ఇవన్నీ శేష ప్రశ్నలనా? అంటే... కాదు.. కాదు వాస్తవమే అని టీటీడీ చెబుతోంది. అందుకు నిదర్శనం ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూల తయారీ చేస్తున్నాం. నాణ్యమైన లడ్డూల తయారీలో పోటు విభాగం కీలకం అని టీటీడీ వెల్లడించింది. ఇది వాస్తవమేనా? ఒకసారి పరిశీలిద్దాం... నాణ్యత పెంచడానికి టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ ఏమిటనేది పరిశీలిస్తే మాత్రం. ఇది వాస్తవం అనే విషయం స్పష్టం అవుతోంది. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి. మూడు సంవత్సరాలతో పోలిస్తే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలు విక్రయించాం. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయనేది టీటీడీ ప్రకటన.
లడ్డూ తయారీకి అమలు చేస్తున్న కఠిన విధానాలు ఏమిటి? నాణ్యత పెంచడానికి తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? పెరుగుతున్న యాత్రికులు. లడ్డూ ప్రసాదాల తయారీ, విక్రయాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? లడ్డూల ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచిన టీటీడీ ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందించడానికి చేసిన కసరత్తు ఏమిటి?
రోజుకు 4 లక్షల లడ్డూల తయారీ
శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ, రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా, ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతోంది.
68 టన్నుల ముడి పదార్థాలు
ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుంచి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శెనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయి.
జీఐ గుర్తింపు
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూకు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపును మంజూరు చేసింది. అదేవిధంగా లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలోపేతమైంది. ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోటులో రెండు అత్యాధునిక ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తున్నారు. పోటు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకులను కొనుగోలు విభాగం సేకరించి, ప్రయోగశాల పరీక్షలు నిర్వహించిన అనంతరమే వినియోగానికి అనుమతిస్తోంది.
లడ్డూ తయారీలో దిట్టం..
శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ "దిట్టం" ప్రమాణాలను నేటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్నప్రసాదాలు, 25 రకాల పణ్యారాలను సిద్ధం చేస్తున్నారు.
శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలూ సేవలందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు.
భారీ మౌలిక సదుపాయాలు
ప్రత్యేక కౌంటర్లు.. కియోస్క్ యంత్రాలు..
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు లడ్డూ ప్రసాదాలు అందించడంలో ఎప్పటికప్పుడు మార్పులతో సౌకర్యవంతమైన వసతులు కల్పిస్తోంది. అందులో భాగంగా శ్రీవారి ఆలయానికి సమీపంలోనే లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేసింది. తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌లో 56 కౌంటర్ల ద్వారా మూడు షిఫ్టుల్లో 24 గంటలూ లడ్డూల విక్రయం, పంపిణీ జరుగుతోంది.
అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పొందిన ప్రతి భక్తునికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఎలాంటి కొరత రాకుండా 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుతున్నారు.