
మామల్లపురంలో జరిగిన పీఎంకే వార్షిక సమావేశం
పీఎంకేలో ముగిసిన తండ్రీకొడుకుల ఆధిపత్య పోరు..
అన్బుమణికి పూర్తి పగ్గాలు
పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే)లో దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న తండ్రీకొడుకుల ఆధిపత్య పోరుకు తెరపడింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి రామదాస్ మధ్య నెలలుగా సాగిన విభేదాలు సయోధ్యతో ముగియగా, ఇప్పుడు పార్టీపై అన్బుమణి పూర్తి ఆధిపత్యం సాధించారు.
బుధవారం (జూలై 29) చెంగల్పట్టు జిల్లా మామల్లపురంలోని ఓ ప్రైవేట్ హాలులో జరిగిన పునరేకీకరణ అనంతర తొలి సర్వసభ్య మండలి సమావేశంలో అన్బుమణి రామదాస్‌ను మరో ఏడాది పాటు పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వడివేల్ రవణన్ ప్రధాన కార్యదర్శిగా, ఎం. తిలగభామ కోశాధికారిగా కొనసాగనున్నారు.
రాజకీయాల నుంచి తప్పుకున్న రామదాస్
ఇటీవల తన 88వ పుట్టినరోజు సందర్భంగా ఎస్. రామదాస్ రాజకీయాలకు పూర్తిగా వీడ్కోలు పలికారు. ఇకపై పార్టీ వ్యవహారాలన్నింటినీ అన్బుమణి చూసుకుంటారని ప్రకటించారు. రాజకీయ అంశాలపై తనతో చర్చించవద్దని శ్రేయోభిలాషులను కోరుతూ పార్టీ భవిష్యత్తు బాధ్యతలను కుమారుడికి అప్పగించారు.
పునరేకీకరణ సమావేశంలో 3 వేల మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు జీకే మణి, మాజీ ఎమ్మెల్యే ఆర్. అరుల్ వంటి కొందరు సీనియర్లు మినహా, గతంలో రామదాస్‌కు మద్దతుగా నిలిచిన నాయకులూ ఈ సమావేశానికి హాజరయ్యారు. భావోద్వేగ సయోధ్య తర్వాత తండ్రీకొడుకులు ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి.
ఎలా మొదలైంది విభేదం?
2024 డిసెంబర్ 28న జరిగిన ప్రత్యేక సర్వసభ్య మండలి సమావేశంలో ఈ వివాదం బహిరంగమైంది. రామదాస్ తన మనవడు పి. ముకుందన్‌ను యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించగా, అన్బుమణి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విభేదాలు క్రమంగా నాయకత్వ పోరుకు దారితీశాయి.
2025 ఏప్రిల్‌లో రామదాస్ అన్బుమణిని అధ్యక్ష పదవి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మార్చి, అనంతరం ఆయనతో పాటు అనుచరులను కీలక పదవుల నుంచి తొలగించారు. అదే సమయంలో తన కుమార్తెనే పార్టీకి భవిష్యత్ వారసురాలిగా ప్రకటించారు.
దీనికి ప్రతిస్పందనగా అన్బుమణి వర్గం 2025 ఆగస్టులో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి, పార్టీ నాయకత్వం, మామిడి గుర్తుపై ఎన్నికల సంఘం గుర్తింపును పొందింది. ఇరు వర్గాలు పరస్పరం కార్యకర్తలను బహిష్కరించుకోవడం, కోర్టు కేసులు వేయడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఎన్నికల్లో అన్బుమణి వర్గానికే పైచేయి
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అన్బుమణి నేతృత్వంలోని వర్గం ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీఏతో కలిసి 18 స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. వాటిలో ధర్మపురి నుంచి ఆయన భార్య సౌమ్య రామదాస్ గెలుపొందడం విశేషం.
మరోవైపు ప్రత్యేక గుర్తుతో బరిలోకి దిగిన రామదాస్ వర్గం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఈ ఫలితాలు కూడా పార్టీలో అన్బుమణి నాయకత్వాన్ని మరింత బలపరిచాయి.
ఒక భేటీతో మారిన పరిస్థితి
2026 జూన్ 24న తిండివనం సమీపంలోని తైలపురం ఫామ్‌హౌస్‌లో జరిగిన కుటుంబ సమావేశం తండ్రీకొడుకుల మధ్య సయోధ్యకు నాంది పలికింది. తల్లిదండ్రుల 61వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్బుమణి తన తండ్రిని కలవగా, ఇద్దరూ భావోద్వేగంతో ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆ సమావేశం అనంతరం "ఇకపై అంతా మంచే జరుగుతుంది" అని అన్బుమణి వ్యాఖ్యానించారు. అనంతరం రామదాస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన సివిల్ దావాను ఉపసంహరించుకోగా, ఇరు వర్గాల విలీనం ప్రక్రియ పూర్తయింది.
పార్టీ వర్గాల ప్రకారం, రామదాస్ ఒంటరిగా పార్టీని ముందుకు నడపడం సాధ్యం కాదని భావించి, ఉత్తర తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం కుమారుడికి పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
'పీఎంకేలో శాశ్వత నాయకుడు ఉండరు'
పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన అన్బుమణి రామదాస్, పీఎంకే ప్రజాస్వామ్య విలువలను పాటించే పార్టీ అని, ఇందులో శాశ్వత నాయకుడు అనే భావన లేదని స్పష్టం చేశారు. తనను కూడా శాశ్వత నాయకుడిగా సంబోధించవద్దని కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీ జనాభా గణన చేపట్టే నిర్ణయానికి తన తండ్రి, పార్టీ చేసిన పోరాటమే కారణమని ఆయన పేర్కొన్నారు. 2031 నాటికి తమిళనాడులో పీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే నిర్మాణాత్మక సూచనలు కూడా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ పీఎంకే విస్తరణ
ఈ సందర్భంగా పార్టీ విస్తరణపై కీలక ప్రకటన చేసిన అన్బుమణి, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పట్టాలి మక్కల్ కచ్చి కార్యకలాపాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. గత మూడు నెలలుగా ఇందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి సుమారు 100 మంది ప్రముఖులు చెన్నై పనైయూర్‌లోని పార్టీ కార్యాలయాన్ని సందర్శించి చర్చలు జరిపినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి మంచి స్పందన లభిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Next Story

