పార్లమెంట్ సమావేశాలపై రాహుల్ తో రిజిజు భేటీ
x
కేంద్రమంత్రి కిరణ్ రిజుజు

పార్లమెంట్ సమావేశాలపై రాహుల్ తో రిజిజు భేటీ

హాజరైన ప్రియాంక, కేసీ వేణుగోపాల్


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఇందులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు, ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పార్లమెంట్ హౌస్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 50 నిమిషాల పాటు సాగింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలు గౌరవ్ గోగోయ్, కేసీ వేణుగోపాల్ కూడా చర్చల్లో చేరినట్లు తెలిసింది.

గత పది రోజుల్లో రాహుల్ గాంధీతో కిరణ్ రిజిజు సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ భేటీ అనంతరం రిజిజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలతో కూడా సంప్రదింపులు జరపనున్నట్లు సమాచారం.

ఇక జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల నుంచి లోక్‌సభలో తరచూ అంతరాయాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా ప్రశ్నోత్తరాల సమయం పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోతున్నారు. చర్చ లేకుండానే ఇప్పటికే ఐదు బిల్లులు ఆమోదం పొందగా, విద్యార్థులపై పోలీసుల చర్యలు సహా పలు అంశాలపై ప్రతిపక్షం నిరసనలు కొనసాగించడంతో బుధవారం కూడా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

సభ ప్రారంభమైన వెంటనే సభ్యులు తమ తమ స్థానాలకు వెళ్లి ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేలా సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. సభలోనూ, బయటా నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని, అలాంటి చర్యలు సభ గౌరవాన్ని దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రజా సమస్యలకు సంబంధించిన ప్రశ్నలు జాబితాలో ఉన్నప్పటికీ, అంతరాయాల కారణంగా వాటిపై చర్చ జరగకపోవడంపై పలువురు సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు బిర్లా వెల్లడించారు.

మరోవైపు, పార్లమెంట్ సమావేశాలకు ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ప్రేరణా స్థల్‌లోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మకర ద్వార్ వరకు కొనసాగింది. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూలై 20న సీజేపీ నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యలు, అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలు, అలాగే ఇతర పలు అంశాలపై ప్రతిపక్షం తమ నిరసనను వ్యక్తం చేసింది.


Read More
Next Story