గోదావరి పుష్కరాలపై ఏడాదిన్నర ముందుగానే సమీక్ష
x
గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

గోదావరి పుష్కరాలపై ఏడాదిన్నర ముందుగానే సమీక్ష

ఇప్పుడు గోదావరి పుస్కరాలపై చర్చ మొదలైంది. ఏడాదిన్నర ముందుగానే సమీక్ష అవసరమా? అనవసరమా? అనే చర్చ సాగుతోంది.


గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన అత్యున్నత సమీక్షా సమావేశం రాష్ట్ర రాజకీయ-పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయం ఉన్న నేపథ్యంలో, ఇంత ముందుగానే సమీక్ష నిర్వహించడం అవసరమా? లేక ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుచూపుతో అడుగులు వేస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని సీఎం ఆదేశాలు ఇస్తుండగా, ఈ ముందస్తు చర్యలు రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచుతాయా? లేక భక్తుల సౌకర్యాన్ని మెరుగు పరుస్తాయా? అనేది విశ్లేషించుకోవాల్సిన అంశం.

కుంభమేళా తరహాలో నిర్వహించాలని...

సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు, గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఏడాది అంటే 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గోదావరి నది 212 కిలోమీటర్ల పొడవున ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్నాన ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లు నిర్మించి, మొత్తం 373 ఘాట్లను 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించినట్టు అధికారులు వివరించారు. ముఖ్యంగా, కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు, తూర్పు గోదావరిలో 102 ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్ మెంట్ వినియోగం...

ఇంత ముందుగానే సమీక్ష నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని పరిశీలిస్తే... సీఎం దీర్ఘకాలిక దృష్టికోణం స్పష్టమవుతుంది. పోలవరం ప్రాజెక్టు పనులు పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని ఆదేశించడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్, ఆర్టీజీఎస్ సేవలు వినియోగించాలని సూచించడం వంటివి ప్రశంసనీయమే. మహా కుంభమేళాలో ఉపయోగించిన టెక్నాలజీని ఇక్కడా అమలు చేయాలని, భాషిణి యాప్ ద్వారా వివిధ భాషల భక్తులకు సేవలు అందించాలని చెప్పడం ఆధునికతను చాటుతోంది. అదనంగా టెంట్ సిటీలు, హోం స్టేలు, పార్కింగ్ ప్రాంతాలు, రూట్ మేనేజ్మెంట్ వంటి ఏర్పాట్లు భక్తుల రద్దీని నియంత్రించడంలో కీలకం. నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించడం కూడా ముందుచూపు చర్యగా చెప్పొచ్చు.

గతంలో భద్రతా లోపాలు

కానీ ఇక్కడే క్రిటికల్ పాయింట్ తలెత్తుతుంది. 18 నెలల ముందుగానే ఇంత భారీ సమీక్ష అవసరమా? రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ముందస్తు ఏర్పాట్లు అదనపు ఖర్చులకు దారితీస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గోదావరి పుష్కరాలు (2015లో చంద్రబాబు హయాంలోనే జరిగినవి) సమయంలో కూడా భారీ ఖర్చులు, ట్రాఫిక్ సమస్యలు, భద్రతా లోపాలు ఎదురయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే తరహా ఏర్పాట్లు చేస్తుండగా, ముందుగానే సమీక్ష చేయడం ప్రభుత్వానికి రాజకీయ మైలేజ్ ఇస్తుందా? లేక ఆచరణలో ఫలితాలు ఇస్తుందా? అనేది చూడాలి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించడం మంచిదే కానీ, దాని వ్యయం రాష్ట్ర బడ్జెట్‌పై భారం పడుతుంది. అలాగే ఏఐ టెక్నాలజీ, అదనపు బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు వంటివి అమలు చేయడానికి కేంద్ర సహకారం అవసరం, కానీ కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయో తెలియదు.

ముందస్తు చర్యలు భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తాయా?

సమీక్షలో ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించడం, అఖండ గోదావరి పేరుతో పరిసర ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక ప్రచారం వంటి అంశాలు ప్రజా భాగస్వామ్యాన్ని పెంచుతాయి. వేద పండితుల ఆశీర్వచనాలు, సీఎం తన అదృష్టంగా భావించడం వంటివి భక్తి భావాన్ని రేకెత్తిస్తాయి. కానీ పారిశుధ్యం, కనెక్టివిటీ, సెల్ సిగ్నల్స్ వంటి సమస్యలు ముందుగానే పరిష్కరించాలని సూచించడం మంచిదే అయినా, ఇంత ముందుగా సమీక్ష చేయడం వల్ల అధికార యంత్రాంగం ఒత్తిడికి గురవుతుందా? అనేది ప్రశ్నార్థకం. చివరగా ఈ ముందస్తు చర్యలు భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తాయా? లేక రాజకీయ ప్రకటనలుగా మిగిలిపోతాయా? అనేది చర్చకు దారి తీసిది. ప్రభుత్వం ఇప్పుడు పనులు వేగవంతం చేస్తుండగా, ప్రజలు ఫలితాలు ఆశిస్తున్నారు.

Read More
Next Story