
ఒడిశాలో దారుణం: యువతి ఒకే రోజు రెండుసార్లు అత్యాచారం, హత్య
ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్
ఒడిశాలో 23 ఏళ్ల యువతిని ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం చేశారు. ఆపై హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ దారుణం జగత్సింగ్పూర్ జిల్లా పరిధిలో జరిగింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 22న యువతి తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గుడికి రమ్మని పిలిచాడు. వచ్చిన వెంటనే ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రహమా బస్ స్టాండ్ వద్ద ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. బస్ స్టాండ్ వద్ద జార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి సాయం చేస్తానని చెప్పి తన మోటార్‌సైకిల్‌పై పారాదీప్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తాను ఉంటున్న అద్దె ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత ఆమెను పైకప్పు నుంచి కిందకు తోసివేయడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో అత్యాచారం, హత్యోదంతం వెలుగులోకి వచ్చాయి.
ఇద్దరు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని జగత్సింగ్పూర్ ఎస్పీ అంకిత్ కుమార్ వర్మ తెలిపారు. ఈ ఘటనపై నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న దారుణ సంఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

