
కర్నూలు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ షురూ!
కొబ్బరికాయ చంద్రబాబు కొట్టిన .. మారిన సీమ తలరాత!
రాయలసీమ అంటే ఒకప్పుడు కరువు.. కానీ అది నిన్నటి మాట. నేడు ఉద్యానవన పంటలతో పచ్చటి విప్లవాన్ని సృష్టిస్తున్న సీమ గడ్డపై.. ఇప్పుడు కనక వర్షం కురవబోతోంది!
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. బుధవారం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనుల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టెంకాయ కొట్టారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ అన్వేషణ, మైనింగ్ ప్రయత్నాల తర్వాత ఇక్కడి భూగర్భంలో దాగున్న పసిడి నిక్షేపాలు బయటకు రాబోతున్నాయి. అసలు ఈ గనుల వెనుక ఉన్న కథేంటి? దీనివల్ల రాయలసీమ తలరాత ఎలా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు.
"రాయలసీమ భూగర్భంలో అపారమైన సంపద దాగి ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సాంకేతిక నిపుణులు ఎప్పుడో గుర్తించారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో బంగారు ముడిసరుకు ఉందని నిర్ధారించిన తర్వాత.. ఆ నిల్వలను బయటకు తీయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. దీనికోసం 'జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ 2006లోనే 1,477 ఎకరాల్లో తవ్వకాల కోసం అనుమతులు సాధించింది. ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపి, ఇక్కడి బంగారం అత్యంత నాణ్యమైనదని తేల్చింది.
ఈ ప్రాజెక్ట్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జియో మైసూర్ సంస్థ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించకుండా అనేక అవాంతరాలు, బ్రేకులు ఎదురయ్యాయి. దాంతో పనులు నత్తనడకన సాగాయి. కానీ, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేశారు. చంద్రబాబు ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో, ఈ ప్రాజెక్టు మళ్లీ ఊపందుకుంది. కంపెనీ మొదట చిన్న ప్లాంట్ పెట్టినా.. ఇప్పుడు రూ. 320 కోట్ల భారీ వ్యయంతో అత్యాధునిక కర్మాగారాన్ని నిర్మించింది. ప్రస్తుతం 120 ఎకరాల్లో తవ్వకాలు జరపడానికి సర్వం సిద్ధమైంది. అలాగే ఖనిజాన్ని శుద్ధి చేసే రెండో యూనిట్‌కు కూడా సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం భూమిపూజ చేశారు.
'కోటి టన్నుల' నిక్షేపాలు!
ఈ జొన్నగిరిలో ఎంత బంగారం ఉంది? మైనింగ్ నిపుణుల లెక్కల ప్రకారం.. ఇక్కడ ఏకంగా కోటి టన్నుల వరకు బంగారు ఖనిజం (Gold Ore) ఉందనేది అంచనా! భూమి లోపల 20 మీటర్ల లోతు నుంచే ఈ నిక్షేపాలు ప్రారంభమై, ఏకంగా రెండు కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి ఈస్ట్ బ్లాక్‌లోనే దాదాపు 68 లక్షల టన్నుల ఖనిజం ఉందని తేలింది. ఇప్పటికే ఈ సంస్థ ఏడాదికి 1000 కిలోల బంగారం ఉత్పత్తికి సరిపడా రా మెటీరియల్‌ను బయటకు తీసి సిద్ధంగా ఉంచింది.
"ఇంత పెద్ద ఎత్తున ఖనిజం వెలికితీసి, శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారంగా మార్చడానికి మైనింగ్ సంస్థ వందల కోట్లు ఖర్చు చేస్తోంది. మొదట రోజుకు ఒక కిలో చొప్పున బంగారాన్ని ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత దీనిని ఏడాదికి 600 కిలోలకు, ఆపై ఏడాదికి 1500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా పారిశ్రామిక వసతులను సిద్ధం చేశారు. దీనికోసం సుమారు 800 మందికి పైగా ఉద్యోగులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
బంగారం విక్రయాలపై వచ్చే రాయల్టీ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. దీని ద్వారా ఏటా కోట్లాది రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది. అంతేకాదు, స్టేట్ జీఎస్టీ (SGST) రూపంలో కూడా భారీగా నిధులు అందుతాయి. ఇవి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందుతుంది.
భారతదేశం తన బంగారం అవసరాల కోసం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. జొన్నగిరిలో ఏడాదికి 1.5 టన్నుల బంగారం స్థానికంగానే ఉత్పత్తి అయితే.. అది దేశీయంగా బంగారం కొరతను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ పన్ను, సెంట్రల్ జీఎస్టీ (CGST) రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది.
Next Story

