కలియుగ వైకుంఠంలో అపురూప ఘట్టం.. శ్రీపద్మావతీ పరిణయ వేడుకలు
x
తిరుమలలో శనివారం రాత్రి ప్రారంభమైన శ్రీపద్మావతీదేవి వార్షిక పరిణోత్సవాలు

కలియుగ వైకుంఠంలో అపురూప ఘట్టం.. శ్రీపద్మావతీ పరిణయ వేడుకలు

ఐదు వేల ఏళ్ల నాటి పౌరాణిక వైభవం.. తిరుమల గిరుల్లో మళ్ళీ ఆనాటి కల్యాణ వేడుక!


తిరుమలలో ‘పరిణయ’ శోభ

భూలోక వైకుంఠంలా ఉద్యానవనాలు

శ్రీపద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

మూడు రోజుల పాటు వేడుకలు!

భూలోక వైకుంఠాన్ని తలపించిన దశావతార, అష్టలక్ష్మి మండపం

రేపు గరుడ వాహనంపై మలయప్ప స్వామి విహారం


తిరుమలలో శనివారం రాత్రి శ్రీపద్మావతీదేవి వార్షిక పరిణోత్సవాలు కనులపండువగా ప్రారంభం అయ్యాయి. మరో రెండు రోజులు సాయంత్రం వేళల్లో ఈ వేడుక కనులపండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

"సామాన్య యాత్రికులు కూడా కనులారా చూసే విధంగా సదుపాయాలు కల్పించాం"అని టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర తెలిపారు.

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార – అష్టలక్ష్మి మండపంలో శనివారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

పౌరాణిక ప్రాశస్త్యం
పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీపద్మావతిని శ్రీవేంకటేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.

ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.

కనుల పండువగా.. కల్యాణ వేడుక


శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమి రోజైన శనివారంనాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీ స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది.


ఈ క్రతువు తరువాత అనంతరం వివిధ రాగ- తాళ-వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తరువాత ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ లోకనాథం, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

మలయప్ప విహారం..


ఏప్రిల్ 25 శనివారం సాయత్రం శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై ఊరేగుతూ యాత్రికులకు దర్శనం ఇచ్చారు.

26వ తేదీ (ఆదివారం) మలయప్పస్వామి వారు అశ్వవాహనంపై ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనంలోకి ప్రవేశిస్తారు.
27వ తేదీ (సోమవారం తిరుమలలో అరుదైన ఉత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి మలయప్పస్వామివారు గరుడవాహనంపై ఊరేగుతూ శ్రీవారి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ, గ్యాలరీల్లోని యాత్రికులకు దర్శనం ఇస్తారు. అదే సమయంలో పద్మావతీదేవి చెంతకు నారాయణగిరి ఉద్యానవనంలోకి ప్రవేశిస్తారు.

రెండు టన్నుల పుష్పాలతో అలంకరణ...


"తిరుమలలో పద్మావతీదేవి పరిణయోత్సవాల కోసం టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రెండు టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అర టన్ను పండ్లు, 30 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. ఈ పెండ్లిమండం అలంకరణకు వంద మంది గార్డెన్ సిబ్బంది తోపాటు 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది సేవలు అందించారు. కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు" అని టీటీడీ ఉద్యాన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో శ్రీ శ్రీనివాస పద్మావతి పరిణయం, గజవాహనంపై విష్ణుమూర్తి, గజ లక్ష్మి, తామరపువ్వుపై విష్ణుమూర్తి, గోపాల కృష్ణుడు, అష్ట లక్ష్ముల రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Read More
Next Story