టీవీకే సర్కార్ పై డీఎంకే అధినేత ఘాటైన విమర్శలు
x

టీవీకే సర్కార్ పై డీఎంకే అధినేత ఘాటైన విమర్శలు

డ్రగ్స్ రవాణా, ప్రతీకార హత్యలు జరుగుతున్న స్పందించడం లేదని ఆరోపణ


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో పెరుగుతున్న హత్యలు, నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమవుతోందని విమర్శించారు. హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్, నేరాల నియంత్రణపై మరింత దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు హత్యలను స్టాలిన్ ప్రస్తావించారు. దిండిగల్ జిల్లాలో బెయిల్‌పై విడుదలైన ఓ వ్యక్తిని, అతని భార్య ముందే హత్య చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత శివగంగ జిల్లాలో మరో హిస్టరీ షీటర్‌ను నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపిన ఘటనను ప్రస్తావించారు. బెయిల్‌పై బయటకు వస్తున్న నేరస్థులపై పోలీసుల నిఘా ఎంతవరకు ఉందనే ప్రశ్నలు ఈ ఘటనలతో తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

పెరుందురై సమీపంలో ఓ నర్సును కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన అనంతరం హత్య చేసిన ఘటనపైనా స్టాలిన్ స్పందించారు. ఐదు రోజుల తర్వాత ఆమె మృతదేహం లభించడాన్ని ప్రస్తావిస్తూ, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా అంశంలోనూ అధికార టీవీకే పార్టీ నేతలపై ఆయన విమర్శలు చేశారు. వేదారణ్యంలో గంజాయి అక్రమ రవాణా కేసులో టీవీకేకు చెందిన ఓ యూనియన్ కార్యదర్శి అరెస్టయ్యారని, అదే జిల్లాలో మరో టీవీకే నాయకుడు మెత్ బూపాలన్ కూడా అరెస్టైనట్లు పేర్కొన్నారు. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని కొందరు డ్రగ్స్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నారనే ఆరోపణలు చేశారు.

మరోవైపు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, క్రీడలపై దృష్టి పెట్టాలని విజయ్ ఇటీవల పిలుపునిచ్చిన విషయాన్ని స్టాలిన్ గుర్తుచేశారు. అయితే, ఇలాంటి సందేశాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పెరుగుతున్న నేరాలను నియంత్రించి, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.


Read More
Next Story