ఏపీ ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతల స్వీకరణ
x
ఏపీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునేఠా

ఏపీ ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా పునేఠా ఐదు సంవత్సరాల కాలానికి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరిగిన సాదా కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ మల్లికార్జున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్ చంద్ర పునేఠా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, గ్రామీణాభివృద్ధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేశారు. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్‌గా తన ఐఏఎస్ కెరీర్‌ను ప్రారంభించిన పునేఠా, రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా పని చేశారు. ఆ తర్వాత భూమి పరిపాలన కమిషనర్ (సీసీఎల్‌ఎ), ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవులు చేపట్టారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.


రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్తుల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. అనుభవజ్ఞుడైన అధికారి అయిన పునేఠా ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించనున్నారని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read More
Next Story