తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద యాత్రికుల సందోహం (ఫైల్)
TTD | శ్రీహరీ నీ కొలువులో 15 ఏళ్లుగా ఓ నోటిఫికేషన్ లేదే..
2030 నాటికి టీటీడీ ఖాళీ? 6,788 పోస్టులు ఖాళీ. పనిభారంతో సిబ్బందికి ఆరోగ్య సమస్యలు
టీటీడీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందే కీలకంగా మారారు. శాశ్వత ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 15 ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఉన్న ఉద్యోగులపై పనిభారం, ఒత్తడి వల్ల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
టీటీడీలో ఖాళీల భర్తీకి 2014 నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు.
దీనివల్ల 1996 నాటికి 16 వేల మంది ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం సుమారు 6,700కు పడిపోయింది.
2009 నుంచి ఉద్యోగుల పదవీ విరమణ వల్ల సంఖ్య తగ్గడం వల్ల ఆ స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఈ ప్రభావం వల్ల 2030 నాటికి ప్రస్తుతం ఉన్న శాశ్వత ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.
టీటీడీలోని కీలక విభాగాల్లో అధికారులు, సిబ్బంది కొరత పనిభారం పెరగడానికి, మానసిక ఒత్తిడి పెంచింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాదిలో కేవలం నాలుగు నెలల్లోనే 32 మంది వివిధ ఆరోగ్య కారణాల వల్ల మరణించారు.
6,788 పోస్టుల ఖాళీ
టీటీడీ అధికారిక సమాచారం ప్రకారం 11,891 మంజూరైన పోస్టుల్లో 5,103 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తుంటే, 6,788 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేయడానికి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు అధికారులతో సమాలోచనలు సాగిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల దశాబ్దాలుగా నిలిచిన నియామక ప్రక్రియ తర్వాత ఇంజినీరింగ్, ఆలయ పాలన, పోటు (వంటశాల), రిసెప్షన్ విభాగాల్లో వేల సంఖ్యలోని ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారనేది తేల్చడం లేదు.
6,788 ఉద్యోగ ఖాళీల్లో 6,054 పోస్టులు ప్రత్యక్ష్యంగా, 650 పోస్టులు ఉద్యోగుల పదోన్నతులతో, మరో 40 పోస్టులు బదిలీల ప్రక్రియతో భర్తీ చేయడానికి ఆస్కారం ఉందనేది టీటీడీ వర్గాల అధికారిక సమాచారం.
టీటీడీలో 1987 నుంచి నిలిచిన నియామకాల కారణంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్య 15వేలకు చేరింది. దశాబ్ద కాలం కిందట టీటీడీ శాశ్వత ఉద్యోగులే ఆ స్థాయిలో ఉన్నారు. ఖాళీల భర్తిని వైసీపీ ప్రభుత్వంలో కూడా గాలికి వదిలేసి, అప్పటి ఈఓ ఏవీ. ధర్మారెడ్డి కాలంలో అమలులోకి తెచ్చిన శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్నొరేషన్ పరిధిలో పది వేల మందిని నియమించారు. ఈ వ్యవస్థే ఇప్పుడు టీటీడీలో కీలకంగా మారింది. వారిపై సూపర్ వైజింగ్ అనేది టీటీడీ శాశ్వత ఉద్యోగులకు ఉన్నా, పని ఒత్తిడి వల్ల వారికి భారం పెరిగింది.
టీటీడీలో ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, రవాణా, ఆరోగ్య విభాగం, ప్రింటింగ్, ఉద్యానవన విభాగాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది.
కీలక విభాగాల్లో ఖాళీలు ఇవీ..?
టీటీడీలో జనరల్ పరిపాలన వ్యవహారాలు చూసే సిబ్బంది దాదాపు 1,400 మంది సిబ్బంది కొరత ప్రధాన కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తోంది. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, రవాణా విభాగంలో 250 డ్రయివర్ పోస్టులు, ఆరోగ్య శాఖలో 220 పోస్టులు, ఆయుర్వేద కాలేజీలో 20 పోస్టులకు గాను 17 ఖాళీలు, ప్రజారోగ్యంవిభాగంలో 45 మంది సూపర్ వైజర్లు, మేస్త్రీ పోస్టుల తోపాటు ప్రచురణలు, ఉద్యానవనాలశాఖలో 680 పోస్టులు, ప్రాచీన ఆలయ నిర్మాణాలను పరిరక్షించి, పునరుద్దరించడానికి 16 మంది స్థపతులు, శిల్పుల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. టీటీడీ నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో కూడా దాదాపు వందకు పైగానే ఖాళీలు ఉన్నాయి.
"తిరుమలలో వాతావరణ మార్పుల కారణంగానే ఉద్యోగులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు" అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నేత కందారపు మురళీ అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయడమే కాదు. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాల్సిన అవసరాన్ని కూడా కందారపు మురళీ గుర్తు చేశారు.
రికార్డు స్థాయిలో రిటైర్ మెంట్లు..
టీటీడీ చరిత్రలో మొదటిసారి ఈ ఏడాది జూన్ నెలలో 120 మంది రికార్డుస్థాయిలో ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. జూలైలో 37 మంది ఉద్యోగ విరమణ చేశారు. వారిలో 11 మంది తిరుమల తోపాటు అనుబంధ ఆలయాల్లో శ్రీవారికి అందించే బంగారు నగల నిర్ధారణ, విలువను నిర్ధారించే అప్రైజర్లు కూడా ఉన్నారు. రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసే పరిస్థితి లేని కారనంగా వారందరినీ మళ్లీ తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తిరుమలలో దాదాపు ఏడు వేల అతిథి గృహాల సముదాయాలు, కాటేజీలు ఉన్నాయి. తిరుమలకు సరాసరిన రోజుకు 80 వేల మందికి పైగానే యాత్రికులు వస్తుంటారు. వారికి సకాలంలో గదుల కేటాయింపు నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది.
"కేవల ఒక రిసెప్షన్ విభాగంలో ఒక ఉద్యోగి 70 నుంచి 80 గదుల పర్యవేక్షణ చేయడం సాధ్యమా?" అనేది సీఐటీయూ నేత కందారపు మురళీ ప్రశ్న.
రూ. 5,400 కోట్ల వార్షిక బడ్జెట్
టీటీడీ పరిపాలన భవనం తిరుపతిలో ఉంటుంది. 5,400 వార్షిక బడ్జెట్ తో ఇక్కడ చిన్న రాష్ట్రానికి సరిపడ శాఖలన్నీ నిర్వహిస్తుంటారు. తిరుమలలో కూడా సమాంతర శాఖలు కీలకం. రోజుకు లక్షకు పైగానే వచ్చే యాత్రికులకు సేవలు అందించడంలో రిసెప్షన్ విభాగం, అన్నదానం, ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా సేవలు అందిస్తుంటారు. రద్దీ పెరిగితే శ్రీవారి దర్శనం 24 నుంచి 48 గంటల వరకు పడుతుంది. శ్రీవారి ఆలయం సమీపం నుంచి శిలాతోరణం వరకు అంటే దాదాపు పది కిలోమీటర్ల వరకు విస్తరించే క్యూలోని యాత్రికులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, కాఫీ, పాలు, మంచినీరు అందించడంలో 3,500 మంది శ్రీవారి సేవకులతో పాటు టీటీడీ సిబ్బంది సేవలు అందించడం, వారిని పర్యవేక్షించే అధికారులపై భారం, ఒత్తిడి పెరుగుతోంది.
గత రెండు సంవత్సరాలు 2023-24, 2024-25లో తిరుమలలో సగటున రోజుకు 70 వేల మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకునే వారు. 2025-26లో ఆ సంఖ్య సగటు రేటు73 వేలు దాటింది. వారాంతంలో 90 వేల మందికి దర్శనం కల్పించి, టీటీడీ అధికారులు రికార్డులు నమోదు కావడానికి చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్టే ఐదు శాతం యాత్రికుల వృద్ధి రేటు నమోదైనట్లు లెక్క. పక్క ప్రణాళిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రద్దీ అంచనా వేయడం, క్యూల నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందనేది టీటీడీ పాలక మండలి, అధికారులు చెప్పే మాట.
15 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేదు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ ఈఓగా (2009 జూన్ 18 నుంచి 2011 జూన్ (ఆగస్టు) ఉన్న సమయంలో మాత్రమే 690 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆ తరువాత ఖాళీలు భర్తీ చేయడంలో టీటీడీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాంట్రాక్టు సిబ్బంది పెరిగిపోయారు. వారిపై పర్యవేక్షణ టీటీడీ ఉద్యోగులపై మాత్రమే ఉంటుంది. ఆ సంఖ్య కూడా తగ్గింది.
వైసీపీ ప్రభుత్వంలో నవంబర్ 2023లో ఆగిపోయిన నోటిఫికేషన్ పునరుద్ధరించి ఇంజినీరింగ్ విబాగంలో 56 సివిల్ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి టీడీపీ కూటమి ప్రభుత్వం పరీక్ష నిర్వహించి, దాదాపు నాలుగు నెలలు కావస్తున్న, నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఖాళీలు భర్తీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పైసా కూడా భారం పడదు. అంతా టీటీడీనే భరిస్తుంది. కానీ, ఖాళీల భర్తీకి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మొత్తం వ్యవస్థ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారితోనే నడిపిస్తారా? అనేది ప్రశ్న తెరపైకి వచ్చింది. టీటీడీ పరిపాలన, ఆలయ వ్యవహారాలు, యాత్రికుల సేవ కోసం యుద్ధ ప్రాతిపదికన కనీసం రెండు వేల పోస్టులు భర్తీ చేయకుంటే సేవలు కష్టం అనే మాట వినిపిస్తోంది.
సిబ్బందికి స్వాంతన
టీటీడీ శాశ్వత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శనం, ప్రతి నెలా పది లడ్డూ ప్రసాదాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది.
ఈ ఏడాది మార్చి ఏడో తేదీ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ బీఆర్. నాయుడు ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా గుర్తింపుకార్డుల తోపాటు లడ్డూ కార్డులు జారీ చేయాలని తీర్మానించి, ఊరడించారు.
పని ఒత్తిడితో సతమతం అవుతున్న ఉద్యోగులను కూడా చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి శాంతింప చేసింది.
"టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీంలో మూడు లక్షలు ఉన్న పరిమితిని, అదనంగా మరో రెండు లక్షలకు పెంచాం. దీంతో మొత్తంగా ఐదు లక్షలు రీయింబర్స్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం" అని చైర్మన్ నాయుడు ఉద్యోగులను కూడా తీపి కబురు చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీంలో భాగంగా ప్రస్తుతమున్న రూ.3 లక్షలకు అదనంగా మరో రూ.2 లక్షలను రీయింబర్స్‌మెంట్ చేసేందుకు ఆమోదం తెలిపారు.
విద్యా శాఖలో కొరత
టీటీడీ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో దశాబ్దాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే వారి సర్వీసులు క్రమబద్ధీకరిస్తాం. అని చెప్పడం, ఊరడింపులకే పరిమితం అవుతున్నారు.
టీటీడీలో పనులు ఆగకుండా సాగడానికి తాత్కాలిక సిబ్బందిని మాత్రమే నియమించుకోవడంలో కొందరు అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వం నుంచి డిప్యూటేషన్ పై వచ్చే డిప్యూటీ ఈఓల్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏఈఓ క్యాడర్ లో కూడా 65 పోస్టులకు 45 మంది మాత్రమే సిబ్బందిని అజమాయిషీ చేయించే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారనేది టీటీడీ వర్గాల సమాచారం.
టీటీడీ ధార్మిక సంస్థ అయినా, వైద్యం, విద్యా సంస్థల నిర్వహణలో కీలకంగా ఉంటుంది. ఈ శాఖకు రెగ్యులర్ డీఈఓ స్థానంలో అటవీశాఖ అధికారి పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే చార్టెడ్ అకౌంటెంట్లు, ఐటీ, క్యాటరింగ్ వంటి విభాగాల్లో కూడా వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ సీట్లలో ఔట్ సోర్సింగ్ సిబ్బందే సేవలు అందిస్తున్నారు.
2030 నాటికి టీటీడీ ఖాళీ..
ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయిలో మొదటిసారి 120 మంది, జూలైలో 37 మంది ఉద్యోగులు విరమణ చేశారు. ఆ పనిభారం కూడా ప్రస్తుత ఉద్యోగులపైనే పడింది. ఆ ఖాళీల భర్తీకి మాత్రం టీటీడీ చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో మాత్రమే సిబ్బందిని నియమిస్తున్నారు. దీనివల్ల శాశ్వత టీటీడీ ఉద్యోగులు, అధికారులపై పనిభారం పెరిగింది.
టీటీడీలో కీలకమైన బంగారు నగల విలువ నిర్ధారణ చేసే అప్రైజర్లు ఒకేసారి 11 మంది ఉద్యోగ విరమణ చేశారు. టీటీడీ ఆధీనంలోని 63 ఆలయాల్లో బంగారు, వెండి, ఆభరనాల తనిఖీ, విలువ నిర్ధారణ, భద్రతా వ్యవహారాలు గాడిలో ఉంచడానికి, అనుభవజ్ణులైన సిబ్బంది కొరత లేకుండా చేయడానికి వారందరినీ తాత్కాలికంగా కొనసాగించడానికి టీటీడీ మెు చూపింది. మినహా రిక్రూట్ మెంట్ కు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదిలాఉంటే.
తాత్కాలిక ఉపశమనం
టీటీడీలో ప్రధానంగా యాత్రికులతో అనుసంధానమైన విభాగాల్లో శాశ్వత ఉద్యోగులు తగ్గిపోయారు. ధార్మిక కార్యక్రమాలతో పాటు టీటీడీ పేద విద్యార్థులు, రోగుల కోసం విద్య, ఆరోగ్య శాఖలను కూడా నిర్వహిస్తోంది. అందులో వాక్ ఇన్ ఇంటర్వ్యూ పేరిట తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
టీటీడీ పాలకమండలి ఎస్వీ గోసంరక్షణ శాల (గోశాల) లో భర్తీకి ఆమోదం పొందిన 12 పోస్టుల వివరాలు ఉన్నాయి. అందులో
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, రెండు, గోశాల మేనేజర్ పోస్టులు రెండు, డైరీ సూపర్ వైజర్ ఆరు పోస్టులు డైరీ అసిస్టెంట్ రెండు పోస్టులతో పాటు స్విమ్స్ (SVIMS) ఆస్పత్రిలో 236 మంది స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 20, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో 48 పోస్టులు భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల భర్తీ చేయడంలో రాజకీయ విమర్శలు పెరిగాయి.
Next Story


