‘ఆప్’ను కాంగ్రెస్ మరోసారి గెలిపించనుందా?
x

‘ఆప్’ను కాంగ్రెస్ మరోసారి గెలిపించనుందా?

పంజాబ్ లో వర్గ పోరాటాలతో పతనం అంచుకు చేరిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ


పంజాబ్ కాంగ్రెస్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన వర్గపోరాటాలు.. 2027 ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ గందరగోళం వచ్చే ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి అనూహ్యంగా రాజకీయ ప్రయోజనం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే, రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితి ఇంతగా దిగజారుతున్నా.. పార్టీ హైకమాండ్ ఎందుకు నేరుగా జోక్యం చేసుకోవడం లేదన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. రాష్ట్ర నాయకత్వంలో మార్పు అవసరమని సూచించిన అంతర్గత సర్వే జరిగినప్పటికీ.. అధిష్ఠానం మాత్రం సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజా వివాదం ఏంటి?

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ భూపేష్ బఘేల్‌తో కలిసి నిర్వహించిన బహిరంగ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, సీనియర్ నేత సుఖ్‌జిందర్ సింగ్ రంధావా హాజరు కాకపోవడం తాజా విభేదాలకు కారణమైంది.

ఆప్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ భావిస్తున్న సమయంలో.. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీ తనలో తానే కుమ్ములాడుకోవడం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది.

'ది ఫెడరల్' రాజకీయ సంపాదకుడు పునీత్ నికోలస్ యాదవ్ అభిప్రాయం ప్రకారం.. కొద్ది నెలల క్రితం వరకు పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుని తిరిగి అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ ఇప్పుడు పార్టీ అంతర్గత కలహాలు మరింత ముదరడంతో కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.

నాయకత్వ మార్పు సిఫార్సు చేసినా..

కాంగ్రెస్ నాయకత్వ సమస్యను పరిష్కరించడంలో హైకమాండ్ అనుసరించిన విధానం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందని యాదవ్ చెబుతున్నారు.

సుమారు రెండు నెలల క్రితం కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ సంస్థ చేపట్టిన అంతర్గత సర్వేలో రాజా వారింగ్‌ను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి మార్చాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆయన స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముందుకు తీసుకురావాలని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాల్వా ప్రాంతంలోని సంప్రదాయ దళిత మద్దతు వర్గాలను దాటి చన్నీకి ప్రజాదరణ పెరుగుతోందని సర్వే గుర్తించినట్లు యాదవ్ తెలిపారు.

అయితే సర్వే సూచనలను పూర్తిగా అమలు చేయకుండా కాంగ్రెస్ అధిష్ఠానం అందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. రాజా వారింగ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే.. చన్నీకి ప్రచార కమిటీ బాధ్యతలు, రంధావాకు కోర్ కమిటీ బాధ్యతలు, విజయ్ ఇందర్ సింగ్లాకు సమన్వయ ప్యానెల్ బాధ్యతలు అప్పగించింది.

దీంతో సమస్య పరిష్కారం కాకుండా.. పార్టీలో మరిన్ని అధికార కేంద్రాలు ఏర్పడ్డాయని విమర్శలు వచ్చాయి. దీనివల్ల నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి మరింత పెరిగిందని యాదవ్ పేర్కొన్నారు.

హైకమాండ్ జోక్యంపై ప్రశ్నలు

భూపేష్ బఘేల్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, సుఖ్‌జిందర్ సింగ్ రంధావా, రాణా గుర్జిత్ సింగ్ మధ్య విభేదాలు పెరుగుతున్న సమయంలోనూ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నేరుగా రంగంలోకి దిగకపోవడం చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను నేరుగా కలవాలని పంజాబ్ నేతలు ప్రయత్నించినప్పటికీ.. వారిని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో చర్చించాలని సూచించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర నేతల్లో అసంతృప్తి మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజా వారింగ్ స్వచ్ఛందంగా తప్పుకోవడం ద్వారా మాత్రమే సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశం ఉందని యాదవ్ అభిప్రాయపడ్డారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే.. 2022 ఎన్నికల్లో ఆప్ చేతిలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర పరాజయం మరోసారి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ గందరగోళం.. ఆప్‌కు లాభం?

పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూడా విమర్శలను ఎదుర్కొంటోంది. పేపర్ లీక్ వివాదాలు, మాదకద్రవ్యాల సమస్య, శాంతిభద్రతలపై ఆందోళనలు, ఆర్థిక ఒత్తిడి, వేర్పాటువాద భావనలు మళ్లీ పెరిగే అవకాశాలపై చర్చ జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్‌లో ఈ అంతర్గత పోరు కొనసాగుతోంది.

ఆప్ ప్రభుత్వ బలహీనతలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కాంగ్రెస్.. ప్రస్తుతం తనలో తానే పోరాడుకోవడంలో మునిగిపోయిందని యాదవ్ వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితి 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకవైపు ఆప్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. శిరోమణి అకాలీదళ్ వరుస పరాజయాల నుంచి ఇంకా కోలుకోలేదు. బీజేపీకి కూడా రాష్ట్రంలో బలమైన స్వతంత్ర రాజకీయ పునాది ఏర్పడలేదు.

దీంతో పంజాబ్‌లో సమర్థవంతమైన, సంఘటిత ప్రతిపక్షం లేకపోవడం రాజకీయ శూన్యతకు దారితీసే అవకాశం ఉంది. 2027 ఎన్నికలకు ముందు ఏర్పడే ఈ రాజకీయ ఖాళీని వివిధ రాజకీయ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Read More
Next Story