
కర్ణాటకలో సమావేశం కానున్న అఖిలపక్షం
సీఎం డీకే నేతృత్వంలో సమావేశం కానున్న అన్ని పార్టీల అధినాయకులు, కావేరీ నదీ జలాల వివాదమే కారణం
తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) ఆదేశించడంతో రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కావేరీ జలాల అంశంపై రాష్ట్రం అనుసరించాల్సిన చట్టపరమైన, రాజకీయ వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు, కావేరీ పరీవాహక ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, సీనియర్ రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. జూలై 30న సీడబ్ల్యూఆర్‌సీ ఇచ్చిన ఆదేశాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదంటూ బీజేపీ, రైతు సంఘాలు, కన్నడ అనుకూల సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆగస్టు 3న తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్ జోసెఫ్‌తో జరగాల్సిన సమావేశాన్ని డీకే శివకుమార్ వాయిదా వేశారు. పరిస్థితులు మరింత అనుకూలంగా, స్నేహపూర్వకంగా మారిన తర్వాతే చర్చలు జరపడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వివాదంలో రాష్ట్రం తరఫున ఐక్యమైన వైఖరిని రూపొందించడంలో అఖిలపక్ష సమావేశం కీలక పాత్ర పోషిస్తుందని శివకుమార్ తెలిపారు. కర్ణాటక ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన, కావేరీ జలాల అంశంలో అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన, రాజ్యాంగపరమైన మార్గాలను ప్రభుత్వం వినియోగిస్తుందని పేర్కొన్నారు.

