x

శ్రీవారి లడ్డూ ఘన చరిత్రకు 'దిట్టం'గా బంగారు నాణెం'

ఐడియా అదిరిందయ్యా...! తిరుమలలో చైర్మన్ చౌదరి చిరస్మరణీయ గుర్తుగా ఉండాలనే కదా..?


Click the Play button to hear this message in audio format

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ప్రధానమైంది లడ్డునే యాత్రికులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ ప్రసాదానికి 310 సంవత్సరాలు నిండాయని టీటీడీ భావిస్తున్నా, లడ్డూ ఎప్పటిది? అనే స్పష్టమైన సమాచారం లేదు. అయినా సరే లడ్డూ చిత్రంతో బంగారు నాణెం విడుదల చేయాలని సంకల్పించింది. అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే సెప్టెంబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నాణెం విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ నాణెం తీసుకుని రావాలనే ఆలోచన వెనుక కూడా బలమైన కారణం లేకపోలేది టీటీడీ అధికారికవర్గాల సమాచారం.
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ ఆరో తేదీ ముగుస్తుంది. మళ్లీ ఆయనకు పదవి కొనసాగుతుందో లేదో ? అనేది సందేహంగా ఉందని చెబుతున్నారు. తన పదవీకాలంలో చేపట్టిన అనేక సంస్కరణలు చిరస్థాయిగా ఉన్నా, తన మార్కు ముద్ర కోసం బంగారు నాణెం తయారీకి అధికారులను సమాయత్తం చేసినట్లు తెలిసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే దినుసులు, పదార్థాలతో వందల సంవత్సరాలుగా నాణ్యత, రుచిలో ఏమాత్రం తేడా కనిపించదు. అందువల్లో తిరుమల లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి అనుమతి ( GI Tag), పేటెంట్ రైట్ కూడా దక్కింది. తపాలా శాఖ కూడా ప్రత్యేక స్టాంపు కూడా విడుదల చేసింది. బంగారు నాణెం తయారీకి సిద్ధమైన టీటీడీలో బూందీ నుంచి లడ్డూ ప్రసాదంగా మారిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది.

తిరుమలలో బంగారు నాణేలు..

టీటీడీ సాధారణంగా విక్రయించే బంగారు నాణేలు/డాలర్లు రెండు గ్రాములు, ఐదు, 10 గ్రాముల బరువుతో శ్రీవారు, అమ్మవారి ముఖచిత్రంతో ప్రస్తుతం నాణెలు విక్రయిస్తోంది. లడ్డూ కోసం తయారు చేసే ఈ ప్రత్యేక స్మారక నాణెం బరువు, సైజు, స్వచ్ఛత (24 క్యారెట్) మరియు ధర వివరాలను ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం టీటీడీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
టీటీడీ వద్ద ఉండే బంగారు నిల్వలు, టెండర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మింట్ (Government Mint, SPMCIL) లేదా అధీకృత ప్రభుత్వ గోల్డ్ మింటింగ్ సంస్థలలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో (24K Gold) ఈ నాణేలను తయారు చేయించే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారవర్గాల సమాచారం.

రాజుల కాలం నుంచి.. లడ్డూ ప్రస్థానం

స్వామివారి ప్రసాదం కోసం రాజుల కాలంలోనే ఎన్నో దానాలు అందించారు. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారు. తర్వాత 1455లో సుఖీయం, అప్పం, 1460లో వడ, అత్తిరసం, 1468లో మనోహర పడి, 1547లో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను ప్రవేశపెట్టినట్లు చరిత్ర చెబుతోంది. అయితే, వడ మినహా మిగతా ప్రసాదాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశాలు లేకపోవడాన్ని గమనించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం..
శ్రీవారి ఆలయంలో తొలిసారిగా 1803లో ప్రసాదాల విక్రయాన్నిప్రారంభించింది. లడ్డు తయారీకి అవసరమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. ఇలా అనేక రకాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల విక్రయం చివరకు 1940 నుంచి తిరుపతి లడ్డుగా స్థిరపడింది. దీని కాస్త వెనక్కి వెళితే తాళ్లపాక పెద్ద తిరుమల ఆచార్యులు శాలివాహన సేవలలో 1936లో తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి కల్యాణోత్సవం ప్రవేశపెట్టించారనేది ఇతిహాసం. ఆ ఆచార వ్యవహారం కొనసాగుతూ ఆధునిక కాలంలో కూడా స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్లలో బూందీ లడ్డు ఇవ్వడం తెలుగింటి సంస్కృతి. స్వామి వారికి నిత్య కళ్యాణం సమయంలో కళ్యాణోత్సవం చేయించే గృహస్తులకు బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వడం ఆచారంగా మారింది.

లడ్డూ ప్రస్థానం..

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక ప్రసాదంగా ఇచ్చే లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మరి ఈ శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రయాణం ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా?"
15వ శతాబ్దంలో శ్రీవారి ప్రసాదంగా భక్తులకు ‘వడ’ను నివేదించేవారు.
ఆ తర్వాత కాలంలో వడల స్థానంలో ‘బూందీ’ ప్రసాదం అందుబాటులోకి వచ్చింది.
క్రీ.శ. 1715లో) ప్రస్తుతం మనం స్వీకరిస్తున్న ‘లడ్డూ’ తయారీ అధికారికంగా ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి.
1803: బ్రిటీషర్ల కాలంలోనే తిరుమల ఆలయంలో ప్రసాదాల విక్రయాలను క్రమబద్ధీకరించారు.

దిట్టం, భౌగోళిక గుర్తింపు

లడ్డూ తయారీకి ఉపయోగించే పదార్థాల కొలతలను ‘దిట్టం’ అంటారు. ఈ లడ్డూ ప్రత్యేకమైన రుచి, విశిష్టత కారణంగా దీనికి భౌగోళిక గుర్తింపు గా తిరుమల లడ్డూ ప్రసాదానికి 2009వ సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు (Geographical Indication - GI Tag) లభించింది.
లడ్డు తయారీకి " పడితర దిట్టం" అంటే లడ్డు తయారీకి కావాల్సిన ముడి సరుకుల మోతాదును టీటీడీ సిద్ధం చేసింది. "పడి" అంటే 51 వస్తువులు. దీనిని టిటిడి పాలకమండలి మొదటిసారి 1950 సంవత్సరంలో నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో భక్తుల సంఖ్య కూడా పెరిగింది. వీటన్నిటిని పరిశీలించిన టిటిడి యంత్రాంగం 2001లో సవరించిన దిట్టంతో లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్నారు. 5100 లడ్డూల తయారీకి వివిధ రకాలైన 83 కేజీల సరుకులు వినియోగిస్తారు.
ఆ దిట్టం ప్రకారం 5, 100 లడ్డూల తయారీకి 280 కిలోల ఆవు నెయ్యి, 200 కిలోల సెనగపిండి, 400 కిలోల చక్కెర, 35 కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండు ద్రాక్ష, 10 కిలోల కలకండ, ఐదు కిలోల యాలకులు అవసరం. ప్రస్తుతం "పోటు" ( వంటశాల)లో లక్ష వరకు లడ్డూలను తయారు చేసే సామర్థ్యానికి పెంచారు. కొన్ని సంవత్సరాల కిందట బూందీని పోటులో తయారు చేసి, వెలుపలకు తీసుకొచ్చిన అనంతరం నిత్యం మూడు నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూల తయారీ పెరిగింది.

లడ్డు తయారీ..

తిరుమల శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూల్లో అనేక రకాలను తయారు చేస్తున్నారు. కళ్యాణం తర్వాత టికెట్టు కొనుగోలు చేసిన వారికి 750 గ్రాముల లడ్డు ప్రసాదంగా అందిస్తారు. సాధారణ లడ్డు 140 నుంచి 170 గ్రాములు ఉంటుంది. విడిగా కొనుగోలు చేయాలంటే కళ్యాణం లడ్డు 200, సాధారణ లడ్డు రు. 50 వంతున టిటిడి విక్రయిస్తుంది. ఈ లడ్డు తయారీకి వాడుతున్న పట్టిక ఆధారంగా టీటీడీ లడ్డు ప్రసాదానికి 2008 జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) లభించింది. 2009లో జిఐ చట్టం 1999 ప్రకారం టిటిడి తయారు చేసే లడ్డుపై పేటెంట్ హక్కులు సాధించింది. దీనివల్ల ఇతరులు అదే పేరుతో ఈ తరహా లడ్డు తయారు చేయకుండా నిరోధించడానికి ఈ హక్కుల వల్ల చట్టబద్ధత లభించింది.

లడ్డూలు.. మూడు రకాలు

తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక క్షేత్రం లడ్డూలు కూడా వివిధ రకాలలో ఉన్నాయి.
ఆస్థానం లడ్డు: ఈ లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే అందిస్తారు. ఈ లడ్డు బరువు 750 గ్రాములు ఉంటుంది. ఈ లడ్డూ తయారీలో రూపొందించిన " దిట్టం" పరిమాణాని కంటే ఎక్కువ పదార్థాలు వాడతారు. అందులో ప్రధానంగా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు అదనంగా వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు.
కళ్యాణోత్సవ లడ్డు: శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్థులకు ఈ లడ్డు అందిస్తారు. ఈ లడ్డు కౌంటర్లలో అదనంగా కూడా కొనుగోలు చేసే వెసులుబాటును టిటిడి అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రోక్తం లడ్డు:పేరు విభిన్నంగా కనిపించినప్పటికీ .. తిరుమల శ్రీవారి పోటులో ఈ లడ్డును తయారు చేస్తారు. సాధారణ భక్తులకు కూడా ఈ లడ్డు రు. 50కి అందుబాటులో ఉంటుంది. ఎన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదాలకు అత్యంత ఆదరణ ఉంది. భక్తుల మనసెరిగిన టీటీడీ ప్రసాదాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాదు. సామాన్య భక్తుల కోసం రోజుకు దాదాపు 4.50 లక్షల లడ్డూలు తిరుమలలో విక్రయాలు సాగుతున్నాయి.
Read More
Next Story