తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మత్సవాలు నిర్వహించనున్నారు. అధిగమాసం కావడం వల్ల ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 15వ తేదీ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే పెద్దశేష వాహనసేవలో ఆయన పాల్గొంటారు" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం తిరుమల అన్నమయ్య భవన్ లో నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా
"తిరుమలకు వచ్చే భక్తులకు తొలిసారిగా లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించాం
" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు.టీటీడీ బోర్డు మీట్ తరువాత ఈఓ ముద్దాడి రవిచంద్రతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన తీర్మానాలను వెల్లడించారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు డాక్టర్ ఏ.శరత్, ప్రభల గోపినాథ్, సివిఎస్వో కేవి.మురళీకృష్ణ కూడా పాల్గొన్నారు. "తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నాం. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి" అని చైర్మన్ నాయుడు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
తిరుమలలో సెప్టెంబర్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్ఓ మురళీ కృష్ణ చెప్పారు. అదే రోజు రాత్రి 9 గంటలకు స్వామివారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు ఉచితంగా ప్రయాణించేందుకు అవసరమైన మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈ నెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించనున్నారు. 2027 సంవత్సరం టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.
విదేశీ కళాకారుల నీరాజనం
బ్రహ్మోత్సవాల్లో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి కళాకారులు వాహనసేవల ముందు కళార్చన చేయనున్నారు. వారితో పాటు టీటీడీ చరిత్రలో మొదటిసారి సింగపూర్, జర్మనీ దేశాల నుంచి కళాకారులు కూడా పాల్గొంటారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.
బోర్డు మీట్ లో వెల్లడించిన ప్రధానాంశాలు
1) బ్రహ్మోత్సవాల వేళ యాత్రికులకు ఇబ్బంది లేకుండా, రోజూ 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నారు.
2 )భక్తుల భద్రతకు 3,000 మంది పోలీసులతో పాటు 2,500 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం.
భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీటీడీ, పోలీస్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన, సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది.3 ) తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు 3,000 నుంచి 3,300 మంది సిబ్బందిని నియమిస్తున్నాం.
4 ) ఈ ఏడాది గరుడసేవకు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం మంది భక్తులు అదనంగా వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
5 ) గరుడసేవ రోజున గతేడాది 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది గతేడాదితో పోలిస్తే 52 శాతం అదనం.
"లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం" అని టీటీడీ చైర్మన్ నాయుడు వివరించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన దర్శనం, సురక్షితమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించడమే టీటీడీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది.
ఉద్యోగులకు రక్ష
భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
"శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో లైప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిపాలనలో టీటీడీ ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా మరణించిన భక్తుని కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు"
పదవీ విరమణ పొందిన CPS/NPS పెన్షనర్లు, వారి కుటుంబాలకు OPS/పెన్షనర్లు తరహాలో EHF సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం
తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభాగాలుగా విభజించి వాటర్ హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ తయారు చేసి టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేసేందుకు IOCL సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం బయోగ్యాస్ ప్లాంట్ నిర్వహణను రూ.2.80 కోట్లతో M/s GPS Renewablesకు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు.
పోటులో సిబ్బంది పెంపుదల
శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్సోర్సింగ్ వర్కర్ల పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు వెల్లడించారు. ఇంకా ఏమి చెప్పారంటే..
"టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందికి తిరుమలకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు నిర్ణయించాం. ఇందుకోసం 3 సంవత్సరాలకు రూ.1.60 కోట్లు మంజూరు చేశాం
" అని నాయుడు వివరించారు. బంగారు తాపడం పనులు
తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటు చేసేందుకు ఆమోదం.
చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేసేందుకు రూ.17.05 కోట్లకు ఆమోదం.
తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్సు గడువును మరో మూడేళ్లపాటు, అంటే 02-11-2026 నుంచి 01-11-2029 వరకు పొడిగించేందుకు ఆమోదిస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకుంది.