల్వలు? సమస్య లేదంటున్న టీటీడీ.


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత ఏర్పడిందా? ప్రస్తుతం రెండు రోజులకు సరిపడా నెయ్యి మాత్రమే అందుబాటులో ఉందా? అనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి.

మహారాష్ట్రలోని ఇంద్రాపూర్ డైరీ నుంచి బయలుదేరిన నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటన టిటిడి ప్రధానంగా తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి కొరత ఏర్పడే పరిస్థితి కల్పించినట్లు వాతావరణం కనిపిస్తుంది.

కడప జిల్లా వద్ద బోల్తా పడిన ఇండ్రాపూర్ నెయ్యి ట్యాంకర్

తిరుమలలో లడ్డు ప్రసాదం తయారీ తోపాటు అన్నప్రసాదాలు, శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో ఆవు నెయ్యి మాత్రమే వినియోగిస్తారు. దీనికోసం రోజుకు 1,400 కిలోల నెయ్యి అవసరమని టీటీడీ వర్గాల సమాచారం. మహారాష్ట్రలోని ఇంద్రాపూర్ డైరీ నుంచి 6,100 టన్నుల నెయ్యి కాంట్రాక్టు ద్వారా టీటీడీ కొనుగోలు చేస్తోంది.
"తిరుమలలో ప్రస్తుతం రెండు రోజులకు మాత్రమే సరిపడా నెయ్యి ఉంది. ఇంద్రాపూర్ డైరీ (Indrapur Diary ) నెయ్యి ట్యాంకర్ కడప జిల్లాలో బోల్తా పడింది. దీంతో తిరుమలలో నెయ్యి సంక్షోభం ఏర్పడే అవకాశం ఏర్పడింది" అని వైసిపి ముఖ్య అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమలలో నెయ్యి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోబోతారనేది కూడా టీటీడీ (TTD ) అధికారులు స్పష్టం చేయాలని ఆయన కోరారు.
"తిరుమలలో రెండు రోజులకు సరిపడా నీ మాత్రమే ఉంది. ఇందులో సందేహం లేదు. నేను చేసిన ఈ ప్రకటనపై టీటీడీ పిఆర్వో నుంచి ఖండన ప్రకటన జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు" అని భూమన కరుణాకర్ రెడ్డి ముందస్తుగానే టిటిడి స్పందన తెలియజేశారు.
తిరుమలలో నెయ్యి కొరత లేదని టీటీడీ సోమవారం సాయంత్రం 4.40 గంటలకు ఓ ప్రకటన విడుదల చేసింది.
"శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయి" అని టిటిడి స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని అసత్య ప్రచారం చేయడం సరికాదని తెలియజేస్తున్నాం" అని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.

ఎంత నెయ్యి అవసరం

తిరుమలలో రోజుకు సగటున మూడు లక్షల లడ్డూల వరకు తయారు చేస్తారు. దీనికోసం 1,400 కిలోల నెయ్యి అవసరమవుతుంది. సంవత్సరానికి 6,100 టన్నుల నెయ్యి లడ్డూ ప్రసాదం తయారీతో పాటు అన్నప్రసాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యాల తయారీలో ఆవు నెయ్యిని వినియోగిస్తారు.
తిరుమలకు ప్రస్తుతం ఇంద్ర పూర్ డైరీ నుంచి 2025 సెప్టెంబర్ నుంచి రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఈ సంస్థ నుంచి కాంట్రాక్టు గడువు ముగిసే లోపల 65.48 కోట్ల రూపాయల విలువైన 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరిందనేది టిటిడి వర్గాల సమాచారం. ఈ సంస్థ నుంచి కిలో నెయ్యి 716.29 రూపాయలకు కొనుగోలు చేయడంపై కూడా వైసిపి అభ్యంతరం వ్యక్తం చేసింది.
"ఇందాపూర్ డైరీ నుంచి 2024 నవంబర్లో కిలో 495 రూపాయలకు కొనుగోలు చేశారు. రెండు నెలల్లోని 2025 లో రూ. 513, మే నెల నాటికి 600, ఏడాది తిరిగేలోపు రూ. 7 16.92 టిడిపి కూటమి ప్రభుత్వం పెంచింది" అని టిటిడి మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. నందిని డైరీ కూడా కోట్ చేసిన ధరకే కాంట్రాక్టు అప్పగించిన టిటిడి పాలకమండలి, ధరల తగ్గింపునకు ఎందుకు సంప్రదింపులు జరపలేదని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే..

తిరుమలలో నెయ్యి కొరత ఉందా..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. దీంతో తిరుమలలో లడ్డు ప్రసాదం తయారు చేసే పోటు సామర్థ్యాన్ని కూడా పెంచారు. ప్రస్తుతం రోజుకు సగటున 3.50 లక్షల నుంచి నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. అంటే బఫర్ స్టాక్ నాలుగు లక్షల లడ్డూలు నిలువ ఉంటాయి.
తిరుమలలో తయారుచేసే లడ్డు ( Tirumala Laddu ) ప్రసాదాలను శ్రీవారి క్షేత్రం అనే కాకుండా, దేశంలో ఉన్న టిటిడి సమాచార కేంద్రాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద కూడా అందుబాటులో ఉంచారు. అందులో ప్రధానంగా హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాలకు ప్రతి మంగళవారం కొన్ని వేల లడ్డూలను పంపిస్తుంటారు. రోజుకు కనీసం గా మూడున్నర లక్షల లడ్డూలకు పైగానే యాత్రికులు కొనుగోలు చేస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి 1950లో తొలిసారిగా (దిట్టం)వాడాల్సిన సరుకుల మోతాదును టిటిడి ఖరారు చేసింది. యాత్రికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 2001లో ఈ దిట్టం సవరించారు.

దిట్టం అంటే..

తిరుమలలో 5,100 లడ్డూల తయారీకి ఒక నిర్దిష్ట దిట్టం ఉంది. దీనికి 803 కేజీల ముడి సరుకులు వినియోగిస్తారు. అందులో 165 కేజీల ఆవు నెయ్యి, 180 కేజీల శనగపిండి, 3 కేజీల చక్కెర, 30 కేజీల జీడిపప్పు, 18 కేజీల ఎండుద్రాక్ష, 8 కేజీల కలకండ, నాలుగు కిలోల యాలకులు వినియోగిస్తారు. దీనికోసం రోజుకు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. స్థూలంగా తిరుమలలో లడ్డూల తయారీకి అనుసరించే విధానం ఇది.
తిరుమలకు ప్రస్తుతం మహారాష్ట్రలోని ఇంద్రాపూర్ డైరీ తో పాటు మరో సంస్థ నాణ్యమైన సరఫరాకు టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు సారధ్యంలోని పాలకమండలి కాంట్రాక్టు అప్పగించింది.
"శ్రీవారి అన్న ప్రసాదాలే కాకుండా లడ్డు ప్రసాదం తయారీలో కూడా నాణ్యమైన నెయ్యి వాడడానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇందులో రాజీ పడే సమస్య లేదు" అని టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు పలుసార్లు స్పష్టం చేశారు.
"మహారాష్ట్రలోని ఇంద్రాపూర్ డైరీ నుంచి బయలుదేరిన నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా వద్ద ప్రమాదానికి గురి కావడం వల్ల తిరుమలలో నెయ్యి కొరతకు ఆస్కారం ఏర్పడింది" అని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచల ఆరోపణ చేశారు. తిరుమలలో కనీసంగా రెండు రోజులకు సరిపడా నెయ్యి అందుబాటులో ఉండే విధంగా టిటిడి అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజా పరిస్థితిపై టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి పోటు (వంటశాల) అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన వారు ఫోన్ కాల్ కు అందుబాటులోకి రాలేదు.
టీటీడీ ఈఒ, అదనపు ఈఓ పక్షాన చీఫ్ పీఆర్ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇదీ..

"శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోంది. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా టిటిడి ముందస్తు చర్యలు తీసుకుంటోంది" అని స్పష్టం చేశారు.

ఇందాపూర్ డైరీ నుంచి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని టిటిడి స్పష్టం చేసింది. మిగిలిన రెండు సంస్థల నుంచి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని అందులో వివరించారు. తిరుమ్లలో సుమారు ఏడు లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల లడ్డూ ప్రసాదాల తయారీ మరియు పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని వెల్లడించింది.

"వేసవి కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశాం. లడ్డూ తయారీకి పోటు విభాగంలో యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్‌లు వంటి పరికరాల మరమ్మత్తులు సంబంధిత సంస్థల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం" అని కూడా ప్రస్తావించారు. టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందనడంలో వాస్తవం లేదని వివరించారు.

Read More
Next Story