ఏపీ మంత్రులకు సింగపూర్ శిక్షణ అవసరమా?
x
శిక్షణ కోసం సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృదం

ఏపీ మంత్రులకు సింగపూర్ శిక్షణ అవసరమా?

సింగపూర్‌లో 9 మంత్రుల ‘స్మార్ట్ గవర్నెన్స్’ శిక్షణ: రూ.95 లక్షలు ఖర్చు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో తొమ్మిది మంత్రుల బృందాన్ని సింగపూర్‌కు పంపుతోంది. ఏప్రిల్ 21 నుంచి 27 వరకు వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా డిజిటల్ గవర్నెన్స్, పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్ & పాలసీ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై మంత్రులు నైపుణ్యం సంపాదించనున్నారు. ప్రణాళికా విభాగం ఈ పర్యటన ఖర్చును భరించనుందని, మొత్తం సుమారు రూ.95 లక్షలు అయ్యే అవకాశం ఉందని సమాచారం.


ప్రాక్టికల్ శిక్షణలో మంత్రులు

వరెవరు వెళ్లారు...

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పొంగూరు నారాయణ, వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు & భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఈ తొమ్మిది మంది బృందంతో పాటు ప్రణాళికా విభాగం సీనియర్ అధికారులు కూడా వెళ్లారు. సింగపూర్ ప్రభుత్వం స్వయంగా శిక్షణ ఇస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న మంత్రులు తిరిగి వచ్చి రాష్ట్రంలోని ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులకు ‘లీడ్ ట్రైనర్లుగా’ వ్యవహరించాలి.


సింగపూర్ లో శిక్షణ తీసుకుంటున్న ఏపీ మంత్రులు

మంత్రుల విద్యార్హతలు ఏమిటి?

ఈ మంత్రుల విద్యార్హతలు వైవిధ్యంగా ఉన్నాయి. పొంగూరు నారాయణ స్టాటిస్టిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు, ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆయన విద్యావేత్తగా, నారాయణ గ్రూప్ సంస్థల స్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు. పయ్యావుల కేశవ్ టీ.ఏ. పాయ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి పీజీడీఎం (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్) చేశారు. మిగతా మంత్రులు రాజకీయ, వ్యాపార నేపథ్యం నుంచి వచ్చినవారు. గవర్నెన్స్, పాలసీలు వంటి సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ స్థాయి అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువమందికి లేదు. అందుకే ఈ శిక్షణ అవసరమని ప్రభుత్వం చెబుతోంది.

వారం రోజుల్లో ఇంత పెద్ద సబ్జెక్టులు నేర్చుకోవచ్చా?

డిజిటల్ గవర్నెన్స్, క్రైసిస్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్ పాలసీలు ఇవి నిజానికి పీహెచ్‌డీ స్థాయి, సంవత్సరాల పరిశోధన అవసరమైన అంశాలు. కానీ ఈ శిక్షణ ‘అకడమిక్ కోర్సు’ కాదు. సింగపూర్ నిపుణులు ఇచ్చే ‘ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’, కేస్ స్టడీలు, సైట్ విజిట్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ షేరింగ్. స్పీడ్, పారదర్శకత, టెక్నాలజీ ఆధారిత పరిపాలన మీద దృష్టి. ఒక వారంలో ‘పూర్తి నైపుణ్యం’ వచ్చే అవకాశం లేదు. కానీ ప్రాక్టికల్ ఐడియాలు, ఇన్‌స్పిరేషన్ రావచ్చు. మంత్రులు తిరిగి వచ్చి అధికారులకు శిక్షణ ఇవ్వాలంటే, ఇది ‘ట్రైన్ ది ట్రైనర్’ మోడల్.


సింగపూర్ పాలనా విధానాలు 5 కోట్ల జనాభా ఉన్న పెద్ద రాష్ట్రానికి ఎలా సరిపోతాయి?

సింగపూర్ ఒక సిటీ-స్టేట్. జనాభా సుమారు 60 లక్షలు, వైశాల్యం కేవలం 728 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జిల్లాతో సమానం. అక్కడ కరప్షన్ జీరో, డిజిటల్ గవర్నెన్స్ టాప్ క్లాస్, పబ్లిక్ సర్వీసెస్ సూపర్ ఎఫిషియెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ వైశాల్యం 1.6 లక్షల చదరపు కి.మీ., జనాభా 5 కోట్లకు పైగా, వైవిధ్యమైన గ్రామీణ-పట్టణ సమస్యలు, వ్యవసాయం, నీటి సంక్షోభం, ఇరిగేషన్ వంటి సవాళ్లు.

అయినా ప్రభుత్వం తన వాదన వినిపిస్తూనే ఉంది. “మోడల్ కాపీ చేయడం కాదు, బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవడం.” అంటోంది. డిజిటల్ ట్రాన్స్‌పరెన్సీ, రియల్ టైమ్ గవర్నెన్స్, క్రైసిస్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలు స్కేల్ చేయవచ్చు. ఇప్పటికే ఏపీలో రియల్ టైమ్ గవర్నెన్స్ యాప్, ఈ-గవర్నెన్స్ ప్రయత్నాలు ఉన్నాయి. సింగపూర్ నుంచి నేర్చుకుంటే వేగం పెరుగుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. గతంలోనూ సింగపూర్‌తో అమరావతి, అర్బన్ ప్లానింగ్‌పై ఎంఓయూ లు ఉన్నాయి.


ప్రజల డబ్బుతో ‘లెర్నింగ్ టూర్’ విమర్శలు ఎందుకు?

విపక్షాలు ఇప్పటికే “జంకెట్ టూర్” అంటూ విమర్శిస్తున్నాయి. రూ.95 లక్షలు (ప్రతి మంత్రికి సుమారు 10 లక్షలు) ప్రజల పన్ను డబ్బు. ఇంత ఖర్చు చేసి ఒక వారం శిక్షణ, ఫలితాలు ఏమవుతాయి? ఆంధ్రప్రదేశ్‌లోనే ఐఐఎం, ఐఐటీలు, ఎక్స్‌పర్ట్ సంస్థలు ఉన్నాయి. ఇక్కడే శిక్షణ ఇవ్వవచ్చు కదా? సింగపూర్ చిన్నది కాబట్టి దాని మోడల్ పెద్ద రాష్ట్రానికి సూటవుతుందా అన్న సందేహం సహజం.


సింగపూర్ పరిపాలన నేర్వడం అంటే సిగ్గుచేటు: ఈఏఎస్ శర్మ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.

సింగపూర్ అనేది సిటీ స్టేట్. అదొక డిఫరెంట్ వ్యవహారం. రూరల్ బ్యాగ్రవుండ్ లేదు. ఇక్కడున్న సామాజిక నేపథ్యం లేదు. అటువంటి స్టేట్ నుంచి పరిపాలన నేర్వడం అంటే సిగ్గు చేటు. అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. మంత్రుల సింగపూర్ శిక్షణపై ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేయటమే. సింగపూర్ జీరో అవినీతి ఉంది. ఒక చిన్న తప్పు చేసి అక్కడి మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు. ఆయన సీఎం చంద్రబాబుకు చాలా మంచి సన్నిహితుడు. నేర్చుకోవాల్సింది అవినీతి లేని పానల గురించి అది తెలుసుకుంటే బాగుంటుంది.

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించ పరచటమే: సీహెచ్ బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.

చంద్రబాబుకు పరిపాలనలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. ఆయన అనుభవం ముందు ఎవరైనా బలాదూర్ అని ఆ పార్టీ వారే చెబుతున్నారు. పైగా ప్రపంచానికి పాఠాలు చెప్పే అనుభవం చంద్రబాబుకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సింగపూర్ లో మంత్రులు శిక్షణ తీసుకోవడం ఏమిటి? ఇది ప్రజల డబ్బును వృధా చేయడమే అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు అన్నారు. ఆయన ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడుతూ ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న వాళ్లు సింగపూర్ లో నేర్చుకుంటామని వెళ్లటం సిగ్గుచేటన్నారు. అవినీతి మితిమీరిపోయింది. సింగపూర్ కరప్షన్ లేని సిటీ అవినీతికి దూరంగా ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అవినీతికి ఎలా దూరంగా ఉండాలో మంత్రులకు శిక్షణ ఇస్తే సరిపోతుందని అన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి వ్యవహారాలన్నీ పాలకులు చేస్తున్నారని అన్నారు.

వ్యాపారం కోసమే: జి ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.

రాష్ట్రం నుంచి తొమ్మిది మంది మంత్రులు సింగపూర్ లో పరిపాలన నేర్చుకునేందుకు వెళుతున్నట్లు చెప్పి వ్యాపారాలు చేసుకునేందుకు వెళుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య విమర్శించారు. ఆయన ది ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఇంతకు ముందు అధికారుల బృందం వెళ్లి వచ్చిందని, అలాగే కొందరు రైతుల బృందం కూడా వెళ్లి వచ్చిందని, వారు ఇక్కడి వారికి ఏమి నేర్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అందరికీ అన్నీ చెబుతుంటాడు. మంత్రులకు శిక్షణ ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. ప్రజల డబ్బును వృధా చేసే కార్యక్రమం తప్ప వేరేది కాదని అన్నారు.

Read More
Next Story