మళ్లీ ముదిరిన కావేరీ జలాల వివాదం
x
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్

మళ్లీ ముదిరిన కావేరీ జలాల వివాదం

కర్ణాటకలో నిరసనలు, విజయ్ బెంగళూరు పర్యటనపై అనిశ్చితి


తమిళనాడు–కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 4.5 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కావేరీ జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశించడంతో కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాడు సీఎం విజయ్ బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవడం మంచిదని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచించారు.

ప్రస్తుతం కర్ణాటక కూడా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో తమిళనాడు సీఎంతో సమావేశం నిర్వహించడం సమంజసం కాదని కన్నడ అనుకూల సంఘాలు అభిప్రాయపడ్డాయి. కావేరీ జలాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13న రాష్ట్రవ్యాప్త బంద్‌కు కూడా పిలుపునిచ్చాయి.

విజయ్ పర్యటనపై శివకుమార్ ఆందోళన

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్‌ను కర్ణాటకకు ఆహ్వానించడం సరైన నిర్ణయం కాదన్నారు. స్నేహపూర్వక చర్చల కోసమే ఆయన రావడానికి అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నిరసనకారులు ఆయనను అడ్డుకునే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే ఆగస్టు 3న విజయ్ బెంగళూరు వస్తే విమానాశ్రయం వద్ద నిరసనలు చేపడతామని కన్నడ అనుకూల సంస్థలు హెచ్చరించాయి.

కేఆర్ఎస్ జలాశయం వద్ద బీజేపీ, రైతుల ఆందోళన

వర్షాభావం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు దెబ్బతిన్నాయని పేర్కొంటూ, తమిళనాడుకు నీటి విడుదలను వ్యతిరేకిస్తూ బీజేపీ, రైతు సంఘాలు కృష్ణరాజసాగర (కేఆర్ఎస్) జలాశయం వద్ద భారీ నిరసన నిర్వహించాయి.

మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. జలాశయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్తగా కర్ణాటక రాష్ట్ర రిజర్వ్ పోలీసులు, జిల్లా సాయుధ దళాలను మోహరించి, జలాశయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఆగస్టు 13న కర్ణాటక బంద్

కన్నడ అనుకూల సంస్థల సమావేశంలో కావేరీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, ఆగస్టు 13న రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని వటల్ నాగరాజ్ ప్రకటించారు. సమావేశానికి కర్ణాటక రక్షణ వేదికకు చెందిన నారాయణ గౌడ, ప్రవీణ్ శెట్టి వర్గాలతో పాటు శివరామే గౌడ, సారా గోవిందు తదితరులు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తమిళనాడుకు నీరు విడుదలవుతోందని ఆరోపించిన నాయకులు, విజయ్ ఆగస్టు 3న బెంగళూరు వస్తే విమానాశ్రయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బంద్ కారణంగా రవాణా, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఆదివారం అఖిలపక్ష సమావేశం

సీడబ్ల్యూఎంఏ ఆదేశాలపై తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, జలవనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై చర్చించేందుకు ఆదివారం (ఆగస్టు 2) అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం వెల్లడించారు.

'జన నాయగన్' ప్రదర్శనలపై ప్రభావం

కావేరీ జల వివాదం ప్రభావం సినీ రంగంపైనా పడింది. ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటకలోని పలు థియేటర్లు తమిళనాడు సీఎం విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా ప్రదర్శనలను నిలిపివేశాయి. జూలై 23న రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పోస్టర్లను కొన్ని చోట్ల తొలగించారు. బెంగళూరులోని ఊర్వశి థియేటర్‌లో పోలీసుల సూచన మేరకు పోస్టర్లు, కటౌట్‌లను తొలగించి, ప్రదర్శనలను రద్దు చేశారు. ఆ స్థానంలో కన్నడ చిత్రం 'కారవాలి'ని ప్రదర్శించారు

Read More
Next Story