వృద్ధాప్య సమస్య రాజకీయం కాదు, సామాజిక హెచ్చరిక!
x

వృద్ధాప్య సమస్య రాజకీయం కాదు, సామాజిక హెచ్చరిక!

చంద్రబాబు 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ' ఏపీలో TFR 1.5 నుంచి 2.1కి పెంచాలన్న లక్ష్యం. 2047 నాటికి 23 శాతం వృద్ధులు! బడ్జెట్‌పై భారం ఎంత? ఇప్పటి నుంచే చర్యలు ఎందుకు?


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 2026లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 'డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ' రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) (Total Fertility Rate) 1.5కి పడిపోయింది. ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే చాలా తక్కువ. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23 నుంచి 24కు చేరుకుంటుందని అంచనాలు. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. ఇది కేవలం రాజకీయ వివాదం కాదు. సామాజిక, ఆర్థిక సవాలు. రాష్ట్ర బడ్జెట్‌పై పడే భారం, సామాజిక పరిణామాలు ఏమిటి? 20 ఏళ్ల తర్వాత వచ్చే సమస్యకు ఇప్పుడే ఎందుకు హైరానా? ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఏమిటి?

TFR పతనం జపాన్, ఇటలీ, దక్షిణ కొరియా మాదిరి ముప్పు!

1993లో ఏపీలో TFR 3.0 ఉండగా, 2023 నాటికి 1.5కి పడిపోయింది. 2023లో రాష్ట్రంలో సంవత్సరానికి 6.7 లక్షల జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది కొనసాగితే పని చేసే వయసు (వర్కింగ్ ఏజ్) జనాభా తగ్గి, ఆర్థిక వృద్ధి మందగమనం ఏర్పడుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 2047 నాటికి వృద్ధుల శాతం 23 కు చేరుకుంటే, పిల్లలు (0-14 ఏళ్లు) శాతం మరింత తగ్గుతుంది. ఇప్పటికే ఏపీ మధ్యస్థ వయసు (32.5 ఏళ్లు) వారు దేశ సగటు కంటే ఎక్కువ.

విశ్వవిద్యాలయాల్లో చర్చ

రాజమహేంద్రవరం, విశాఖ, తిరుపతి వంటి విశ్వవిద్యాలయాల్లో సోషియాలజీ, ఎకానమిక్స్ విభాగాలు ఈ అంశంపై సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాయి. "ఇది డెమోగ్రాఫిక్ డివిడెండ్ కోల్పోయే ప్రమాదం. కుటుంబ నిర్మాణం మారుతోంది. జాయింట్ ఫ్యామిలీలు కరిగిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరుగుతున్నాయి. వృద్ధుల ఒంటరితనం, మానసిక సమస్యలు పెరుగుతాయి" అని ఒక సీనియర్ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర బడ్జెట్‌పై పింఛన్లు, ఆరోగ్యం భారం!

ప్రస్తుతం ఏపీలో NTR భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద 62-68 లక్షల మందికి నెలవారీ పింఛన్లు అందుతున్నాయి. నెలకు సుమారు రూ. 2,700 కోట్లు (సంవత్సరానికి రూ. 32,500-33,600 కోట్లు) ఖర్చవుతోంది. ఇది రాష్ట్ర బడ్జెట్‌లో భారీ వాటా. 2047 నాటికి వృద్ధుల సంఖ్య పెరిగితే పింఛన్లు, వైద్యం, వృద్ధాశ్రమాలు, హెల్త్‌కేర్‌పై ఖర్చు మరింత పెరుగుతుంది.

జాతీయ స్థాయిలో కూడా వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్ కేటాయింపు 0.1శాతం కంటే తక్కువగా ఉంది. ఏపీలో కూడా ఇది సవాలు. పని చేసే వయసు జనాభా తగ్గితే ఆదాయం (ట్యాక్స్ రెవెన్యూ) తగ్గి, ఖర్చులు పెరిగి ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. "వృద్ధుల సంఖ్య పెరిగితే హెల్త్‌కేర్, పెన్షన్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురి చేస్తాయి. ఇప్పటికే పింఛన్లు బడ్జెట్‌లో 12-13 శాతం వాటా ఉంది" అని ఒక ఆర్థిక విశ్లేషకుడు అన్నారు.

సామాజిక పరిణామాలు ఏమిటి?

లేబర్ షార్టేజ్: యువత తగ్గితే పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీస్ సెక్టర్‌లో కార్మికుల కొరత.

కుటుంబ నిర్మాణం మార్పు: ఒంటరి వృద్ధుల సంఖ్య పెరిగి, మానసిక ఆరోగ్య సమస్యలు, లోన్లీనెస్ పెరుగుతాయి.

మహిళల పాత్ర: ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం (ప్రస్తుతం 31 శాతం) పెంచాల్సిన అవసరం. పాలసీలో ఇందుకు ప్రత్యేక దృష్టి.

రాజకీయ-సామాజిక సమతుల్యం: డీలిమిటేషన్ సమయంలో జనాభా తగ్గితే ప్రాతినిధ్యం తగ్గే అవకాశం.

20 ఏళ్ల తర్వాత వచ్చే సమస్యకు ఇప్పుడే ఎందుకు చర్యలు?

"డెమోగ్రాఫిక్ మార్పులు రాత్రికి రాత్రి జరగవు. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే జపాన్, ఇటలీ, సౌత్ కొరియా మాదిరి క్రైసిస్ ఎదురవుతుంది" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డెమోగ్రాఫిక్ మొమెంటం కారణంగా TFR పెంచడానికి 15-20 ఏళ్లు పడుతుంది. ఇప్పుడు చర్యలు తీసుకుంటే 2047 నాటికి సమతుల్యం సాధ్యం.

ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఏమిటి?

ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేస్తున్న ఈ పాలసీ దేశంలోనే మొదటిది. 'పోషణ-శిక్ష-సురక్ష' ప్యాకేజీ కింద ఈ పాలసీని అమలు చేస్తున్నారు.

రెండవ, మూడో బిడ్డ పుట్టినప్పుడు రూ. 25,000 ఒకేసారి.

మూడో బిడ్డకు నెలకు రూ. 1,000 (5 ఏళ్లు), 18 ఏళ్ల వరకు ఉచిత విద్య.

మాతృత్వం (మాతృత్వ), శక్తి (మహిళల ఉద్యోగాలు), క్షేమ (వృద్ధుల సంక్షేమం), నైపుణ్యం (స్కిల్లింగ్), సంజీవని (డిజిటల్ హెల్త్) – ఐదు స్తంభాలు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు, సబ్సిడీ IVF.

మాతృత్వ సెలవు 12 నెలలు, తండ్రులకు 2 నెలలు.

పని చేసే మహిళల హాస్టళ్లు, చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్లు, సేఫ్ ట్రాన్స్‌పోర్ట్.

ఇది కేవలం బర్త్ రేటు పెంచడం కాదు. మహిళలు, పిల్లలు, వృద్ధులను సమగ్రంగా ఆదుకునే లైఫ్ సైకిల్ అప్రోచ్.

ఏపీలో జనాభా నిర్వహణ పాలసీ ఒక దూరదృష్టి కలిగిన నిర్ణయం. ఇది రాజకీయ లాభాల కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం. విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సమాజం కలిసి ఈ చర్చను ముందుకు తీసుకెళ్లాలి. 2047 వైపు అడుగులు వేస్తున్న ఏపీకి ఇప్పుడే సమర్థవంతమైన చర్యలు అవసరం. లేకపోతే భవిష్యత్ తరాలు భారం మోయాల్సి వస్తుంది.

Read More
Next Story