‘‘సీఆర్పీఎఫ్ సిబ్బందికి అండగా నిలబడతాం’’
x
సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర సింగ్

‘‘సీఆర్పీఎఫ్ సిబ్బందికి అండగా నిలబడతాం’’

సీఆర్పీఎఫ్ డీజీ కీలక వ్యాఖ్యలు


ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా ఆందోళనకారులపై పెల్లెట్ గన్లు ఉపయోగించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన వేళ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విధి నిర్వహణలో ఎలాంటి భయం లేకుండా పనిచేయాలని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు.

కేంద్ర బలగాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన సింగ్, ఆపరేషనల్ బెటాలియన్లు అయినా, శాంతిభద్రతల విభాగాలు అయినా తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించే ప్రతి సిబ్బందికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలకు అవసరమైతే డైరెక్టర్ జనరల్‌గా తానే బాధ్యత వహిస్తానని ఆయన తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిర్భయంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

ఢిల్లీ నిరసనల సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) పెల్లెట్ గన్లు ఉపయోగించిందన్న ఆరోపణల నేపథ్యంలో, ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ ఇప్పటికే అంతర్గత సమీక్ష ప్రారంభించింది. ఇది దళం ప్రామాణిక కార్యాచరణ విధానంలో భాగమేనని జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వెల్లడించారు. సంఘటనల క్రమాన్ని పూర్తిగా పరిశీలించి, పెల్లెట్ గన్ల వినియోగం నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా అన్న అంశాన్ని ఈ సమీక్షలో తేల్చనున్నట్లు చెప్పారు.

ఇండియా టుడే కథనం ప్రకారం, ఇటీవల జరిగిన క్లిష్టమైన మోహరింపులో సిబ్బంది ప్రదర్శించిన సహనం, ఓర్పును సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం అభినందించింది. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే సిబ్బందికి సంస్థ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. అదే సమయంలో, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరంగా, క్రమశిక్షణాపరంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని పేర్కొంది.

అంతర్గత సమీక్షలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, మీడియా కథనాలు, ఘటనలో పాల్గొన్న జవాన్లు, కంపెనీ కమాండర్లు, సీనియర్ అధికారుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు. పెల్లెట్ గన్లతో పాటు షాక్ బాటన్ల వినియోగంపై వచ్చిన ఆరోపణలను కూడా విచారిస్తున్నారు. ప్రామాణిక కార్యాచరణ విధానాల ఉల్లంఘన జరిగినట్లు తేలితే అధికారిక కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.

మరోవైపు, శాంతియుత నిరసనకారులపై పెల్లెట్ గన్లు ప్రయోగించారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండిస్తున్నారు. అయితే ఈ అంశం ఇప్పటికే పార్లమెంట్‌తో పాటు సుప్రీంకోర్టు దృష్టికీ చేరింది. జూలై 20న జరిగిన నిరసనలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని, జనసమూహ నియంత్రణలో లోహపు పెల్లెట్ల వినియోగాన్ని నిషేధించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.


Read More
Next Story