
డీఎంకేకు డెడ్‌లైన్ మొదలైంది : మోదీ వార్నింగ్
అవినీతి, కుటుంబ పాలన, మోసపూరిత హామీలతో అధికార పగ్గాలు చేపట్టిన డీఎంకేకు చరమగీతం పాడాలని తమిళనాడు ప్రజలను కోరిన ప్రధాని..
తమిళనాడు( Tamil Nadu)లో డీఎంకే(DMK) పాలన అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. శుక్రవారం మధురాంతకంలో జరిగిన ఎన్డీఏ(NDA) ర్యాలీలో ఆయన ప్రసంగించారు. డీఎంకే పాలన నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని, ఏఐఏడీఎంకే సహా మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.
“తమిళనాడు ప్రజానీకం మార్పు కోరుకుంటుంది. డీఎంకే పాలనతో విసిగెత్తింది. ఉపశమనాన్ని కోరుకుంటున్నారు. బీజేపీ(BJP)–ఎన్డీఏ(NDA) పాలన కోసం ఎదురుచూస్తున్నారు” అని ప్రధాని అన్నారు. డీఎంకే వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినా.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిందని మోదీ విమర్శించారు.
“మీరు డీఎంకేకు రెండుసార్లు పూర్తి మెజారిటీ ఇచ్చారు. కానీ వారు హామీలను అమలు చేయలేదు. ప్రజలను మోసం చేశారు. అందుకే నేడు డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు ‘సీఎంసీ ప్రభుత్వం’గా పిలుస్తున్నారు. సీఎంసీ అంటే అవినీతి, మాఫియా, నేరాలకు నిలయమైన ప్రభుత్వం. తమిళనాడు ప్రజలు ఇప్పుడు డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ బీజేపీ–ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం” అని మోదీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని గుర్తు చేసుకున్న ప్రధాని.. దేశం ఈ రోజును పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటోందని తెలిపారు. తమిళనాడుకు చెందిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీతో కలిసి పోరాడారని పేర్కొన్నారు.
“తమిళనాడులోని ప్రతి వ్యక్తి హృదయంలో శౌర్యం, దేశభక్తి నిండివున్నాయి. ఈ పవిత్ర భూమి నుంచి నేతాజీకి నా నివాళులు అర్పిస్తున్నాను” అని మోదీ అన్నారు. 2026లో ఇది తన తొలి తమిళనాడు పర్యటన అని, పొంగల్ పండుగ అనంతరం రాష్ట్రం పండుగ వాతావరణంలో ఉందని చెప్పారు. ఇటీవల భారతరత్న ఎం.జి. రామచంద్రన్ జయంతి కూడా జరిగినట్లు గుర్తుచేశారు.
డీఎంకేపై వంశపారంపర్య రాజకీయాల ఆరోపణలు చేస్తూ.. ఆ పార్టీ ఒకే కుటుంబానికి సేవ చేయడంలోనే నిమగ్నమై ఉందని ప్రధాని విమర్శించారు. “తమిళనాడులో ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం పట్ల గౌరవం లేని ప్రభుత్వం ఉంది. డీఎంకే ప్రభుత్వం ఒక కుటుంబానికి దాసోహం అవుతోంది” అని అన్నారు.
డీఎంకేలో ఎదగాలంటే బంధుప్రీతి, అవినీతి, మహిళలపై హింస లేదా భారత సంస్కృతిని అవమానించే మార్గాలే ఉన్నాయని మోదీ ఆరోపించారు. “అందుకే అలాంటి పనుల్లో నిమగ్నమైన వారే అక్కడ ఎదుగుతున్నారు. ఇది మొత్తం రాష్ట్రానికే నష్టం కలిగిస్తోంది. అవినీతి ఎక్కడ జరుగుతుందో, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో తమిళనాడులోని ప్రతి బిడ్డకూ తెలుసు” అని స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రధాని తీవ్రంగా విమర్శించారు.

