SHAR | స్పేస్ వార్‌లో భారత్ బ్రహ్మాస్త్రం విక్రమ్-1!
మొదటి ప్రయివేటు రాకెట్ తో నింగిపై ఈ రోజు సంతకం చేయించనున్న 'ఇస్రో'. ఆర్టిటల్ రాకెట్ ప్రయోగాన్ని వివరించే వీడియో కథనం.
స్పేస్ ఎక్స్ కు దెబ్బ. భారత్ నుంచి కొత్త స్పేస్ బాహుబలి
అంతరిక్షంలో గుత్తాధిపత్యానికి ఎండ్ కార్డ్.. రంగంలోకి విక్రమ్-1!
ఏలన్ మస్క్ కళ్లు ఇండియాపైనే.. హైదరాబాద్ స్టార్టప్ సంచలనం!
భారత అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో ప్రయివేటు రాకెట్ తో నింగిలో తొలి సంతకం చేయించబోతోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీహరికోట వద్ద ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ తన తొలిరాకెట్ ప్రయోగానికి సర్వం సిద్దమైంది. ఈ రోజు ( 18వ తేదీ) ఉదయం 11.30 గంటలకు మిషన్ ఆగమన్ భారత అంతరిక్ష రంగంలో మైలురాయిగా నిలవబోతున్నది. మొదటి ప్రయివేటు ఆర్బిటల్ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోనునున్నది.
దశాబ్దాలుగా అంతరిక్షం అంటే కేవలం అమెరికా, రష్యా, చైనా లాంటి మహాశక్తుల గుత్తాధిపత్యం మాత్రమే అనుకున్నారంతా! ఆకాశంలోకి ఒక్క శాటిలైట్ పంపాలన్నా పాశ్చాత్య దేశాల ముందు చేతులు జోడించాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది! ఇస్రో ప్రపంచవ్యాప్తంగా తన జెండా ఎగురవేసిన తర్వాత.. ఇప్పుడు భారత ప్రైవేట్ రంగం అంతరిక్ష రేసులోకి గంభీరంగా అడుగుపెట్టనున్నది. ఎంతలా అంటే.. సాక్షాత్తు ఏలన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ సైతం నిరంతరం గమనించే విధంగా... అందుకు నిదర్శనం ....హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ప్రపంచ మార్కెట్‌ను షేక్ చేస్తోంది! అదే.. ‘విక్రమ్-1’.అని భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చరిత్ర సృష్టించిన 'షార్'
రాకెట్ ప్రయోగాల్లో సతీష్ ధావన్ స్సేస్ సెంటర్ (షార్) వంద రాకెట్ల మైలు రాయిని గత ఏడాది అధిగమించింది. ఈ నెల 18వ తేదీ శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం చరిత్రలో కీలక మైలురాయి దాటనున్నది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ణానంతో దేశీయ ప్రయివేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 దేశంలో మొదటిసారి ప్రయివేటు రంగంలోని శాటిలైట్ అంతరిక్షంలో ప్రవేశపెట్టడం ద్వారా చరిత్ర సృష్టించబోతోంది. నింగిలోకి ప్రయివేటు శాటిలైట్లు పంపడం ద్వారా ఇస్రో రాకెట్ ప్రయోగాలతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే దిశగా వేస్తున్న ముందడుగుగా భావించవచ్చు. మానవ సహిత చంద్రయాన్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం అవుతున్న తరుణంలో భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కానుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయ ప్రైవేట్ సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1' తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. ఈ తొలి ప్రయోగానికి 'మిషన్ ఆగమన్' అనే పేరు నిర్ణయించారు.
భారత్ కొత్త 'స్పేస్' బాహుబలి
హైదరాబాద్ లోని స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 ఏదో సాదాసీదా రాకెట్ కాదు. ఇది 100 శాతం భారతదేశంలోనే డిజైన్ చేసి, డెవలప్ చేసిన ఒక అత్యాధునిక ఫోర్-స్టేజ్ (నాలుగు దశల) రాకెట్! కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన ఈ రాకెట్ స్టీల్ కంటే ఎన్నో రెట్లు బలంగా, ప్లాస్టిక్ అంత తేలికగా ఉంటుంది. ఇది 300 నుంచి 350 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను భూమికి దిగువన ఉండే ‘లో ఎర్త్ ఆర్బిట్’ (LEO) లోకి సునాయాసంగా తీసుకెళ్లగలదు. ఈ రోజుల్లో ఉపగ్రహాలు బస్సులంత పెద్దగా ఉండట్లేదు.. మైక్రోచిప్స్ పుణ్యమా అని ఒక చిన్న సూట్‌కేస్ సైజుకు వచ్చేసాయి. కాబట్టి, మన విక్రమ్-1 ఒకేసారి అనేక చిన్న విదేశీ మరియు స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి పర్ఫెక్ట్ ఛాయిస్!
రాకెట్ తయారీలో అతిపెద్ద విప్లవం
ఈ రాకెట్ లోని అసలైన బ్రహ్మాస్త్రం 3D-ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్! సాధారణంగా రాకెట్ ఇంజిన్ చేయాలంటే వేల సంఖ్యలో విడిభాగాలు, నట్లు, బోల్టులు, నెలల తరబడి వెల్డింగ్ పనులు ఉంటాయి. ఒక్క మిల్లీమీటర్ తేడా వచ్చినా కోట్లాది రూపాయల రాకెట్ అంతరిక్షంలో పేలి బూడిదవుతుంది. కానీ స్కైరూట్ కంపెనీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ ఆటనే మార్చేసింది! కంప్యూటర్ డిజైన్ ఆధారంగా మెటల్ లేయర్లను అమర్చి, మొత్తం ఇంజిన్‌ను కేవలం కొన్ని రోజుల్లోనే ఒకే ఒక్క ముక్కగా ప్రింట్ చేశారు. దీనివల్ల వెల్డింగ్ తలనొప్పులు లేవు, బరువు తగ్గింది, ఖర్చు సగానికి పైగా మిగిలిపోయింది!
ఇస్రో తోడ్పాటు - మొదటి స్పేస్ యూనికార్న్
ప్రైవేట్ సంస్థే అయినా.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఒక పెద్దన్నలా స్కైరూట్‌కు పూర్తి అండగా నిలిచింది. ఇస్రో వరల్డ్ క్లాస్ లాంచ్ ప్యాడ్, సాంకేతిక సాయంతోనే విక్రమ్-1 లాంచ్‌కు సిద్ధమైంది. ఈ అద్భుతమైన టెక్నాలజీని చూసి ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఫలితంగా.. ప్రయోగానికి ముందే 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,000 కోట్లు) విలువతో భారతదేశపు మొట్టమొదటి 'స్పేస్-టెక్ యూనికార్న్' గా స్కైరూట్ రికార్డు సృష్టించింది! హైదరాబాద్‌లోని వీరి 'ఇన్ఫినిటీ క్యాంపస్' లో కార్లను తయారు చేసినట్లుగా.. ప్రతి నెలా ఒక పూర్తి రాకెట్‌ను అసెంబ్లీ లైన్ ద్వారా ఉత్పత్తి చేసే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
గ్లోబల్ మార్కెట్ టార్గెట్, భవిష్యత్ బ్రహ్మాస్త్రం
ఈ రాకెట్ స్కైరూట్ టార్గెట్ చాలా స్పష్టం. 2027 నాటికి విక్రమ్-1ని పూర్తి స్థాయి కమర్షియల్ లాంచ్ సేవలకు సిద్ధం చేయడం. విశేషం ఏంటంటే, వీరి కస్టమర్లలో 80 శాతం మంది విదేశీయులే ఉండబోతున్నారు! పాశ్చాత్య దేశాల కంటే సగానికంటే తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ సర్వీస్ ఇస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. అంతేకాదు, స్కైరూట్ ఆశయం ఇక్కడితో ఆగడం లేదు. నెక్స్ట్ లెవెల్ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీతో 'విక్రమ్-2' ని కూడా సిద్ధం చేస్తున్నారు, ఇది ఏకంగా 900 కిలోల భారీ పేలోడ్‌ను మోసుకెళ్లగలదు!
ఇస్రో అస్థిత్వానికి ప్రమాదమా?
చాలామందికి వచ్చే అనుమానం ఇదే. ప్రైవేట్ కంపెనీలు రాకెట్లు లాంచ్ చేస్తే మన ప్రభుత్వ సంస్థ అయిన 'ఇస్రో' అస్థిత్వానికి ఏమైనా ప్రమాదమా? అని. సమాధానం.. ఖచ్చితంగా లేదు! నిజానికి ఇది ఇస్రోకు ఒక బూస్టర్ డోస్ లాంటిది.
చిన్న చిన్న కమర్షియల్ శాటిలైట్లను లాంచ్ చేసే బాధ్యతను స్కైరూట్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఇస్రోకు భారీగా సమయం కలిసి వస్తుంది. దీనివల్ల ఇస్రో తన పూర్తి దృష్టిని మానవ సహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్), చంద్రయాన్ మిషన్లు మరియు సుదూర గ్రహాల పరిశోధనల లాంటి భారీ ప్రాజెక్టులపై కేంద్రీకరించవచ్చు. పైగా, స్కైరూట్ రాకెట్ ప్రయోగానికి ఇస్రో యొక్క శ్రీహరికోట (SHAR) లాంచ్ ప్యాడ్, నిపుణుల సేవలను వాడుకుంటున్నందుకు గానూ.. ప్రైవేట్ సంస్థల నుండి ఇస్రోకు భారీగా ఫీజులు, ఆదాయం లభిస్తాయి. అంటే.. ఇస్రో రాకెట్ ప్రయోగాలతో 'ఆర్థిక స్వయం సమృద్ధి' సాధించే దిశగా ఇది ఒక మైలురాయి!
రాకెట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుంది?
ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుంది? రాకెట్ లాంచ్ అయ్యేంత వరకు, అది భూ వాతావరణాన్ని దాటి కక్ష్యలో ప్రవేశించే క్లిష్టమైన దశల వరకు ఇస్రో యొక్క నెట్‌వర్క్, 'షార్' కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ సహాయం అందిస్తాయి. కానీ, ఒకసారి రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లి, శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత.. ఆ ఉపగ్రహాల పూర్తి నియంత్రణ, డేటా మేనేజ్మెంట్ అంతా ఆయా శాటిలైట్లను తయారు చేసిన క్లయింట్లు మరియు స్కైరూట్ ఏరోస్పేస్ సొంత కమాండ్ సెంటర్ పరిధిలోకి వస్తుంది. అంటే ప్రయోగ బాధ్యత ఇస్రో-ప్రైవేట్ భాగస్వామ్యంతో జరిగితే, తదుపరి నిర్వహణ ప్రైవేట్ సంస్థలదే అవుతుంది.
ఈ ప్రయోగంతో దేశీయ ప్రయోజనాలు
అసలు ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వల్ల సామాన్యులకు, దేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటి? అనేది పరిశీలిస్తే,
1)ప్రపంచ స్పేస్ మార్కెట్‌లో విదేశీ క్లయింట్లు 80% మన దేశానికే వస్తారు కాబట్టి దేశంలోకి భారీగా విదేశీ మారక ద్రవ్యం వస్తుంది.
2) దేశీయంగా వందలాది స్పేస్-టెక్ స్టార్టప్‌లు పుట్టుకొచ్చి, యువతకు హై-టెక్ ఉద్యోగాలు లభిస్తాయి.
3) తక్కువ ఖర్చుతో శాటిలైట్లు అందుబాటులోకి రావడం వల్ల దేశంలో కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయ రంగ డేటా మరింత ఖచ్చితంగా అందుతాయి.
ఒకప్పుడు స్పేస్‌ఎక్స్ రాకెట్లు వరుసగా పేలినా పట్టువదలకుండా గ్లోబల్ లీడర్ అయ్యింది. ఇప్పుడు భారత ప్రైవేట్ రంగం కూడా ఇస్రో అండతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. అంతరిక్ష ప్రయోగాల రేసులో వైఫల్యాలు అనేది సహజం. ఒక రాకెట్ ఫెయిల్ అయితే, ఇస్రో నష్టపోయింది. వేల కోట్ల రూపాయలు సముద్రం పాలైంది అని చాలా అనుకుంటారు. మరో రాకెట్ ప్రయోగం సక్సెస్ చేయడం ద్వారా అంతకు రెండింతలు ఆదాయం, దేశ భద్రతకు మన శాస్త్రవేత్తలు ముందుంటారు అని గతంలో ఇస్రో చైర్మన్ గా పనిచేసిన ఓ సీనియర్ శాస్త్రవేత్త విశ్లేషించారు. ఒకప్పుడు స్పేస్‌ఎక్స్ రాకెట్లు పేలాయి, ఇస్రో కూడా సవాళ్లు ఎదుర్కొంది. కానీ నేడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు చేతులు కలిపి భారత్ జెండాను అంతరిక్షంలో సగర్వంగా ఎగురవేస్తున్నాయి. విక్రమ్-1 సృష్టించబోతోందని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.
Next Story

