
ప్రశాంత్ కిషోర్
బీహర్ ఉప ఎన్నికల్లో ‘పీకే’ ప్రభావం చూపిస్తాడా?
పట్టణ ప్రాంతాలపై బలమైన పట్టు కొనసాగిస్తున్న కమలదళం
బీహార్ రాజకీయాలు మరోసారి జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాయి. దీనికి ముఖ్యకారణం అంతకుముందు ఎన్నికల వ్యూహకర్తగా ఉండి, తరువాత ‘జన్ సురాజ్ పార్టీ’ స్థాపించిన ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం ఇక్కడ జరిగే ఉప ఎన్నికల బరిలో నిలిచాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మారిన తరువాత నితీన్ నబీన్ బంకిపూర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆయన ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా సేవలందిస్తున్నారు.
బీజేపీకి బలమైన కోట..
ఈ సీటు ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది బీజేపీకి అత్యంత బలమైన పట్టణ కంచుకోటలలో ఒకటి, అలాగే నితిన్ నబిన్ కుటుంబానికి కంచుకోట. అందువల్ల, పీకేగా ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ కిషోర్, నితిన్ నబిన్‌ను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే, ఈ ఎన్నికల పోరును ఆయనకు, నితిన్ నబిన్‌కు మధ్య పోరుగా పరిగణిస్తారు.
బంకిపూర్‌లో బీజేపీ అభ్యర్థి వెనుకే నితిన్ నబిన్ బలం, ముఖం, పలుకుబడి ఉంటాయి. పాట్నా నగర నడిబొడ్డున ఉన్న నితిన్ నబిన్ కుటుంబ కంచుకోట అయిన బంకిపూర్‌ను బీజేపీ కంచుకోటగా పరిగణిస్తారు. 1990ల నుంచి ఈ సీటును వరుసగా బీజేపీ- నబీన్ కుటుంబం గెలుచుకుంటూ వస్తోంది. ఈ స్థానానికి నితిన్ నబిన్ నాలుగు సార్లు, అతని తండ్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నబిన్ కిషోర్ సిన్హా కూడా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు.
2008కి ముందు ఈ సీటును పాట్నా వెస్ట్ అని పిలిచేవారు. నియోజకవర్గాల పునర్విజభన తరువాత ఈ అసెంబ్లీ సీటును బంకిపూర్ గా పేరు మార్చారు. "గత 30 ఏళ్లుగా బంకిపూర్‌లో పూర్తిగా బీజేపీదే ఆధిపత్యం" అని బీజేపీ నాయకురాలు సుష్మా సాహూ అన్నారు.
బంకిపూర్‌లో పీకే అభ్యర్థిగా నిలవడంతో, ఈ ఉప ఎన్నిక జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఈసారి ఆయన కొత్త పాత్రలో ఉన్నారు. ఇప్పటివరకు, పీకే ఇతర నాయకులు లేదా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం, వ్యూహాలు పన్నడంలో పేరు పొందారు. గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన జేఎస్పీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు.
ఇప్పుడు, మొదటిసారిగా, ఆయన ఓటర్ల నుంచి తన కోసం ఓట్లు అభ్యర్థించనున్నారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం "ఇలాంటి ఎన్నికల పోరును ఎన్నడూ ఊహించని బీజేపీ అధినేతతో మా నాయకుడు ప్రశాంత్ కిషోర్ నిస్సందేహంగా తలపడుతున్నారు.
ఆయన వారసత్వాన్ని కాపాడుకోవడానికి బీజేపీ అభ్యర్థికి నితిన్ నబిన్ పూర్తి మద్దతు ఇస్తారు. మేము దానికి సిద్ధంగా ఉన్నాము. జేఎస్పీ ప్రజల మద్దతుతో పోరాడుతుంది, పీకే ముఖమే మా ప్రధాన బలం" అని జేఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అన్నారు.
పీకే కంటే ఎక్కువగా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రతిష్ట ప్రమాదంలో ఉంది. ఆ సీటును నిలబెట్టుకోవడానికి పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఉప ఎన్నికకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి సీనియర్ నాయకులతో సమావేశమై, రహస్య సమావేశం నిర్వహించేందుకు నితిన్ నబిన్ మంగళవారం (జూలై 7) తన సొంత పట్టణమైన పాట్నాకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే రోజు, కొన్ని రోజుల ఊహాగానాలకు తెరదించుతూ బీజేపీ అభిషేక్ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
అభిషేక్ కుమార్ బీజేవైఎం యువ నాయకుడు, నితిన్ నబిన్‌కు సన్నిహితుడిగా పేరుంది. చాలా మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. నితిన్ నబిన్ లాగే అభిషేక్ కూడా అగ్రవర్ణ కాయస్థుడు. అయితే పీకే బరిలోకి దిగడం పట్ల స్థానికులు ఉత్సాహంగా ఉన్నారు.
స్థానిక ఓటర్లు ఏమంటున్నారు..
స్థానిక నివాసి అయిన లలన్ ప్రసాద్ గుప్తా మాట్లాడుతూ, “అవును, బీజేపీ మాకు ఇష్టమైన పార్టీ, అందుకే గత పలు ఎన్నికల్లో దానికే ఓటు వేశాము. ఇక్కడ బీజేపీ ఇప్పటికీ నంబర్ వన్ పార్టీయే. కానీ పీకే ప్రవేశం ఒక కొత్త మలుపునిచ్చి పరిస్థితిని మార్చవచ్చు. గతంలోని ఇతరులలా కాకుండా ఆయన బీజేపీకి గట్టి పోటీ ఇస్తారు” అని అన్నారు.
స్థానిక యువకుడు రంజిత్ కుమార్ కూడా గుప్తా మాటలనే చెప్పారు. రంజిత్ బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నాడు, ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నాడు. “బీజేపీ కేవలం భావోద్వేగపు ఎత్తుగడలు మాత్రమే వేసింది. ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని ఇప్పుడు మేము గ్రహించాము” అని ఆయన వ్యాఖ్యానించారు. "నితిన్ నబిన్ ఒక ఎమ్మెల్యే నుంచి బీహార్ మంత్రిగా, ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగిన తీరుకు బంకిపూర్ ప్రతీకగా నిలుస్తుంది. ఈ సీటు ఆయన రాజకీయ జీవితానికి ఊపునిచ్చింది.
ఈసారి ఆయన నేరుగా బరిలో ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పీకేకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని భావిస్తున్నాము" అని బీజేపీ నాయకుడు నవల్ కుమార్ అన్నారు. నితిన్ నబిన్ తండ్రి మరణానంతరం పాట్నా వెస్ట్ స్థానం ఖాళీ అవ్వడంతో, 2006 ప్రారంభంలో ఆయన తన మొదటి ఉప ఎన్నికలో పోటీ చేసినప్పటి నుంచి నవల్ కుమార్‌కు నితిన్ నబిన్‌తో పరిచయం ఉంది.
బీజేపీకి అనుకూలించే సీటు..
బంకిపూర్‌లో పీకేపై బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ఆర్జేడీ కూడా అభ్యర్థిని నిలబెట్టడంతో, ఆయన అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ ఉప ఎన్నిక పీకేకి కూడా ఒక అగ్నిపరీక్ష. "ఇది ఆయనకు ఏమాత్రం సులభమైన పోరు కాదు, ఎందుకంటే ఆయన బీజేపీ బలమైన సంస్థాగత నెట్‌వర్క్‌ను పట్టణ ప్రాంతాల్లోని దాని సామాజిక మద్దతు బలాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
బీజేపీలా కాకుండా, పీకే స్వయంగా ఎన్నికల రాజకీయాల క్షేత్రస్థాయి వాస్తవాలను రుచి చూస్తారు. ఆయన సామాజిక మద్దతు స్థావరాన్ని సృష్టించుకున్నారా లేదా అనేది ఇది వెల్లడిస్తుంది" అని ఆ విశ్లేషకుడు అన్నారు. గత నాలుగు ఎన్నికలలో నితిన్ నబిన్ బంకిపూర్‌లో అద్భుతమైన మెజారిటీతో గెలవడానికి కారణం, అక్కడి సామాజిక సమీకరణాలు బీజేపీకి అనుకూలంగా ఉండటమేనని ఆయన ఇంకా పేర్కొన్నారు.
స్థానిక, జాతీయ మీడియాలో ఎంత ప్రచారం జరిగినా, రాష్ట్రంలోని 243 స్థానాలకు గాను 238 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, 2025 రాష్ట్ర ఎన్నికలలో పీకే పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేదు.. ఆ పార్టీ కేవలం 3 శాతం ఓట్ల వాటాను మాత్రమే పొందింది. అయితే, పీకే తన పార్టీ ఈ దిగ్భ్రాంతికరమైన ప్రదర్శన నుంచి కోలుకున్నట్లు కనిపిస్తోంది. మళ్లీ ఎన్నికల బరిలోకి దిగడానికి ఉత్సాహంగా ఉన్నారు.
పీకే.. బంకిపూర్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
బంకిపూర్‌లో గెలుపు తన పార్టీ నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, అందుకే తాను ఒక "కఠినమైన స్థానం"లో పోటీ చేయడానికి ఎంచుకున్నానని పీకే ఇప్పటికే ప్రకటించారు. బీహార్ నలుమూలల నుంచి వందలాది మంది జేఎస్పీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు ఇప్పటికే పాట్నాకు చేరుకుని, పట్టణ ఓటర్లను సమీకరించడానికి ఇంటింటి ప్రచారం చిన్న పరిసర ప్రాంత సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ వ్యూహం పీకేకు పూర్తిగా అర్థమైందని జేఎస్పీ సీనియర్ నాయకుడు కిషోర్ కుమార్ మున్నా అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, బంకిపూర్‌లో పటిష్టమైన క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను, రాజకీయ పునాదిని సిద్ధం చేయడానికి జేఎస్పీ గత మూడు నెలలుగా తీవ్రంగా కృషి చేస్తోంది.
"ప్రతి వర్గం ఓటర్లను చేరుకోవడానికి జేఎస్పీ నాయకులు, కార్యకర్తలు బంకిపూర్‌లో నిరంతరం పనిచేస్తున్నారు. ప్రజలు మార్పు కోసం ఓటు వేసి, బీహార్‌లో నూతన రాజకీయాలకు మార్గం సుగమం చేసేందుకు పీకేను తమ గొంతుకగా ఎన్నుకుంటారని మాకు నమ్మకం ఉంది," అని ఆయన అన్నారు.
మురికి వాడలపై ప్రధాన దృష్టి..
జేఎస్పీ వర్గాల సమాచారం ప్రకారం, ఉప ఎన్నికలో పోటీ చేయాలనే తన నిర్ణయానికి చాలా కాలం ముందే పీకే స్వయంగా బంకిపూర్ కోసం ప్రణాళికను సిద్ధం చేశారు. బీజేపీ ఎన్నికల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో తమ ఉనికిని నిర్ధారించుకోవడానికి జేఎస్పీ బంకిపూర్‌ను వివిధ జోన్‌లుగా విభజించి, క్షేత్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.
ఓటర్లు తమ ఓటు వేయడానికి బూత్‌కు చేరుకోవడంలో సహాయపడటానికి, జేఎస్పీ 100కు పైగా బూత్-స్థాయి కమిటీలు, వార్డు-స్థాయి కమిటీలు, అలాగే బూత్-స్థాయి “టోలీలు” (అంటే యువకుల బృందం)తో కూడిన ఒక ఎన్నికల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.
అంతకుముందు, జేఎస్పీ కార్యకర్తలు పట్టణ పేదలను చేరుకోవడానికి మురికివాడలలో ఇంటింటికీ వెళ్లారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, వారి నాడిని అర్థం చేసుకోవడానికి, ఈ బృందం స్థానిక యువకులు, సీనియర్ సిటిజన్లు, వ్యాపారులు, మహిళలు, ఇతర సామాన్య ప్రజలను కూడా కలిసి ఒక సర్వే నిర్వహించింది.
"పాట్నాలోని 114 మురికివాడలలో 64 బంకిపూర్‌లోనే ఉన్నందున జేఎస్పీ మురికివాడలపై దృష్టి సారిస్తోంది. మురికివాడల ప్రజలు రాజకీయాల్లో మార్పునకు, ఒక కొత్త ముఖానికి తమ మద్దతును తెలిపారు. పీకే ఈ ప్రమాణాలకు సరిపోతారు" అని ఒక జేఎస్పీ నాయకుడు అన్నారు. అయితే, ప్రతిపక్షాన్ని ఏకం చేసి వారి మద్దతు పొందాలన్న పీకే ప్రయత్నం ఒక కలగానే మిగిలిపోయింది.
1980ల నుంచి రాజకీయ పరిశీలకుడిగా ఉన్న సత్య నారాయణ్ మదన్ మాట్లాడుతూ, బీజేపీకి పట్టణ ఓటర్లలోనే బలం ఉందని, వారు దాని హిందుత్వ రాజకీయాలను ఇష్టపడతారని అన్నారు. అంతేకాకుండా, గత మూడు దశాబ్దాలుగా కుల సమీకరణం కూడా దానికి అనుకూలంగా ఉంది.
బంకిపూర్‌లో గణనీయమైన జనాభా కలిగిన కాయస్థుల అఖండ మద్దతు, నితిన్ నబిన్, అతని తండ్రి బంకిపూర్‌లో పదేపదే విజయాలు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది. “ఇతర అగ్ర కులాలు, ఓబీసీ బనియాలు, ఈబీసీలు కూడా ఎన్నికల తర్వాత ఎన్నికలలో బీజేపీకి గట్టిగా మద్దతు ఇచ్చారు.
ఈ సామాజిక కూటమిని విచ్ఛిన్నం చేయడానికి పీకేకి పెద్దగా ఆస్కారం లేదు,” అని ఆయన అన్నారు. యువత, ముస్లింలు, యాదవుల విషయానికొస్తే, బరిలో ఆర్జేడీ ఉండటం వల్ల వారు చీలిపోయే అవకాశం ఉందని మదన్ అన్నారు.
పీకే.. బీజేపీని సవాలు చేయగలరా?
బీజేపీ అధికార ప్రతినిధి ప్రభాకర్ మిశ్రా మాట్లాడుతూ, “ప్రతిపక్షం చీలిపోయి తమలో తామే పోరాడుకుంటోంది. వారు బీజేపీని ఎలా సవాలు చేస్తారు?” అని అన్నారు. బంకిపూర్‌లో తమ అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆర్జేడీ నిర్ణయం, పీకేకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయంలో కాంగ్రెస్ శిబిరంలో నెలకొన్న అనిశ్చితిని మిశ్రా ప్రస్తావించారు. “బంకిపూర్‌లో బీజేపీకి ఎలాంటి సవాలు లేదు. "2025 అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు నితిన్ నబిన్ 51,000 ఓట్ల మెజారిటీతో ఈ సీటును గెలుచుకున్నారు" అని మిశ్రా తెలిపారు.
బంకిపూర్‌లో ఆర్జేడీ మళ్లీ రేఖా గుప్తాను బరిలోకి దింపింది. నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 44,000 ఓట్లు సాధించగా, జేఎస్పీ అభ్యర్థికి కేవలం 7,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. వర్గాల సమాచారం ప్రకారం, పీకే జూలై 11న తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. నామినేషన్ కు చివరి తేదీ జూలై 13. జూలై 30న ఉప ఎన్నిక జరగనుంది, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Next Story

