
పంజాబ్ పేపర్ లీక్ పై సీజేపీ ఎందుకు స్పందించడం లేదు?
సీజేపీ ఆమ్ ఆద్మీకి బీ టీమ్ అన్న స్వాతి మాలివాల్
పంజాబ్‌లో వరుసగా జరిగిన ప్రశ్నపత్రాల లీకుల వ్యవహారంపై బీజేపీ ఎంపీ, మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత స్వాతి మాలివాల్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆరు ప్రధాన పేపర్ లీక్‌లు జరిగినప్పటికీ, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. అలాగే కేజ్రీవాల్ అనుచరులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న "బొద్దింక జనతా పార్టీ" (సీజేపీ)ని ఆప్‌కు "బి-టీమ్"గా అభివర్ణించారు.
పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన మాలివాల్.. గత ఐదేళ్లలో పంజాబ్‌లో ఆరు ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, పలు నియామక పరీక్షల్లో కూడా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఇటీవల జూలై 19న నిర్వహించిన ఫార్మసీ పరీక్షలోనూ భారీగా మోసాలు జరిగాయని ఆమె ఆరోపించారు.
సీజేపీపై కూడా మాలివాల్ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ అనుచరులు, ఆయన ఆర్థిక సహకారంతోనే ఈ పార్టీ ఏర్పాటైందని, సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసిందని అన్నారు. జవాబుదారీతనంపై ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా కేజ్రీవాల్, సీజేపీ రెండూ మౌనం పాటిస్తున్నాయని ఆమె విమర్శించారు. పంజాబ్‌లో పేపర్ లీక్‌ల వంటి కీలక అంశాలపై స్పందించకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజలను వివిధ సమస్యలపై నిరసనలు చేయాలని కేజ్రీవాల్ పిలుపునిస్తుంటారని, కానీ పంజాబ్‌లో పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై మాత్రం పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని మాలివాల్ ఆరోపించారు. ఈ విషయంలో కేజ్రీవాల్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆమె విమర్శించారు.
పంజాబ్‌లో "సూపర్ ముఖ్యమంత్రి"లా వ్యవహరిస్తున్న కేజ్రీవాల్ ఈ వ్యవహారంపై నోరు విప్పడం లేదని మాలివాల్ అన్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై కూడా విమర్శలు చేస్తూ, ఆయన అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
పంజాబ్ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మాలివాల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేపర్ లీక్‌లపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
అయితే స్వాతి మాలివాల్ చేసిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది.

