
విజయ్ ఇచ్చిన ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు
కరూర్ బాధితులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు రద్దు
కొద్ది నెలల క్రితం కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ షాక్ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం (జూలై 27) రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
2025లో కరూర్‌లో అప్పటి టీవీకే అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదే సమయంలో బాధితుల్లో 31 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా నియామక పత్రాలను అందజేశారు.
అయితే ఈ నిర్ణయాన్ని చెన్నైకు చెందిన న్యాయవాది ఎన్. ప్రభాకరన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా సవాలు చేశారు.
ఇప్పటికే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల పరిహారం, టీవీకే తరఫున మరో రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే రాజకీయ సభల్లో జరిగిన మరణాలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలనే నిబంధన 2020 ప్రభుత్వ ఉత్తర్వుల్లో లేదని వాదించారు.
ఇంకా నేర విచారణ పూర్తికాకముందే ఉద్యోగాలు ఇవ్వడం దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, సాక్షుల వాంగ్మూలాలపై కూడా ఒత్తిడి పడే పరిస్థితి ఏర్పడవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనలను పరిశీలించిన అనంతరం మదురై బెంచ్ ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేసింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల బదులుగా స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయలేమా అని ప్రశ్నించింది.
అలాగే శివకాశి బాణసంచా ప్రమాదాలు లేదా ప్రభుత్వ బస్సు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు కూడా ఇలాంటి ప్రయోజనాలు కోరే అవకాశం ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులే సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
అలాంటి పరిస్థితుల్లో కరూర్ బాధిత కుటుంబాలకు ప్రాధాన్యత ఎలా కల్పించారని ధర్మాసనం ప్రశ్నించింది. లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు వారికి ఉపయోగపడుతుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.
ఈ వ్యవహారంపై స్పందించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రియన్, రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో జరిగిన మరణాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదనే సూత్రాన్ని కోర్టు స్పష్టంగా చెప్పిందని, భవిష్యత్తులో ఇలాంటి అన్ని కేసులకు ఇదే వర్తించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ కరూర్‌ను సందర్శించి బాధిత కుటుంబాలకు స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. అయితే ఆ ఉత్తర్వులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని అప్పుడే పేర్కొన్నారు. ఇప్పుడు హైకోర్టు వాటిని రద్దు చేయడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లాలని టీవీకే నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

