‘సర్‘ పై చర్చకు ప్రతిపక్ష, విపక్షాలు ‘సై’
x
పార్లమెంట్ లో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

‘సర్‘ పై చర్చకు ప్రతిపక్ష, విపక్షాలు ‘సై’

ఎన్నికల సంస్కరణ పేరిట చర్చకు అంగీకరించిన ప్రభుత్వం


కొన్ని రోజులుగా రాష్ట్రాలలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా(సర్)పై వాడీవేడీగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే చర్చ పార్లమెంట్ లోనూ జరుగుతుందని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పార్లమెంట్ సమావేశాలలో ‘సర్’ పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో డిసెంబర్ 9 న ప్రభుత్వం ఈ అంశాన్ని చర్చకు పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే ప్రత్యేకంగా ‘సర్’ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట చర్చించనున్నట్లు వెల్లడించింది. ఈ చర్చలలో విపక్షాలు కచ్చితంగా ‘సర్’ ను ప్రస్తావిస్తాయి. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ జరుగుతోంది.

ప్రతిపక్షాలు ఎందుకు ఆసక్తిగా ఉన్నాయి?
పశ్చిమ బెంగాల్ లో ‘సర్’ నిర్వహించడంపై అక్కడ గత పదిహేను సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల సంస్కరణ ప్రక్రియను ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేసిన అవి సఫలం కాలేదు.
శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే రాజ్యసభ కొత్త చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ను సత్కరించిన విపక్షాలు, వెంటనే తమ ఎజెండాను ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగా ‘‘ఎన్నికల సంస్కరణ పేరిట’’ పార్లమెంట్ లో చర్చ నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజుజు టీఎంసీ సభ్యుడు డెరిక్ ఓబ్రియన్ కు హమీ ఇచ్చారు. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గ, సీపీఐ(ఎం) చెందిన జాన్ బ్రిట్టాస్ కూడా ఇదే డిమాండ్ చేశారు.
బీహార్ ఎన్నికల సమయంలో ‘సర్’ విస్తృతంగా చర్చకు దారి తీసింది. రాహుల్ గాంధీ ఓట్ చోరి అంటూ బీహార్ లో కొన్ని కీలక ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేశారు.
అయితే బీహార్ ప్రజలు రాహుల్ గాంధీ సహ ఇతర విపక్షాలు చేసిన ఓట్ చోరి ఆరోపణలను పట్టించుకోకుండా అధికార ఎన్డీఏ కూటమికి బంఫర్ మెజార్టీని కట్టబెట్టారు. అయితే పనిభారం కారణంగా అనేక మంది బ్లాక్ ఆఫీసర్లు(బీఎల్ఓ) ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మరోసారి సర్ పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
బీహార్ లో సామూహికంగా అనేక వేలమందిని ఓటర్ జాబితా నుంచి తొలగించారని కూడా ‘ఇండి’ కూటమి ఆరోపిస్తుంది. వచ్చే సంవత్సరం లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇక్కడ ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ లేదా ’సర్‘ ను నిర్వహిస్తోంది. దీనిపై రాష్ట్రంలో ఉన్న అధికార పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. లోక్ సభలో కాంగ్రెస్, ఆప్, సమాజ్ వాద్ పార్టీ, టీఎంసీ లు దీనిపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి.
బ్యాక్ డోర్ ఎన్ఆర్సీగా ‘సర్’
దేశంలోకి అక్రమంగా చొరబడిన అక్రమ వలసదారులను తొలగించే జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) ను రహస్యంగా అమలు చేయడమే లక్ష్యంగా ‘సర్’ ను తీసుకొచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న బెంగాల్ కు వేల సంఖ్యలో అక్రమచొరబాట్లు జరుగుతున్నాయని ‘సర్’ నిర్వహణ సందర్భంగా జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివలన అక్రమంగా ఓటర్ల జాబితాలో చేర్చిన అనేక వేలాది ఓట్లు తొలగిపోతాయని కొన్ని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. అందుకే టీఎంసీ దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.
తమిళనాడులోనూ ఇదే తరహ ఆరోపణలు వస్తున్నాయి. ‘సర్’ తో బలహీనవర్గాల ఓటు హక్కు తొలగిపోయే అవకాశం ఉందని పాలక డీఎంకే సహ ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేరళలోనూ అధికార సీపీఎం పార్టీ కూడా సర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కూడా వేలాదిగా బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఓటు హక్కు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సంక్షేమ పథకాలు..
‘సర్’ ప్రక్రియ వల్ల బలహీన వర్గాల ఓటు హక్కు ప్రమాదంలో పడటమే కాకుండా, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు కూడా ప్రమాదంలో పడతాయని విపక్షాలు వాదిస్తున్నాయి.
అధికారుల ఒడిదుడుకులు, లోపభూయిష్టపు కాగితపు పని, సాంకేతిక అడ్డంకుల కారణంగా చాలా మంది పేదలు, అణగారిన వర్గాలు ఇప్పటికే ప్రయోజనాలు పొందలేని స్థితిలో ఉన్నాయి. వారి పౌరసత్వం పరిశీలనలోకి వస్తే వారి జీవితానికి ఉపయోగపడే పత్రాలు అందుబాటులో లేవు.
కాంగ్రెస్ ఓట్ చోరీ..
బీహార్ లో ఎన్నికలలో ఓట్ చోరీ ఆరోపణలు చేసినప్పటిక కాంగ్రెస్ పార్టీ దారుణంగా పరాజయం పాలైంది. ఆ పార్టీకి 50 కి పైగా స్థానాలలో పోటీ చేయగా కేవలం ఆరు స్థానాలు గెలుచుకుంది.
అది కూడా ఆర్జేడీ సహ మిగిలిన పక్షాల మద్దతుతో సాధించుకుంది. అయినప్పటికీ అదిమరోసారి ఓట్ చోరి పై విపక్షాలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో సైతం విపక్ష నేత రాహుల్ గాంధీ ఇదే తరహ ఆరోపణలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలోనూ ఇవే తరహ పాలిటిక్స్ చేసిన ప్రజా ఆదరణ దక్కలేదు.
కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో చెప్పుకో దగ్గ సీట్లను సాధించలేకపోయింది. మహారాష్ట్ర, హర్యానాలో అయితే కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది.
వందేమాతరంపై నిన్న పార్లమెంట్ లో జరిగిన చర్చలో ప్రియాంక వాద్రా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి ప్రాధాన్యం ఇస్తోందని తాము ప్రజల పక్షాన పోరాడుతున్నామని అన్నారు. ప్రస్తుత సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ సర్ పై నిరసన వ్యక్తం చేయడం చూస్తుంటే మరోసారి మాటల యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం చర్చను ఎలా నిర్వహిస్తుంది?
గతవారం రోజులుగా విపక్షాలు ‘సర్’ పై తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సర్ ను రాజ్యాంగ ప్రతిపత్తి గల ఈసీ నిర్వహిస్తుందని, బీజేపీ వాదిస్తోంది. అయితే ఇది జరిపే సమయంపైన విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
మోదీ ప్రభుత్వం ప్రస్తుతం దీన్ని ఎన్నికల సంస్కరణ పేరిట చర్చకు అంగీకరించింది. బీహార్ ఎన్నికలలో ఆ పార్టీ కూటమి ఘన విజయం సాధించడంతో సర్ కు ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని, ప్రతిపక్షాలు చేసేవి పసలేని ఆరోపణలని అది తిప్పికొట్టే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేని ఆక్రోశాన్ని పార్లమెంట్ వేదికగా విపక్షాలు నినాదాల రూపంలో చూపిస్తున్నాయని మోదీ ఇప్పటికే ఎదురుదాడికి దిగారు.
ఈసీ నుంచి..
ఇంతకుముందు ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారని నిందలు మోపిన ఈ విపక్షాలు, కొద్దికాలంగా ఓట్ చోరి అంటూ కొత్త రాగం మొదలు పెట్టాయి. దాని విశ్వసనీయతను దెబ్బతీయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
ఓట్ చోరీ అంటూ దేశ వ్యాప్తంగా రగడ చేస్తున్నాయి. అయితే వాటి ఆరోపణలు ఈసీ తోసిపుచ్చుతోంది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై 24 గంటల్లో అఫిడవిట్ ఇవ్వాలని స్వయంగా సీఈసీ కోరినప్పటికి ఆ పార్టీ స్పందించలేదు.
మరో వైపు రాజ్యాంగబద్దంగా తనకు దక్కిన అన్ని అధికారాలను ఉపయోగించుకుంటూ అక్రమ విదేశీయులు ఎవరైన ఎన్నికల జాబితాలో ఉంటే వారిని తొలగించే ప్రయత్నం చేస్తోంది.


Read More
Next Story