హస్తకళలకు డిజిటల్ ఊపిరి: తరంగా-కళాక్షి
x

హస్తకళలకు డిజిటల్ ఊపిరి: తరంగా-కళాక్షి

హస్తకళలను వినియోగ దారులకు చేరువ చేసేందుకు డిజిటల్ రంగాన్ని ప్రభుత్వం ఎంచుకుంది.


హస్త కళారూపాలు కేవలం వస్తువులు కాదు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం. కానీ మార్కెటింగ్ లోపం, సరైన ప్రాచుర్యం లేక హస్త కళాకారుల జీవనం దుర్భరంగా మారింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వినూత్న చొరవ చేపట్టింది. హస్తకళల అమ్మకాలు పెంచి, కళాకారులకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పం.


ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్‌డీసీ) ఆధ్వర్యంలో ‘తరంగా’ అనే ఏఐ ఆధారిత రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 లేపాక్షి షోరూమ్‌లను రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించడం, స్టాక్ వివరాలు, రోజువారీ అమ్మకాలు, సిబ్బంది పనితీరు తదితరాలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడం దీని ముఖ్య లక్ష్యం. స్టాక్ తగ్గినప్పుడు ఎరుపు-ఆరెంజ్ అలర్ట్‌లు వెలువడి, సప్లైను సమర్థవంతంగా చేస్తాయి.

ఇక ‘కళాక్షి’ వాట్సాప్ లింక్ ద్వారా ఏఐ టూల్ సాయంతో కళారూపాల వివరాలు, సాంస్కృతిక నేపథ్యం, కళాకారుల సమాచారం క్షణాల్లో అందుతాయి. వినియోగదారులు ఇంటి నుంచే ఆర్డర్ చేసి డోర్ డెలివరీ పొందవచ్చు. చేనేత వస్త్రాల మాదిరిగా హస్తకళలను సులభంగా ప్రజల చేతికందించడం ఇందులోని ప్రత్యేకత.


చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ ‘‘హస్తకళాకారులకు స్థిరమైన ఉపాధి, గౌరవప్రద జీవనం అందించడమే మా లక్ష్యం. తరంగా-కళాక్షి ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో ముడిపెడతాం’’ అన్నారు.

ఈ చొరవతో హస్తకళలు కేవలం షోరూమ్‌లలోనే కాక, ప్రతి ఇంటి అలంకరణగా మారాలని ప్రభుత్వం భావిస్తోంది. కళాకారుల చేతుల్లోని మాయ చెరగకుండా భవిష్యత్తు తరాలకు అందించడమే ఈ డిజిటల్ ప్రయాణం లక్ష్యం.

Read More
Next Story