
శ్రేష్ఠ పథకం విద్యార్థులకు ‘నాన్-లోకల్’ ముద్ర
సొంత రాష్ట్రంలోనే ప్రతిభావంతులైన వెయ్యి మంది దళిత విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘శ్రేష్ఠ’ (SHRESHTA) పథకం ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు వేయ్యి మంది దళిత విద్యార్థులు, తిరిగి సొంత రాష్ట్రంలోనే ‘నాన్-లోకల్’గా మారి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది వారి ఉన్నత విద్యా ప్రవేశాలను (NEET, EAPCET) ప్రమాదంలో పడేస్తోంది.
‘ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ (PAAP) ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం సమర్పించింది. “ప్రభుత్వమే ప్రోత్సహించి ఇతర రాష్ట్రాలకు పంపిన విద్యార్థులను తిరిగి వచ్చినప్పుడు ‘నాన్-లోకల్’ అనడం విచారకరం. ఇది వారి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడమే” అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రేష్ఠ పథకం కింద చదువుతున్న యంగ్ స్టూడెంట్స్ గ్రూప్
సమస్య ఏమిటి?
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (NETS)లో మెరిట్ సాధించిన ఎస్సీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, హాస్టల్ సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం శ్రేష్ఠ పథకాన్ని ప్రారంభించింది. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 1,000 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ఎంపికై ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నారు. వీరు ప్రస్తుతం NEET, EAPCET వంటి ప్రవేశ పరీక్షల ద్వారా ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఆర్డర్ 1974 ప్రకారం, స్థానికత (Local Status) పొందాలంటే వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో చదువుకోవాలి. దీంతో శ్రేష్ఠ పథకం ద్వారా బయట చదువుకున్న విద్యార్థులు సాంకేతికంగా ‘నాన్-లోకల్’గా మారుతున్నారు. ఫలితంగా 85 శాతం లోకల్ రిజర్వేషన్ సీట్లు కోల్పోతున్నారు. కేవలం 15 శాతం అన్‌రిజర్వ్డ్ సీట్ల కోసం తీవ్ర పోటీ పడాల్సి వస్తోంది.
తల్లిదండ్రుల డిమాండ్లు
పేరెంట్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, APSCHE చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు పంపింది. వారి ప్రధాన డిమాండ్లు.
శ్రేష్ఠ పథకం ద్వారా బయట రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులకు తల్లిదండ్రుల నివాస స్థలం ఆధారంగా ‘లోకల్’ స్థానికత హోదా కల్పించాలి.
ప్రస్తుత అడ్మిషన్ల ప్రక్రియలో ఈ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యాశాఖ, APSCHEకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలి.
జిల్లా కలెక్టర్లు తల్లిదండ్రుల నివాస ధృవీకరణ ఆధారంగా స్థానికత సర్టిఫికెట్లు జారీ చేయాలి.
ప్రతిభావంతులైన దళిత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని PAAP తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరిత చర్యలు తీసుకుంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

