
గువాహటి హోటల్ కాల్పుల కేసులో కీలక మలుపు..
ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతం
అసోంలోని గువాహటి హోటల్‌లో ఐదుగురి ప్రాణాలు తీసిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఘనకాంత గొగోయ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. పోలీసుల అదుపులో ఉన్న అతడు విచారణ అధికారిపై దాడి చేసి, ఆయన సర్వీస్ గన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం సిబ్‌సాగర్ జిల్లాలోని గౌరిసాగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
34 ఏళ్ల ఘనకాంత గొగోయ్‌ను మంగళవారం గువాహటిలోని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం 2024లో నమోదైన బ్యాంకు మోసం కేసులో సిబ్‌సాగర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ కేసు విచారణ కోసం సిబ్‌సాగర్‌కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. మార్గమధ్యంలో వాహనం నుంచి కిందకు దిగిన సమయంలో గొగోయ్ విచారణ అధికారిపై దాడి చేసి, ఆయన వద్ద ఉన్న తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడే ఉన్న సిబ్‌సాగర్ సదర్ పోలీస్ స్టేషన్ అధికారి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన గొగోయ్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గొగోయ్ శిక్షణ పొందిన షూటర్ అని, వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించడంలో అనుభవం ఉందని పోలీసులు తెలిపారు.
ఇక ఈ కేసుకు కారణమైన కాల్పుల ఘటన అక్టోబర్ 26 రాత్రి గువాహటిలోని బోరా సర్వీస్ ప్రాంతంలో ఉన్న బిలాస్ ఇన్ హోటల్‌లో జరిగింది. హోటల్ నిర్వహణ విషయంలో యాజమాన్యానికి, లీజుదారుడికి మధ్య తలెత్తిన వివాదమే కాల్పులకు దారితీసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మొత్తం ఐదుగురు మరణించగా, మరొకరు గాయపడ్డారు.
తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ కేసులో కీలక నిందితుడి కథ ముగిసింది. అయితే హోటల్‌లో జరిగిన కాల్పులకు దారితీసిన పరిస్థితులు, ఇతరుల పాత్రపై దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

